01-03-2025 12:00:00 AM
భారత్ బయోటెక్ వ్యవస్థాపకులు డాక్టర్ కృష్ణ ఎల్లా
సంగారెడ్డి, ఫిబ్రవరి 28 (విజయక్రాంతి): సరళమైన భాషలో సైన్స్ గురించి ఆలోచిస్తే ప్రపంచానికి ఉత్తమ పరిష్కారాలను కనుక్కోవచ్చని పద్మభూషణ్ అవార్డు గ్రహీత, భారత్ బయోటెక్ వ్యవస్థాపకులు డాక్టర్ కృష్ణ ఎల్లా అన్నారు. జాతీయ సైన్స్ దినోత్సవం సందర్భంగా శుక్రవారం సంగారెడ్డి జిల్లా పటాన్చెరు మండలం రుద్రారంలోని గీతం యూనివర్సిటీలో ‘గీతం ఛేంజ్ మేకర్స్ సిరీస్’లో భాగంగా నిర్వహించిన కార్యక్రమంలో పాల్గొని, ప్రసంగించారు.
భారత్ బయోటెక్ను స్థాపించడం నుంచి కోవాక్సిన్, టైప్బార్ టీసీవీ, రోటావాక్ వంటి సంచలనాత్మక వ్యాక్సిన్ల అభివృద్ధి వరకు తన ప్రయాణాన్ని కార్యక్రమానికి హాజరైన విద్యార్థులకు వివరించారు. ఊహ, ఆచరణాత్మకతకు విలువనిచ్చే ఆవిష్కరణ సంస్కృతిని సమర్థిస్తూ, యువత తమ పరిసరాలను గమనించి ప్రశ్నలు అడగాలని సూచించారు.
అంతకుముందు గీతంలో నెలకొల్పిన మల్టీడిసిప్లినరీ యూనిట్ ఆఫ్ రిసెర్చ్ ఆన్ ట్రాన్స్లేషనల్ ఇనిషియేటివ్స్ని ప్రారంభించారు. అనంతరం గీతం అధ్యక్షుడు శ్రీభరత్ మతుకుమిల్లి, గీతం ఛాన్స్లర్ డాక్టర్ వీరేందర్సింగ్ చౌహాన్.. డాక్టర్ కృష్ణ ఎల్లాను సత్కరించారు.
కార్యక్రమంలో ఐఐసీటీ పూర్వ డైరెక్టర్, గీతం విశిష్ట ఆచార్యుడు డాక్టర్ శ్రీవారి చంద్రశేఖర్, జంట నగరాల్లోని పది ప్రముఖ కళాశాలల నుంచి వచ్చిన 550 మంది విద్యార్థులు, పరిశోధకులు పాల్గొన్నారు.