ప్రపంచ ఆరోగ్య సంస్థతో పాటు ఇంటర్నేషనల్ మెనోపాజ్ సొసైటీ అక్టోబర్‌ను ‘ప్రపంచ మెనోపాజ్ అవగాహన నెల’గా ప్రకటించింది. 45 ఏళ్లు దాటక.. మెనోపాజ్ దశ ఆరంభం అవుతుంది. ఒక విధంగా మూడో వంతు జీవితం ఇప్పుడే మొదలవుతుంది. ఈ దశలో మహిళల సమస్యలు ఒకటా, రెండా.. చాలానే ఉంటాయి.
అయితే వీటిపై స్పష్టమైన అవగాహన లేకపోవడం మహిళలు ఆందోళన చెందుతారు. ముఖ్యంగా ఈ దశలో సిగ్గు, భయం.. వదిలి మెనోపాజ్ గురించి ముందుగా అవగాహన పెంచుకుంటే మంచిదని నిపుణులు చెబుతున్నారు. జీవితంలో ఈ స్టేజ్‌ని విజయవంతంగా జయించాలంటే.. కింది విషయాలపై అవగాహన తప్పని సరి.
మెనోపాజ్ లేక బహిష్ఠులు ఆగిపోవడం అనేది ఒక సహజ దశ. అది జబ్బుకాదు. ఎంతో కాలం బాధించదు. అంతటితో స్త్రీ జీవితం అయిపోయిందనీ భావించాల్సిన అవసరం లేదు. మూడో వంతు జీవితం ఇప్పుడే మొదలవుతుంది. ఈ దశలో ప్రశాంతంగా, ధైర్యంగా ఉంటూ సరైన ఆహారం తీసుకుంటూ.. డాక్టర్ సలహాలు.. సూచనలు పాటిస్తే మెనోపాజ్ వల్ల వచ్చే బాధలు చాలా వరకు తగ్గుతాయి.
ప్రతి మహిళ జీవితంలో మెనోపాజ్ సహజం. సాధారణంగా 40 ఏళ్ల మధ్య వయసున్న మహిళలు ఈ దశకు చేరుకుంటారు. కొంతమందిలో 40లోపే ఈ ప్రక్రియ జరుగుతుంది. దీన్ని ‘ప్రిమెచ్యూర్ మెనోపాజ్’ గా అంటారు. ఏదేమైనా ఈ దశలోకి ప్రవేశించే క్రమంలో మహిళల్లో కొన్ని సాధారణ లక్షణాలు కనిపిస్తాయి.
నెలసరి క్రమం తప్పడం, రాత్రుళ్లు ఉన్నట్లుండి చెమటలు పట్టడం, వ్జునా పొడిబారిపోవడం, లైంగిక కోరికలు తగ్గిపోవడం, అలసట, నీరసం, చిరాకు, ఒత్తిడి, జీర్ణ సమస్యలు వస్తాయి. ఇలా ఈ దశలో ఆరోగ్యంపై మెనోపాజ్ ప్రభావం పడుతుంది.
ఈ దశను విజయవంతంగా ఎదుర్కొవాలంటే.. మెనోపాజ్ దశలోకి ప్రవేశించే మహిళలు ముందుగానే వీటి గురించి డాక్టర్‌ని అడిగి తెలుసుకోవాలి. ఈ క్రమంలో ఆహారం, వ్యాయామం, జీవనశైలిలో చేసుకోవాల్సిన మార్పులేంటో తెలుసుకొని.. ముందు నుంచే వాటిని పాటిస్తే.. మంచి ఫలితం ఉంటుంది.
మెనోపాజ్ అంటే ఏమిటి?
మెనోపాజ్ అనేది సహజమైన జీవప్రక్రియ. ఈ దశలో గర్భాశయంలో అండాల ఉత్పత్తి ఆగిపోతుంది. అలాగే ఋతుక్రమం ముగుస్తుంది. ఒక విధంగా 12 నెలలు అంటే.. ఒక సంవత్సరం వరకు పీరియడ్స్ రాకుండా ఆగిపోతే.. మెనోపాజ్ గా నిర్ధారణ అవుతుంది.
