calender_icon.png 3 December, 2024 | 10:18 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ములుగు అందాలు దేశానికే తలమానికం

21-11-2024 02:20:32 AM

  1. మాల్దీవులను తలపించేలా లక్నవరం సరస్సు
  2. పర్యాటక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు

జనగామ, నవంబర్ 20 (విజయక్రాంతి): ములుగు జిల్లాలో ఎన్నో చారిత్రక ప్రదేశాలున్నాయని, ఈ ప్రాంతాలు దేశానికే తలమానికమని పర్యాటక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు కొనియాడారు. బుధవారం ములుగు జిల్లాలోని గోవిందరావు పేట మండలం బుస్సాపూర్ గ్రామంలో గల లక్నవరం సరస్సులో రూ.7 కోట్ల వ్యయం తో అభివృద్ధి చేసిన మూడో ద్వీపాన్ని ఆయన ప్రారంభించారు.

అనంతరం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. ములుగు జిల్లాలో లక్నవరం సరస్సుతో పాటు రామప్ప, మేడారం ప్రాంతాలు దేశంలోనే ప్రసిద్ధిచెందాయన్నారు. సీఎం రేవంత్‌రెడ్డి పర్యాటక ప్రదేశాలకు ఎంతో ప్రాధాన్యం ఇస్తున్నారన్నారు. మాల్దీవులు, సిమ్లా, మున్నార్ వంటి ప్రసిద్ధ పర్యాటక ప్రాంతాలకు దీటుగా లక్నవరంను తయారుచేశామన్నారు.

చుట్టూ పచ్చని కొండలు, మధ్యన అల్లంత దూరాన నీరు, 12 దీవులతో రమనీయంగా కనిపించే లక్నవరానికి ఎన్నో ప్రత్యేకతలు ఉన్నాయన్నారు. ఇప్పటికే రెండు ద్వీపాలతో కాటేజీల నిర్మాణం పూర్తిచేయగా.. మరిన్ని కాటేజీల నిర్మాణంతో మూడో ద్వీపాన్ని అందుబాటులోకి తెచ్చామని చెప్పారు.

మూడెకరాల స్థలంలో ఫ్రీకోట్స్ సంస్థ అన్ని హంగులతో మూడో ద్వీపాన్ని తీర్చిదిద్దిందని తెలిపారు. రాష్ట్రంలోని పర్యాటక ప్రాంతాలన్నింటినీ సుందరీకరించేందుకు సీఎం రేవంత్‌రెడ్డి చొరవ చూపుతున్నారని చెప్పారు. 

కేంద్రం సహకరించాలి: సీతక్క

మంత్రి సీతక్క మాట్లాడుతూ.. తెలంగాణలోని పర్యాటక ప్రాంతాల అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం సహకరించాలని కోరారు. రూ.వంద కోట్లు తీసుకువచ్చేలా కేంద్ర మంత్రులు బండి సంజయ్, కిషన్‌రెడ్డి చొరవ చూపాలని ఆమె అన్నారు. పర్యాటక ప్రాంతాల్లో ప్రజలు ప్లాస్టిక్ వినియోగించవద్దని, ప్రకృతి అందాలను కాపాడేందుకు సహకరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో పర్యాటక అభివృద్ధి సంస్థ చైర్మన్ పటేల్ రమేశ్‌రెడ్డి, ఎంపీ బలరాంనాయక్, పర్యాటక అభివృద్ధి సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ ప్రకాశ్‌రెడ్డి, ములుగు  కలెక్టర్ దివాకర, ఎస్పీ శబరీష్ తదితరులు పాల్గొన్నారు.

బమ్మెరను సందర్శించిన జూపల్లి

మహాకవి పోతన జన్మించిన జనగామ జిల్లాలోని బమ్మెర ప్రాంతాన్ని పర్యాటక ప్రాంతంగా అభివృద్ధి చేస్తామని మంత్రి జూపల్లి కృష్ణారావు హామీ ఇచ్చారు. బుధవారం ఆయన బమ్మెరలోని పోతన నివాస స్థలాన్ని సందర్శించారు. పోతన నివాస ప్రాంతంలో అక్షరభ్యాసం హాల్, సరస్వతి దేవి విగ్రహం, పోతన విగ్రహం ఏర్పాటు చేస్తామన్నారు. పోతన బావి పక్కనే చెక్‌డ్యాం నిర్మిస్తామని చెప్పారు. ఆయనవెంట ఎమ్మె ల్సీ తీన్మార్ మల్లన్న, పాలకుర్తి ఎమ్మెల్యే యశస్వినిరెడ్డి, పర్యాటక శాఖ చైర్మన్ రమేశ్‌రెడ్డి, కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్ ఉన్నారు.