29-04-2025 01:05:09 AM
కలెక్టర్ అద్వైత్ కుమార్ సింగ్
మహబూబాబాద్, ఏప్రిల్ 28 (విజయ క్రాంతి): ప్రభుత్వం నూతనంగా ప్రవేశపెట్టిన భూభారతి 25 ఆర్ ఓ ఆర్ చట్టం చారిత్రాత్మకమైనదని, రైతులకు సులభంగా భూ సమస్యలకు క్షేత్రస్థాయిలోనే పరిష్కారం చూపే విధంగా ఉంటుందని మహబూబాబాద్ జిల్లా కలెక్టర్ అద్వైత్ కుమార్ సింగ్ అన్నారు.
జిల్లాలోని పెద్ద వంగర, తొర్రూరు మండలాల్లో సోమవారం భూభారతి 25 చట్టం అమలు తీరుపై అవగాహన సదస్సులు నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ గతంలో ధరణి పోర్టల్ ద్వారా అనేక ఇబ్బందులు తలెత్తి, భూ సమస్యలను పరిష్కరించలేకపోయారని, ఇప్పుడు భూభారతి చట్టం ద్వారా క్షేత్రస్థాయిలోనే సమస్యలకు పరిష్కారం ఊపడం జరుగుతుందన్నారు.
సమస్యపై దరఖాస్తులు రాగానే మీరు వర్గాల వారికి నోటీసులు జారీ చేసి తహసిల్దార్, ఆర్డిఓ, కలెక్టర్ స్థాయి లో నిర్ణీత వ్యవధిలో పరిష్కారం చూపడానికి చట్టం లో పొందుపరిచామన్నారు. అదనపు కలెక్టర్ కె.వీరబ్రహ్మచారి, ఆర్డీవో గణేష్, ల్యాండ్ సర్వే అడిషనల్ డైరెక్టర్ నరసింహమూర్తి, తహసిల్దార్లు మహేందర్, శ్రీనివాస్ ఎంపీడీవోలు వేణుమాధవ్, పూర్ణచందర్ రెడ్డి, ఏ డిఎ విజయచంద్ర పాల్గొన్నారు.
తొర్రూరు మండలం వెలికట్ట, పెద్ద వంగర మండల కేంద్రంలో ధాన్యం కొనుగోలు కేంద్రాలను కలెక్టర్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. ధాన్యం కొనుగోళ్ల తీరును అడిగి తెలుసుకున్నారు. రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చూడాలని నిర్వాహకులకు సూచించారు.