29-04-2025 01:20:44 AM
జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మికాంతారావు
నిజాంసాగర్, ఏప్రిల్ 29: భూ సమస్యల పరిష్కారానికే భూ భారతి చట్టం తీసుకు వచ్చిందని జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మికాంతారావు అన్నారు. సోమవారం కామారెడ్డి జిల్లా నిజాంసాగర్ మండల కేంద్రంలో తెలంగాణ రాష్ర్ట ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన తెలంగాణ భూభారతి చట్టం2025 అవగాహన సమావేశం లో పాల్గొని మాట్లాడారు, ఆయనతో పాటు కామారెడ్డి జిల్లా కలెక్టర్ ఆశిష్ సంఘ్వాన్ పాల్గొన్నారు.
ఈ కార్యక్రమం లో జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మి కాంతారావు మాట్లాడుతూ భూ సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపేందుకు తీసుకొచ్చిన ‘భూ భారతి’ని ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లాలని ఎమ్మెల్యే రెవెన్యూ యంత్రాంగాన్ని కోరారు.తెలంగాణలో వివాద రహిత భూ విధానాలు ఉండాలన్నదే ప్రభుత్వ ప్రయత్నమని స్పష్టం చేశారు.ఆధార్ తరహాలో భవిష్యత్‌లో భూమికి సంబంధించి సర్వే చేసి కొలతలు, హద్దుల వంటి సమగ్రమైన వివరాలతో ‘భూధార్’ తీసుకొస్తామని వివరించారు.
ప్రజా పోరాటాల నుంచి పుట్టుకొచ్చిన రెవెన్యూ చట్టాలు, ప్రజల సమస్యలను శాశ్వతంగా పరిష్కరించే దిశగా ఉండాలన్నదే ప్రభుత్వ ధ్యేయం అని అన్నారు. ఈ చట్టాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లే బాధ్యత రెవెన్యూ అధికారులపైనే ఉందని చెప్పారు. ఎంతో మంది అభిప్రాయాలను పరిగణలోకి తీసుకుని, ప్రజల నుంచి వచ్చిన సమాచారాన్ని క్రోడీకరించి భూములకు సంబంధించి శాశ్వత పరిష్కారం చూపించాలన్న ఉద్దేశంతో భూ భారతి చట్టం తెచ్చామని తెలిపారు.
ప్రతి గ్రామంలో రెవెన్యూ సదస్సులు నిర్వహించి రైతుల నుంచి విజ్ఞప్తులను తీసుకుని వాటిని పరిష్కరిస్తున్నామని పేర్కొన్నారు.తెలంగాణ రైతులు, ప్రజల పాలిట శాపంగా మారిన ధరణి వ్యవస్థను బంగాళాఖాతంలోకి విసిరేశామని, దాని స్థానంలో నూతనంగా తీసుకొచ్చిన భూ భారతి చట్టం, భూ భారతి పోర్టల్ రైతులకు చుట్టంలా సకల సమస్యలకు పరిష్కార వేదికగా ఉంటుందని తెలిపారు.
సాదాబైనామాలకు ధరణిలో ఎలాంటి అవకాశం లేదని,భూ భారతిలో దీనిని పరిష్కరించునున్నామని, తొమ్మిది లక్షల 26 వేల సాదాబైనామా దరఖాస్తులు ఉన్నాయని,వాటిలో న్యాయమైన వాటిని పరిష్కరిస్తామని తెలిపారు. జిల్లా కలెక్టర్ ఆశిష్ సంఘ్వాన్ మాట్లాడుతూ గోబార్ చట్టాన్ని రైతులు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. సాదా బైనామాలు, పెండింగ్ దరఖాస్తులను గ్రామస్థాయిలోనే పరిష్కరిస్తామని ఆయన తెలిపారు.
కార్యక్రమంలో బాన్సువాడ సబ్ కలెక్టర్ కిరణ్మయి, పిట్లం మార్కెట్ కమిటీ చైర్మన్ చీకోటి మనోజ్ కుమార్,తాసిల్దార్ బిక్షపతి, ఎంపీడీవో గంగాధర్, మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మల్లికార్జున్,రెవెన్యూ అధికారులు,మండల నాయకులు, రైతులు, ప్రజలు పాల్గొన్నారు.