calender_icon.png 19 April, 2025 | 8:42 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కృష్ణమ్మ సిగలో నల్లమల అందాలు..

06-04-2025 12:00:00 AM

చుట్టూ దట్టమైన అటవీ ప్రాంతం.. నడుమ కృష్ణమ్మ పరుగులు.. అక్కడక్కడా జలపాతాల హోరుతో ప్రకృతి పర్యాటకానికి స్వర్గధామం నల్లమల. ఓవైపు ఆధ్యాత్మికత.. మరోవైపు పర్యాటకుల మదిని దోచే రమణీయదృశ్యాలు.. ఎగసిపడే జలపాతాలు సాహసికులకు ఆహ్వానం పలుకుతుంటాయి. 

నాగర్‌కర్నూల్ జిల్లా అమ్రాబాద్ మండలం మన్ననూరు నుంచి నల్లమల అటవీ ప్రాంతం ప్రారంభమవుతుంది. ఈ అభయారణ్యం పెద్ద పులులకు నిలయం. అటవీ శాఖ లెక్కల ప్రకారం ప్రస్తుతం 26 పెద్ద పులులు ఉన్నాయి. కొండలు, గుట్టలు ఎక్కువగా ఉండటంతో ఈ ప్రాంతంలో పెద్ద, చిన్న జలపాతాలు దాదాపు 20కి పైగానే ఉన్నాయి.

అందులో ప్రధానమైనవి ఉమామహేశ్వరం, మల్లెలతీర్థం, సలేశ్వరం, లొద్ది అంతర్ గంగ, భైరవ గుండం, మునీశ్వర జలపాతాలున్నాయి. జలపాతాలు ఉన్న ప్రాంతాల సమీపంలోనే శైవ క్షేత్రాలు ఉండటం విశేషం. అలాగే సోమశిలలోని సోమేశ్వర ఆలయాలు, ఐలాండ్‌గా పేరొందిన అమరగిరి, చీమలతిప్ప ప్రాంతాలు పర్యాటకులను ఆకట్టుకుంటాయి.

వీటితో పాటు జటప్రోలు ఆలయం, సింగోటం లక్ష్మీనరసింహ స్వామి ఆలయం ప్రత్యేకమైనవి. నల్లమల చెంచుల ఆరాధ్య దైవమైన భౌరాపూర్ అమ్మవారి ఆలయం, మద్దిమడుగు అంజన్న ఆలయం నల్లమలలో ప్రసిద్ధి చెందినవి. 

కృష్ణమ్మ అందాలు..

కృష్ణానది జూరాల తర్వాత శ్రీశైలం చేరుకుంటుంది. దాదాపు 78 కిలోమీటర్ల మేర నల్లమలలో ప్రవహిస్తుంది. నది ప్రవహిస్తున్న ప్రాంతాల్లో వ్యూ పాయింట్లు ఆకట్టుకుంటాయి. ప్రధానంగా కొల్లాపూర్ వద్ద కృష్ణమ్మ అందాలు స్పెషల్ అట్రాక్షన్. ఇక్కడ కొండల నడుమ నుంచి పాయలుగా నది ప్రవహిస్తుంది.

కొల్లాపూర్ నుంచి శ్రీశైలం ప్రాజెక్టు బ్యాక్ వాటర్ మీదుగా ప్రయాణిస్తే ఆంకాళమ్మ కోటకు చేరుకోవచ్చు. అలాగే అక్క మహాదేవి గుహలను సందర్శించవచ్చు. వీటితో పాటు గీసుగండి రివర్ పాయింట్, గున్నంపెంట వ్యు పాయింట్, ఆక్టోపస్ వ్యూ పాయింట్ల వద్ద పచ్చని కొండల నడుమ ప్రవహించే కృష్ణమ్మ అందాలను చూడొచ్చు. 

అక్కమహాదేవి గుహలు..

అక్కమహాదేవి గేట్ నుంచి సుమారు ఐదు కిలోమీటర్ల దూరంలో గుహలు ఉంటాయి. దట్టమైన అడవిలో నడుచుకుంటూ వెళ్లే సమయంలో పర్యాటకులకు వివిధ రకాల జంతువులు, పక్షులు కనువిందు చేస్తాయి. కొండ దిగువన కృష్ణానది ఒడ్డున ఉన్న  అక్కమహాదేవి గుహలు దర్శనమిస్తాయి. అక్కడ సహజ సిద్ధంగా ఏర్పడ్డ పెద్ద శిలాతోరణం, అక్కమహాదేవి తపస్సు చేసిన ఇరుకైన గుహ, అందులోని శివలింగం దర్శించుకోవచ్చు. గుహలో ప్రయాణం సాహసంతో కూడుకున్నది.