‘దేవర’తో టాలీవుడ్‌ను పలకరించింది యువ కథా నాయకి జాన్వీకపూర్. ప్రస్తుత ప్రేక్షకుల అభిరుచికి తగ్గ పాత్రలను ఎంచుకుంటూ కెరీర్‌లో ముందుకు సాగుతున్నట్టు తెలుస్తోందీ భామ. ఈ బ్యూటీ తాజాగా నటిస్తున్న ‘పరమ్ సుందరి’ చిత్రమే ఇందుకు నిదర్శనం. తుషార్ జలోటా దర్శకత్వంలో రొమాంటిక్ కామెడీ ఎంటర్‌టైనర్‌గా రూపొందుతోంది. ఇందులో జాన్వీ.. బాలీవుడ్ స్టార్ సిద్ధార్థ్ మల్హోత్రాతో తొలిసారి స్క్రీన్ పంచుకోనుంది.
ఢిల్లీకి చెందిన సున్నితమైన వ్యక్తిత్వం కలిగిన ధనిక వ్యాపారవేత్త పాత్రలో సిద్ధార్థ్ మల్హోత్రా నటిస్తుండగా.. జాన్వీ పాత్ర ఇందుకు పూర్తి భిన్నంగా ఉంటుందని సమాచారం. వివిధ రకాల అభిప్రాయాలు, విలువలు కలిగిన కేరళకు చెందిన ఆధునిక కళాకారిణి పాత్రలో జాన్వీ మెప్పిస్తుందని అంటున్నారు. విభిన్న నేపథ్యాలు, వ్యక్తిత్వాలు.. ఓ జంటను ఎలా కలిపేస్తాయో ఈ కథ చూపుతుందట.
అంతేకాదు ఈ సినిమా.. ఓ క్లాసిక్ కథగా విమర్శకులను సైతం ఆకట్టుకునేలా ఉంటుందట. ‘ముంజ్యా’, ‘స్త్రీ2’ వంటి హారర్ కామెడీ చిత్రాలకు పనిచేసిన కాస్ట్యూమ్ డిజైనర్ శీతల్‌శర్మ ఈ సినిమాలో భాగమయ్యారు. ఇక ఈ చిత్రబృందం తాజాగా ఓ అప్‌డేట్ ఇచ్చింది. ఇదివరకే కథానాయకుడు సిద్ధార్థ్ మల్హోత్రాను ‘పరమ్’గా పరిచయం చేస్తూ ఫస్ట్‌లుక్ విడుదల చేసిన మేకర్స్ కథానాయకి జాన్వీ ఫస్ట్‌లుక్‌ను మంగళవారం రిలీజ్ చేశారు. అభినవ అతిలోక సుందరి జాన్వీ కపూర్‌ను ఈ చిత్రంలో ‘సుందరి’గా పరిచయం చేస్తూ విడుదల చేశారు. ఈ పోస్టర్‌లో జాన్వీ లుక్ ఆకట్టుకుంటోంది. ఈ సినిమా 2025, జూలై 25న విడుదల కానుంది.