calender_icon.png 19 September, 2024 | 9:57 PM

పల్లెల్లో బెల్టు జోరు

17-09-2024 12:41:31 AM

  1. పుట్టగొడుగుల్లా పుట్టుకొస్తున్న షాపులు 
  2. హోటళ్లు, కిరాణాదుకాణాల్లో మద్యం విక్రయాలు 
  3. చోద్యం చూస్తున్న ఎక్సైజ్ అధికారులు

మెదక్, సెప్టెంబర్ 16 (విజయక్రాంతి): పట్టణాలు, పల్లెలు అనే తేడా లేకుండా రాత్రింబవళ్లు మద్యం వ్యాపారం జోరుగా సాగుతోంది. ఈ అక్రమ వ్యాపారానికి సంబంధిత అధికారుల అండదండలు ఉన్నాయనే ఆరోపణలు ఉన్నాయి. దీన్ని ఆసరాగా చేసుకొని వ్యాపారులు తమ దందాను పెద్ద ఎత్తున సాగిస్తున్నారు. 

పేరుకే హోటళ్లు, కిరాణాలు..

మెదక్ జిల్లాలో అనుమతి ఉన్న మద్యం దుకాణాలు 49 ఉన్నాయి. అయితే, ఈ దుకాణాలు తెరవక ముందు, మూసి వేసిన తర్వాత మద్యం ప్రియులంతా బెల్టు దుకాణాలనే ఆశ్రయిస్తున్నారు. పేరుకే హోట ళ్లు, దాబాలు, కిరాణా దుకాణాల మాదిరి ఉన్నప్పటికీ లోపల తతంగమంతా వేరేలా ఉంటుంది. మద్యం విక్రయాలతో పాటు అక్కడే తాగేందుకు నిర్వాహకులు తగిన ఏర్పాట్లు చేస్తున్నారు. మద్యం ప్రియుల కోసం కావాల్సిన వెజ్, నాన్‌వెజ్ ఆహార పదార్థాలను క్షణాల్లో అందిస్తుండడంతో వారు దాబాలు, హోటళ్లలో మద్యం సేవించేందుకు మొగ్గు చూపుతున్నారు.  అలాగే అనధికారికంగా నడిచే బెల్టు దుకాణాల్లో అధిక ధరలకు మద్యం విక్రయిస్తున్నట్లు సమాచారం. 

అధికారులకూ ఆదాయమే..

జిల్లాలోని మున్సిపాలిటీలతో పాటు పల్లెల్లోని ప్రతి గల్లీలో ఒక బెల్టు దుకాణం ఉంది. మద్యం దుకాణం నుంచి బెల్టు దుకాణాలకు నిత్యం మద్యం సరఫరా అవుతోంది. ఈ తతంగం చూసీచూడనట్లు ఉండడంతో పాటు దుకాణానికి దగ్గరలో డ్రంక్ అండ్ డ్రైవ్ పెట్టకుండా సంబంధిత అధికారులకు నెలకు ఒక్కో మద్యం దుకాణం నుంచి రూ.వేలల్లో చెల్లిస్తున్నారనే ఆరోపణలున్నాయి. ఇతర సిబ్బందికి ప్రతినెలా వేలాది రూపాయలు ఇవ్వాల్సిందేనని, ఇదేమని వ్యాపారులు అధికారులను అడిగితే పెద్దసార్లకు ఇవ్వక తప్పదని సమాధానమిస్తున్నట్లు ఆరోపిస్తున్నారు. ఇక బెల్టు దుకాణాల నుంచి సైతం అమ్మకాలను బట్టి నెలవారీ మా మూళ్లు కూడా వదలకపోవడం గమనార్హం. 

రహదారులపై పొంచి ఉన్న ముప్పు..

రహదారులపై ఇటు పట్టణాల్లో, గ్రామాల్లో అనధికారికంగా వెలిసిన బెల్టు దుకాణాల వల్ల వాహనదారులు రాత్రివేళల్లో మద్యం సేవించి పలు ప్రమాదాలకు గురవుతున్నారు. యువత, ప్రజలు మద్యానికి బానిసలవుతున్నారని, బెల్టు దుకాణాల వల్ల చెడుమార్గాలు పడుతున్నారని బెల్టు దుకాణాలపై అధికారులు కొరడా ఝులిపించాలని ప్రజలు కోరుతున్నారు. 

ఫిర్యాదు చేస్తే చర్యలు తీసుకుంటాం

పల్లెల్లో, పట్టణాల్లో అక్రమంగా బెల్టుషాపులు నిర్వహిస్తే కఠిన చర్యలు తీసుకుంటాం. మద్యం దుకాణాల వ్యాపారులు నిబంధనలు పాటించాలి. ప్రజల నుంచి ఫిర్యాదులు అందితే వెంటనే కఠిన చర్యలు తీసుకుంటాం. 

 శ్రీనివాస్‌రెడ్డి, ఇన్‌చార్జి ఎక్సైజ్ సూపరింటెండెంట్, మెదక్