17-04-2025 01:53:13 AM
హైదరాబాద్, ఏప్రిల్ 16 (విజయక్రాంతి): సింగరేణి విశ్వవ్యాప్త విస్తరణకు ఒడిశాలోని నైనీ బొగ్గు గని ప్రారంభోత్సవమే నాంది అని, సంస్థ చరిత్రలో మరో సువర్ణాధ్యాయం మొదలుకానున్నదని తెలంగాణ డిప్యూటీ సీఎం మల్లు భట్టివిక్రమార్క ఆకాంక్షించారు. హైదరాబాద్ లోని ప్రజాభవన్ నుంచి బుధవారం ఆయన వర్చువల్‌గా నైనీ గనిలో బొగ్గు ఉత్పత్తిని ప్రారంభించారు.
అనంతరం డిప్యూటీ సీఎం మాట్లాడుతూ.. సంస్థ 136 సంవత్సరాల సుదీర్ఘ చరిత్రలో తొలిసారి వేరే రాష్ట్రంలో బొగ్గు గని ప్రారంభంకావడం సరికొత్త రికార్డు అని కొనియాడారు. నైనీలో ఉత్పత్తి అయిన బొగ్గు దేశంలోని ఇతర రాష్ట్రాలకే కాక ఖండాంతరాలకు రవాణా అవుతుందని స్పష్టం చేశారు. త్వరలో సింగరేణి గ్లోబల్ కంపెనీగా ఎదుగుతుందని ధీమా వ్యక్తం చేశారు.
బ్లాక్‌లో బొగ్గు ఉత్పత్తిని ప్రారంభించేందుకు రాష్ట్రప్రభుత్వం పట్టువిడువకుండా కృషి చేసిందని గుర్తుచేశారు. తనతో పాటు సీఎం రేవంత్‌రెడ్డి అనేకసార్లు కేంద్ర మంత్రులను కలిసి బొగ్గు ఉత్పత్తికి అనుమతులు సాధించామని వెల్లడించారు. ఇది ప్రజాప్రభుత్వానికి సింగరేణి అభివృ ద్ధిపై ఉన్న శ్రద్ధకు నిదర్శనమని పేర్కొన్నారు.
బ్లాక్ ప్రారంభోత్సవానికి సహకరించిన కేంద్ర బొగ్గు గనులశాఖ మంత్రి కిషన్‌రెడ్డి, కేంద్ర మం త్రి ధర్మేంద్ర ప్రధాన్, ఒడిశా సీఎం మోహన్ చరణ్ మాఝీకి కృతజ్ఞతలు తెలుపుతున్నామన్నారు. గతేడాది జూలైలో తాము నైనీ సమీపం లోని గని ప్రభావిత అంగూల్ ప్రాంతాన్ని పరిశీలించామని, ఆ ప్రాంత సర్వతో ముఖా భివృద్ధికి కట్టుబడి ఉన్నామని తెలిపారు.
సింగరేణి ప్రభుత్వ రంగ సంస్థ అని, వాణిజ్య వ్యాపార లావాదేవీలు, లాభాల కోసం నడుస్తున్న సంస్థ కాదని స్పష్టం చేశారు. ఆది నుంచీ సంస్థకు సామాజిక స్పృహ ఉందని, దశాబ్దాల నుంచి సామాజిక ప్రయోజన కార్యక్రమాలు చేపడుతూనే ఉందని గుర్తుచేశారు. అంగూల్‌లో 1600 మెగావాట్ల థర్మల్ విద్యుత్ కేంద్రాన్ని నెలకొల్పి, స్థానిక యువతకు ఉపాధి అవకాశాలు కల్పిస్తామని హామీ ఇచ్చారు.
ఒడిశాలో గని ప్రారంభోత్సవంలో రాష్ట్ర ఇంధన వనరులశాఖ ముఖ్యకార్యదర్శి సందీప్‌కుమార్ సుల్తానియా, సింగరేణి సీఎండీ ఎన్ బలరాం పాల్గొన్నారు. ప్రజాభవన్ నుంచి వర్చువల్ ప్రారంభోత్సవంలో ట్రాన్స్‌కో సీఎండీ కృష్ణభాస్కర్, ఓఎస్డీ సురేందర్‌రెడ్డి పాల్గొన్నారు.
సింగరేణికి మరో మణిహారం: కేంద్ర బొగ్గు గనులశాఖ మంత్రి కిషన్‌రెడ్డి
నైనీ బ్లాక్ ప్రారంభోత్సవం చరిత్రాత్మకమైందని పేర్కొన్నారు. తెలంగాణ వెలుపల సింగరేణికి మరో మణిహారం లభించిందని, సింగరేణీయులు ఇవి గర్వించాల్సిన క్షణాలని కొనియాడారు. తెలంగాణ కాక మరో రాష్ట్రం లో సింగరేణి గని ప్రారంభం కావడం శుభపరిణామని అభివర్ణించారు. నైనీలో బొగ్గు ఉత్ప త్తిని ప్రారంభించేందుకు ఎన్నో అవరోధాలు ఎదుర్కోవాల్సి వచ్చిందని గుర్తుచేసుకున్నారు. ప్రధాని మోదీ సహకారంతో పాటు కేంద్ర బొగ్గు ఉత్పత్తి మంత్రిత్వ శాఖ ఎంతో కృషి చేసిందన్నారు.
తెలంగాణ ప్రభుత్వ చొరవతోనే: సీఎం రేవంత్‌రెడ్డి
తెలంగాణ ప్రభుత్వం చొరవతో నైనీ బ్లాక్ లో బొగ్గు ఉత్పత్తికి చకాచకా అడుగులు పడ్డాయని, తమ సర్కార్ చిత్తశుద్ధికి ఇదే పెద్ద నిదర్శనమని పేర్కొన్నారు. నైనీ బ్లాక్ ప్రారంభోత్సవంతో సింగరేణిలో మరో కొత్త శకం మొదలైందని కొనియాడారు. కొత్త బ్లాక్ ద్వారా వేలా ది మందికి కార్మికులకు ప్రత్యక్షంగా, పరోక్షంగా ఉపాధి లభిస్తుందని తెలిపారు. నైనీలో గని ప్రభావిత ప్రాంతమైన అంగూల్ అభివృద్ధికి తోడ్పడతామని హామీ ఇచ్చారు. సింగరేణి విస్తరణకు తమ ప్రభుత్వం అన్నివిధాలుగా సహాయ సహకారాలు అందిస్తుందని తెలిపారు.