తీసుకోవాల్సిన జాగ్రత్తలు..
* ఆహార నియమాలు పాటించడం, వ్యాయామం చేయడం.
* ఆకుకూరలూ, తాజా పండ్లు తీసుకోవాలి.
* ఒమేగా ఫ్యాటీ యాసిడ్స్ లభించే ఆయిలీ ఫిష్ ఆహారంలో ఉండేట్టు చూసుకోవాలి. ఇది మెనోపాజ్‌లో వచ్చే మానసిక సమస్యలని అధిగమిస్తుందని వైద్యులు చెబుతున్నారు.
* కెఫీన్, స్మోకింగ్, ఆల్కహాల్, మసాలాలు తగ్గించాలి.
ఈ ముప్పు ఎక్కువ!
మెనోపాజ్ దశలోకి ప్రవేశించిన మహిళల్లో వారి జీవిత కాలంలో గుండె సంబంధిత సమస్యలు వచ్చే ముప్పు 40 శాతం ఎక్కువని పరిశోధనలు చెబుతున్నాయి. ఈ దశలో ఆస్టియోపొరోసిస్ బారిన పడేవారూ ఎక్కువేనని నిపుణులు అంటున్నారు. అందుకే వీటి గురించి ముందుగానే అవగాహన పెంచుకోవడం వల్ల గుండె, ఎముకల ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చంటున్నారు.
ఈ క్రమంలోనే ఆయా అవయవాల పనితీరు, ఆరోగ్యం గురించి తెలుసుకోవడానికి ఎలాంటి వైద్య పరీక్షలు చేయించుకోవాలో డాక్టర్‌ని అడిగి తెలుసుకోవాలి. ఏవైనా సమస్యలుంటే వాటికి మందులు వాడటం, వ్యాయామం చేయడం వంటివి చేయాలి.
హార్మన్ల ప్రభావం..
మెనోపాజ్ దశలోకి ప్రవేసించే మహిళల శరీరంలో హార్మోన్ల స్థాయిల్లో జరిగే మార్పుల వల్లే ఆయా లక్షణాలు కనిపిస్తుంటాయి. వీటిని దూరం చేసుకోవడానికి కొంతమంది హార్మోన్ రీప్లేస్‌మెంట్ థెరపీ వంటి చికిత్సలు సూచిస్తుంటారు. దీని కోసం వైద్యుల సలహాలు తీసుకోని ముందుకు వెళ్లాలి. వీటివల్ల కలిగే ప్రయోజనాలు, నష్టాల గురించి కూడా అవగాహన అవసరం.
అలాగే మెనోపాజ్ దశలో లైంగిక హార్మన్లు ఈస్ట్రోజెన్, ప్రొజెస్టరాన్.. వంటి హార్మోన్ల స్థాయిలు చాలావరకు తగ్గుతాయి. దీనివల్ల వ్జునా పొడిబారిపోతుంది. అయితే ఈ విషయంలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే లైంగిక ఆరోగ్యం దెబ్బతింటుంది. అందుకే ఈ విషయంలో సిగ్గుపడకుండా.. డాక్టర్‌ని అడిగి తెలుసుకోవడం ఉత్తమం.
అనుభవాలను తెలుసుకోవడం
మెనోపాజ్ దశలో శరీరంలో తలెత్తే హార్మోన్ల మార్పుల కారణంగా మానసికంగా ఆరోగ్యం పైనా ప్రతికూల ప్రభావం పడుతుంది. ఫలితంగా ఒత్తిడి, ఆందోళన, చిరాకు, మూడ్ స్వింగ్స్.. వంటి లక్షణాలు కనిపిస్తాయి. అయితే ఈ క్రమంలో కొందరు డాక్టర్లు థెరపీ సూచిస్తారు.
