26-04-2025 07:50:59 PM
- రైతులు సద్వినియోగం చేసుకోవాలి
- కలెక్టర్ క్రాంతి వల్లూరు
- ఈ చట్టంతో అధికారాల వికేంద్రీకరణ, పారదర్శకత..జవాబుదారితనం
- పటాన్ చెరు, రామచంద్రాపురం, అమీన్ పూర్ మండలాలలో భూ భారతి అవగాహన సదస్సులు
పటాన్ చెరు: భూ సమస్యల పరిష్కారానికే భూ భారతి చట్టాన్ని ప్రభుత్వం రూపొందించిందని కలెక్టర్ క్రాంతి వల్లూరు(District Collector Valluru Kranthi) తెలిపారు. భూ భారతి చట్టాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. శనివారం పటాన్ చెరు, రామచంద్రాపురం, అమీన్ పూర్ మండలాలలో భూ భారతి చట్టంపై వేరు వేరుగా నిర్వహించిన అవగాహన కార్యక్రమాలలో అధికారులతో కలిసి ఆమె పాల్గొన్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. భూ సమస్యలను పరిష్కరించడమే లక్ష్యంగా ప్రభుత్వం భూ భారతి చట్టాన్ని రూపొందించిందన్నారు. అత్యంత ప్రతిష్టాత్మకమైన భూ భారతి చట్టం ప్రయోజనాలు సామాన్య ప్రజలకు చేకూరాలన్నారు. భూ సమస్యలు లేని జిల్లాగా తీర్చిదిద్దాలని అధికారులకు సూచించారు.
జిల్లాలోని అన్ని మండలాలలో అవగాహన సదస్సులు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. భూ భారతి చట్టంతో పాటు నియమ నిబంధనలు ఒకే సారి తయారు చేసినట్లు చెప్పారు. రికార్డుల నిర్వహణ, రిజిస్ట్రేషన్, మ్యుటేషన్, సాదా బై నామా, పౌతి వంతి అంశాలను కలెక్టర్ వివరించారు. జిల్లా స్థాయిలో రైతులకు, ప్రజలకు లీగల్ సర్వీస్ అథారిటీ ద్వారా న్యాయమైన సేవలు అందిస్తామన్నారు. ఇంతకు ముందు ఉన్న చట్టంలో కోల్పోయిన హక్కులు, కొత్త చట్టంలో ఎలాంటి హక్కులు ఉన్నాయో ఈ సదస్సుల ద్వారా అవగాహన కల్పిస్తున్నట్లు చెప్పారు. ఈ కార్యక్రమంలో జిల్లా వ్యవసాయాధికారి శివప్రసాద్, ఆత్మ కమిటీ చైర్మన్ శ్రీనివాస్ రెడ్డి, పీఏసీఎస్ చైర్మన్ బుచ్చిరెడ్డి, ఆర్డీవో రవీందర్ రెడ్డి, పటాన్ చెరు, రామచంద్రాపురం, అమీన్ పూర్ మండలాల తహసీల్దార్‌లు రంగారావు, సంగ్రామ్ రెడ్డి, వెంకటస్వామి, కార్పొరేట్లరు, ప్రజాప్రతినిధులు, అధికారులు, రైతులు తదితరులు పాల్గొన్నారు.