calender_icon.png 27 October, 2024 | 10:04 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఉత్తమ పార్లమెంటేరియన్ మన జైపాలుడు

29-07-2024 02:57:13 AM

  • అద్భుత వాక్పటిమ గల నేత  

తెలంగాణ ఏర్పాటుకు కృషి   

హైదరాబాద్ మెట్రో ఆయన చలవే

హైదరాబాద్/నాగర్‌కర్నూల్, జూలై 28 (విజయక్రాంతి): తెలంగాణ పల్లె నుంచి ఢిల్లీ దాకా ఎదిగిన అతి తక్కువ మంది నేతల్లో సూదిని జైపాల్‌రెడ్డి ఒకరు. ఉత్తమ పార్లమెంటేరియన్‌గా పాలమూరు ప్రతిష్ఠను హస్తిన లో చాటిన గొప్ప నేత ఆయన. తెలంగాణ పోరాట సమయంలో సీమాంధ్ర కాంగ్రెస్ నేతలంతా ప్రత్యేక రాష్ట్ర సాధనను వ్యతిరేకిస్తున్నా.. అధిష్ఠానం వద్ద తనదైన ముద్ర వేసి ప్రత్యేక రాష్ట్రం సాధించడంలో తెరవెనక జైపాల్‌రెడ్డి పోషించిన పాత్ర మరువలేనిది.

ఉస్మానియా విద్యార్థి సంఘ నాయకునిగా రాజకీయాలపై అవగాహన పెంచుకున్న జైపాల్‌రెడ్డి.. దేశం గర్వించే నాయకుడిగా ఎదిగారు. ఉద్యమ సమయంలో ఆయనకు సీఎం పదవిని ఆఫర్ చేసినా తిరస్కరించి తన ప్రాంతం రాష్ట్రంగా సిద్ధించడాన్నే బలంగా కోరుకున్నారు. ఎమర్జెన్సీ సమయంలో ఇందిరాగాంధీని వ్యతిరేకించేందుకు సైతం వెనుకంజ వేయలేదు.

మాడ్గుల ముద్దుబిడ్డ 

జైపాల్‌రెడ్డి ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలోని మాడుగులలో 1942 జనవరి 16న జన్మించారు. 18 నెలల వయసులో ఉండగానే పోలియో కారణంగా వైకల్యానికి గురయ్యారు. కానీ, అది ఆయన రాజకీయ జీవన ఆరోహణకు ఎన్నడూ అవరోధం కాలేకపోయింది. పలుమార్లు కేంద్ర మంత్రిగా, ఐదుసార్లు లోక్‌సభ సభ్యుడిగా, రెండుసార్లు రాజ్యసభ సభ్యుడిగా, నాలుగుసార్లు ఎమ్మెల్యేగా పని చేసి సుదీర్ఘ రాజకీయ అనుభవం గడించారు. స్వగ్రామం నుంచి 35 కిలోమీటర్ల దురంలోని నల్లగొండ జిల్లా దేవరకొండలో ప్రాథమిక విద్యాభ్యాసం సాగించిన జైపాల్‌రెడ్డి, ఉస్మానియా విశ్వవిద్యాలయం నుంచి ఎంఏ ఇంగ్లిష్ పట్టా తీసుకున్నారు. ఉస్మానియాలో విద్యార్థి నాయకుడిగా ఉండగానే జైపాల్ రెడ్డి రాజకీయ జీవితం మొదలైంది.

హైదరాబాద్ మెట్రో కోసం కృషి

హైదరాబాద్ మెట్రో రైళ్లలో ప్రయాణిస్తున్న చాలామందికి అది ఎవరి హయాంలో ఎవరి ముందు చూపు వల్ల వచ్చిందనే విషయం తెలియకపోవచ్చు. జైపాల్ రెడ్డి పట్టణాభివృద్ధి శాఖ మంత్రిగా ఉన్నప్పుడే హైదరాబాద్ మెట్రో మంజూరైంది. అప్పుడు రాష్ర్టం, కేంద్రంలోనూ కాంగ్రెస్ ప్రభుత్వాలు ఉండటం రాష్ట్రానికి కలిసివచ్చింది.  

జీవిత చరమాంకంలో ఓడిపోయాననే బాధ...

స్వరాష్ర్టం ఏర్పడిన తర్వాత తన సొంత జిల్లా మహబూబ్‌నగర్ పార్లమెంట్ నుంచి కాంగ్రెస్ తరఫున ఎంపీగా పోటీ చేశారు. టీఆర్‌ఎస్ నుంచి పోటీ చేసిన జితేందర్‌రెడ్డి చేతిలో కేవలం 2,590 ఓట్ల తేడాతో ఓడిపోయారు. జితేందర్‌రెడ్డికి 32.94 శాతం ఓట్లు రాగా, జైపాల్ రెడ్డికి 32.68 శాతం ఓట్లు వచ్చాయి. బీజేపీ నుంచి పోటీ చేసిన నాగం జనార్దన్‌రెడ్డికి 26.88 శాతం ఓట్లు దక్కాయి. గతంలో ఎప్పుడు ఈ స్థాయిలో లేని బీజేపీకి ఓటు శాతం పెరగడంతో జైపాల్ రెడ్డి ఓటమి చవి చూడాల్సి వచ్చింది. ఇక ఆ తర్వాత ఆయన ప్రత్యక్ష రాజకీయాలకు స్వస్తి పలికారు.  

ఆయన సేవలకు గుర్తుగా ఇంజనీరింగ్ కళాశాలలో విగ్రహం 

జైపాల్ రెడ్డి 2019 జూలై 28న మృతి చెందారు. జైపాల్‌రెడ్డి పాలమూరు జిల్లాకు చేసిన సేవలకు గుర్తుగా మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలో ఉన్న జయప్రకాశ్ ఇంజినీరింగ్ కళాశాలలో ఆయన విగ్రహాన్ని ఏర్పాటు చేశారు ఆ కళాశాల చైర్మన్ కేఎస్ రవికుమార్.