మరికొందరు మందులు వాడమంటారు. వీటిలో ఏది ప్రభావవంతంగా పనిచేస్తుందో తెలియాలంటే నిపుణుల సలహా తీసుకోవడం తప్పనిసరి. మనసు ప్రశాంతంగా ఉండాలంటే.. నచ్చిన పనులు చేయడం, కంటి నిండా నిద్ర పోవడం, మెనోపాజ్ దశలోకి ప్రవేశించిన మహిళల అనుభవాలు తెలుసుకోవాలి.
చిన్న మార్పులు..
మెనోపాజ్ దశలో ముఖ్యంగా జీవన శైలిలో చిన్న చిన్న మార్పులు చేసుకోవడం చాలా మంచిది. నెలసరి నిలిచిన తర్వాత గుండె సమస్యలు, ఎముకలు పెలుసు బారటం, మధుమేహం వంటి వ్యాధుల ముప్పు పెరుగుతుంది. అందువల్ల మంచి పోషకాహారం తినటం, కంటి నిండా నిద్ర పోవటం, ఒత్తిడిని నియంత్రించుకోవటం, శారీరకంగా చురుకుగా ఉండటం వంటి జాగ్రత్తలు పాటించాలి. ఇవి మానసిక ఒత్తిడిని తగ్గించి.. ఆరోగ్యం మెరుగుపడటానికి తోడ్పడతాయి.
మెనోపాజ్ లక్షణాలు!
* కొంతమందిలో పీరియడ్స్ హఠాత్తుగా ఆగిపోతాయి.
* కొంతమందిలో క్రమక్రమంగా ఆగిపోతాయి.
* కొందరిలో అధిక రక్త స్రావం కావడం.
* కొందరిలో తక్కువ రక్త స్రావం అవుతుంది.
* తొందరగా అలసి పోవడం.
* ఒళ్లంతా వేడి వేడిగా అనిపించడం.
* కొందరిలో ఒళ్లంతా చెమటలు పడుతుంది.
* రాత్రిళ్లు నిద్రలో ఒళ్లంతా చెమటలు పట్టి మెలకువ రావడం.
* గుండె దడ.
* నిద్ర పట్టక పోవడం.
* మానసిక ఆందోళన, చిరాకు, కోపం, డిప్రెషన్, ఏడుపు రావడం.
* తలనొప్పి.
* మెనోపాజ్ దశలోకి ప్రవేశించే మహిళల్లో ఎక్కువగా క్యాన్సర్లు వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి ప్రతి మహిళ మెనోపాజ్ దశలో కొన్ని పరీక్షలు తప్పని సరిగా చేయించుకోవాలి. వాటిలో గర్భాశయ, రొమ్ము క్యాన్సర్ స్క్రీనింగ్ టెస్టులు, పాప్‌స్మియర్, అవసరమైతే గర్భాశయ ద్వారం నుంచి బయాప్సీ, డి అండ్ సి ద్వారా గర్భాశయం లోపలి పొరను తీసి బయాప్సీకి పంపడం, అల్ట్రా సౌండ్ స్కానింగ్ ద్వారా గర్భాశయంలోనూ, ఓవరీల్లోనూ గడ్డలున్నాయేమో చూడటం, మామోగ్రామ్, కరోనరీ యాంజియోగ్రామ్, థైరాయిడ్ పరీక్షలు, మూత్ర పరీక్షలు, బీపీ, షుగర్ రెగ్యులర్‌గా చెక్ చేయించుకోవాలి. దీంతో పాటు హెల్తీ డైట్ పాటిస్తూ.. చిన్న చిన్న వ్యాయామలు పాటిస్తే మంచిది.
ఎస్వీ లక్ష్మి, కన్సల్టెంట్ గైనకాలజిస్ట్, రిస్క్ ఆబ్‌స్టెట్రీషియన్,
మెడికవర్ ఉమెన్ అండ్ చైల్డ్ హాస్పిటల్, హైదరాబాద్