13-04-2025 12:16:41 AM
కొత్త కొత్త ప్రదేశాలకు వెళ్లడం ఇష్టం చాలామందికి. అందుకని విదేశాలకు వెళ్తున్నవారు ఉన్నారు. కానీ మన గడ్డపైనే ఎంతో విలక్షణమైన ప్రదేశాలు, కట్టిపడేసే సహజమైన ప్రకృతి దృశ్యాలు, మిస్టరీ ప్రదేశాలు ఎన్నో ఉన్నాయి. వెరైటీ వంటకాలకు నెలవైన ప్రదేశాలతో సహా వైవిధ్యభరితంగా, ఆహ్లాదంగా ఉండే సుందర ఉద్యానవనాలు ఎన్నెన్నో ఉన్నాయి. ఈ వేసవిలో కుటుంబంతో ఎంజాయ్ చేయాలనుకునే వారికి చక్కటి ప్రదేశాలివి.
గుల్మార్గ్
ఎటుచూసినా పచ్చని ఉద్యానవనాలు.. ఆకాశాన్నంటే పర్వతశిఖరాలు.. మంచు దుప్పటి కప్పుకున్న పచ్చికబయళ్లు.. అందమైన హిమాలయాల్లోని పచ్చని ప్రకృతి సోయగాల చిరునామా గుల్మార్గ్. ఈ ప్రాంత అందాల గురించి ఎన్ని రకాలుగా చెప్పినా తనివితీరదు. ఒకవైపు మంచుతో నిండిన కొండలు, మరోవైపు ఆకాశంతో పోటీపడుతూ.. వరుస క్రమంతో ఎంతో క్రమశిక్షణతో నిలబడినట్టుగా కనిపించే పచ్చని చెట్ల సోయగం..
నిజంగా చిత్రకారుడు గీసిన ఓ సుందర చిత్రం లాంటిది గుల్మార్గ్. గుల్మార్గ్‌లో లభించే పువ్వుల వైవిధ్యం మరెక్కడా కనిపించదు. నిజనానికి గుల్మార్గ్ పేరు వెనుక ఎంతో చారిత్రక నేపథ్యం ఉంది. గుల్ అంటే పువ్వులు, మార్గ్ అంటే పచ్చిక బయళ్లు.. మొత్తంగా గుల్మార్గ్ అంటే పువ్వులతో కూడిన పచ్చికబయళ్లు అని అర్థం.
అలా అనేక రకాల పూల రంగులతో, పచ్చని బయళ్లతో మహాద్భుతంగా కనిపిస్తుంది. గుల్మార్గ్‌లో చాయ్ చాలా ఫేమస్. కహనా పేరుతో పొగలుకక్కే చాయ్‌లో బాదం, యాలకులు, దాల్చిన చెక్క వేసి వేడి వేడిగా ఇస్తారు. దీనికోసం పర్యాటకులు క్యూ కడతారు.
లేహ్
ప్రతి ఒక్కరు జీవితంలో ఒక్కసారైనా చూడాలనుకునే ప్రదేశం లేహ్, లద్ధాఖ్. హిమాలయ పర్వతాల అందాలు, చూడముచ్చటగా ఉండే లోయలు, మంచు కరిగి ప్రవహించే హిమనీ నదులు, అందమైన సరస్సులు ఈ ప్రదేశాన్ని భూమ్మీదే అత్యంత అందమైనదిగా మార్చేశాయి.
లేహ్ శ్రీనగర్ హైవేలోని హాల్ ఆఫ్ ఫేమ్, జోరావర్ కోట, గురుద్వారా పత్తర్ సాహిబ్ వంటి ప్రదేశాలు చూడవచ్చు. శాంతి స్థూపం, లేహ్ ప్యాలెస్, మాగ్నెటిక్ హిల్ వంటి ఆసక్తికరమైన ప్రదేశాలను తప్పకుండా చూడాలి. లేహ్‌లో హెమిస్ నేషనల్ పార్క్ కూడా ఉంది. వన్యప్రాణులంటే ఇష్టపడేవారికి బెస్ట్ ప్లేస్ లేహ్‌ను చెప్పవచ్చు.
నైనిటాల్
ఉత్తరాఖండ్‌లోని నైనిటాల్ ప్రముఖ పర్యాటక ప్రదేశం. ఇది ఏడాది పొడవునా చాలా అందంగా ఉంటుంది. చల్లని గాలులు, వావ్ అనిపించే సరస్సులు, ఎక్కడా చూడని యాపిల్, చెర్రీ చెట్లు విశేషంగా ఆకట్టుకుంటాయి. నైనిటాల్‌లో సూర్యాస్తమయ సమయంలో విహరిస్తే ఇట్టే మైమరచిపోతారు. సూర్యుని కిరణాలు అక్కడి కొండలపై పడి ఆ ప్రాంతం బంగారు వర్ణంలా మెరిసిపోతుంది. ఇక్కడ సరస్సులు, ఎత్తున పర్వతాలు అందమైన ప్రకృతి దృశ్యాలను ఆస్వాదించవచ్చు.
తవాంగ్
తవాంగ్ అందమైన ప్రకృతి, బౌద్ధ విహారాలకు ప్రసిద్ధి. ఇక్కడి ప్రకృతి అందాలు, మంచు పర్వతాలు, పచ్చని లోయలు పర్యాటకులను ఎంతగానో ఆకట్టుకుంటాయి. ఆసియాలోనే అతిపెద్ద మఠం తవాంగ్ కూడా ఇక్కడే ఉంది. ఈ నగరం బౌద్ధ విహారాలకు ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధి చెందింది. అరుణాచల్ ప్రదేశ్‌లో పర్యాటక ఆకర్షణలో తవాంగ్ మొనాస్టరీని గోల్డెన్ నామ్‌గ్యాల్ లాస్ అని కూడా పిలుస్తారు.
ఈ మఠం సముద్ర మట్టానికి దాదాపు 3,000 మీటర్ల ఎత్తులో ఉంది. ఇది భారతదేశం అతిపెద్ద, ప్రపంచంలో రెండవ అతిపెద్ద మఠం హోదాను కలిగి ఉంది. ఇది సుమారు 400 సంవత్సరాల పురాతనమైనది. ఇక్కడ 300 మందికిపైగా బౌద్ధ సన్యాసులు ఆశ్రయం పొందుతున్నారు. ఇక్కడ నాగుల సరస్సు, సెలా పాస్, మాధురి సరస్సు, పాంగ్‌టెంగ్‌తో సరస్సు హార్ట్ లేక్, బంగా జంగ్ సరస్సు వంటి అనేక సరస్సులు ఉన్నాయి.