- సికింద్రాబాద్, హైదరాబాద్‌ను మంచి నిర్మాణం
- 19 ప్లాట్‌ఫాంలతో అత్యాధునిక ఏర్పాట్లు
- త్వరలోనే అందుబాటులోకి రైల్వే స్టేషన్
హైదరాబాద్, జూలై 13 (విజయక్రాంతి): రాష్ట్రంలోనే అతి పెద్ద రైల్వే స్టేషన్ త్వరలో ప్రజలకు సేవలు అందించనుంది. రూ.434 కోట్లతో రూపుదిద్దుకున్న చర్లపల్లి రైల్వే స్టేషన్ పనులు దాదాపుగా పూర్తి కావచ్చాయి. త్వరలోనే దీని ప్రారంభోత్సవాన్ని ఏర్పాటు చేసేందుకు రైల్వే శాఖ అధికారులు సిద్ధమవుతున్నారు. ఎన్నికలకు ముందే ఈ స్టేషన్‌ను ప్రారంభించేందుకు ప్రయత్నించినా పనులు కాస్త ఆలస్యం అవ్వడం, అప్పుడే కోడ్ రావడంతో ప్రారంభోత్సవం వాయిదా పడింది. ఇప్పుడు కిషన్‌రెడ్డి తిరిగి కేంద్రమంత్రి అవ్వడం, చర్లపల్లి సైతం బీజేపీ ఎంపీగా ఉన్న ఈటల రాజేందర్ పరిధిలోనే ఉండటం విశేషం. రైల్వే మంత్రిగా తిరిగి అశ్వినివైష్ణవ్‌కే అవకాశం దక్కడంతో త్వరలోనే ఈ స్టేషన్ ప్రారంభోత్సవ కార్యక్రమం ఉంటుందని రైల్వే అధికారులు చెప్తున్నారు. చర్లపల్లి ప్రారంభోత్సవానికి ప్రధాని మోదీని ఆహ్వానించేందుకు సైతం ప్రయత్నాలు జరుగుతున్నట్లు సమాచారం. ఆగస్టులోపు చర్లపల్లి రైల్వే స్టేషన్ ప్రారంభోత్సవం ఉం టుందని తెలుస్తోంది.
ఫ్లాట్‌ఫాంలు సరిపోక..
తెలంగాణలో సికింద్రాబాద్ రైల్వేస్టేషన్‌లో 10, హైదరాబాద్‌లో 6, లింగంపల్లిలో 6, కాచిగూడలో 5 రైల్వే ప్లాట్‌ఫాంలున్నా యి. ఇవి రైల్వే రాకపోకలకు ఏ విధంగానూ సరిపోవడం లేదు. దీంతో నగరానికి వచ్చే రైళ్లు ప్లాట్‌ఫాంలు దొరకక గంటల తరబడి స్టేషన్ల బయట వేచిచూడాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఫలితంగా ప్రయాణీకులు తమ గమ్యస్థానాలకు చేరుకోవడంలో ఆలస్యం అవుతోంది. దీంతో రైల్వే ప్రయాణాలంటేనే హడలిపోయే పరిస్థితి వచ్చింది. రైళ్ల రద్దీ బాగా పెరిగిపోయి ఎంఎంటీఎస్ రైళ్ల రాకపోకలు అధ్వానంగా మారాయి. సగానికి కంటే ఎక్కువ ఎంఎంటీఎస్ రైళ్లను రద్దు చేశారు. ఉన్న రైళ్లు వేళాపాల లేకుండా తిరుగుతున్నాయి.
అత్యాధునిక స్టేషన్
ప్లాట్‌ఫాంల కొరతను అధిగమించేందుకు సికింద్రాబాద్, కాచిగూడ, హైదరా బాద్, లింగంపల్లి స్టేషన్లకు ప్రత్యమ్నాయంగా చర్లపల్లిని రూ.434 కోట్లతో నిర్మించారు. ఇక్కడ 19 ప్లాట్‌ఫాంలున్నాయి. ఫలితంగా దూరప్రాంతాల నుంచి వచ్చే రైళ్లను ఇక్కడివరకే నడుపుతారు. దీంతో నగరంలోని మిగతా 3 స్టేషన్లపై భారం తగ్గుతుంది. చర్లపల్లి రైల్వే స్టేషన్ చూస్తే అదో విమానాశ్రయం అనుకునేలా నిర్మితమవుతున్నది. ఎస్కలేటర్లు, లిఫ్టులు, అధునాతన ఫుడ్ కోర్టులు, విశాలమైన పార్కింగ్, మోడరన్ వెయిటింగ్ ఏరియాతో పాటు అనేక సదుపాయాలతో చర్లపల్లి సిద్ధమయింది.
రద్దీ తగ్గిస్తుంది
చర్లపల్లి రైల్వే స్టేషన్‌ను రూ.434 కోట్లతో అత్యాధునికంగా నిర్మిస్తున్నాం. ప్రస్తుతం దాదాపు 98 శాతం పనులు పూర్తయ్యాయి. 19 ప్లాట్‌ఫాంలతో నిర్మితమవుతున్న ఈ స్టేషన్ వల్ల ప్రయా ణికుల సమస్యలు తీరుతాయి. ఇక్కడి నుంచి 15 జతల రైళ్లు రాకపోకలు సాగించేందుకు వీలుంది. ఫలితంగా మి గతా రైళ్లు సమయానికి గమ్యస్థానాలకు చేరుకునే అవకాశం ఏర్పడుతుంది. రైల్వేస్టేషన్ల అభివృద్ధికి తమ ప్రభుత్వం కట్టు బడి ఉందని నిరూపించేందుకు చర్లపల్లి ఓ ఉదాహరణ.
- కిషన్‌రెడ్డి, కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి