వరుస బ్లాక్ బస్టర్ హిట్లతో టాలీవుడ్ ప్రేక్షకులను మెపిస్తున్న స్టార్ హీరో దుల్కర్ సల్మాన్ మరో చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధమవుతున్నారు. దుల్కర్ హీరోగా డైరెక్టర్ పవన్ సాదినేని ఓ సినిమాను తెరకెక్కిస్తున్నారు. లైట్ బాక్స్ మీడియా బ్యానర్‌పై సందీప్ గుణ్ణం, రమ్య గుణ్ణం నిర్మిస్తున్న ఈ చిత్రానికి ‘ఆకాశంలో ఒక తార’ అనే టైటిల్ గత కొద్ది రోజుల క్రితమే ఖరారు చేశారు.
తాజాగా ఈ ప్రాజెక్టు కోసం టాలీవుడ్ ప్రముఖ నిర్మాతలు అల్లు అరవింద్, అశ్వినీదత్, గుణ్ణం గంగరాజు కలిసి పనిచేయనున్నారు. గీతా ఆర్ట్స్, స్వప్న సినిమా నిర్మాణ సంస్థలు ఈ చిత్ర నిర్మాణంలో భాగమయ్యాయి. ఈ నేపథ్యంలోనే తాజాగా ఈ సినిమాకు కొబ్బరికాయ కొట్టేశారు. ఆదివారం హైదరాబాద్‌లో నిర్వహించిన పూజా కార్యక్రమాలతో లాంఛనంగా ప్రారంభమైందీ సినిమా.
ఈ ప్రారంభ కార్యక్రామానికి నిర్మాతలు అల్లు అరవింద్, అశ్వినిదత్ తదితరులు హాజరయ్యారు. ముహూర్తం షాట్‌కు అల్లు అరవింద్ క్లాప్ కొట్టగా, అశ్వినీదత్ కెమెరా స్విచాన్ చేశారు. ముహూర్తపు సన్నివేశానికి గుణ్ణం గంగరాజు దర్శకత్వం వహించారు.
సుజిత్ సారంగ్ సినిమాటోగ్రాఫర్‌గా, శ్వేత సాబు సిరిల్ ప్రొడక్షన్ డిజైనర్‌గా పని చేయనున్న ఈ చిత్రాన్ని తెలుగు, మలయాళం, తమిళం, కన్నడ, హిందీ భాషల్లో విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఈ సినిమాకు సంబంధించి నటీనటులు, ఇతర సిబ్బంది వివరాలను త్వరలోనే వెల్లడిస్తామని ఈ సందర్భంగా మేకర్స్ తెలిపారు.