స్థానిక సంస్థల్లో 42 శాతం రిజర్వేషన్లకు చట్టబద్ధత కల్పించాలి
సమగ్ర కులగణన వెంటనే చేపట్టాలి : బీఆర్‌ఎస్ నేత కేటీఆర్
హైదరాబాద్, సెప్టెంబర్ 18 (విజయక్రాంతి) : రాష్ట్ర ప్రభుత్వం నవంబర్ 10 లోగా బీసీ డిక్లరేషన్‌లో ఇచ్చిన హామీలు అమలు చేయకుంటే పెద్దఎత్తున పోరాటం చేస్తామని బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కే తారక రామారావు హెచ్చరించారు. బలహీనవర్గాల పక్షాన ప్రభుత్వాన్ని వెంటాడుతామని, స్థానిక సంస్థల్లో 42 శాతం రిజర్వేషన్లు అమలుచేసేదాకా వదిలిపెట్టమన్నారు. వెంటనే రాష్ట్రంలో సమగ్ర కులగణన చేపట్టాలని, మాటలకే పరిమితం కాకుండా వెంటనే ప్రక్రియ ప్రారంభించాలని సూచించారు.
బుధవారం తెలంగాణ భవన్‌లో పార్టీ బీసీ ముఖ్యనేతలతోపాటు తెలంగాణ సర్పంచుల సంఘం, ఎంపీటీసీల సంఘాలతో కేటీఆర్ సమావేశం నిర్వహించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ, కాంగ్రెస్ పార్టీ బీసీ వర్గాలకు చేస్తున్న ద్రోహాన్ని ప్రజలకు వివరిస్తామని, గత ఏడాది నవంబర్ 10న కామారెడ్డిలో బీసీ డిక్లరేషన్ పేరిట ఇచ్చిన హామీలను పక్కకు పెట్టిన తీరును ఎండగడుతామన్నారు. బీసీలకు ఐదు సంవత్సరాల్లో లక్ష కోట్ల రూపాయలు కేటాయిస్తామన్న కాంగ్రెస్ ప్రభుత్వ హామీ మరిచిపోయిందని, ఈసారి కేవలం 8వేల కోట్లు మాత్రమే బడ్జెట్‌లో పెట్టి మోసం చేసిందన్నారు.
రానున్న బడ్జెట్‌లో రూ. 25వేల నుంచి 30వేల కోట్లు బీసీలకు కేటాయించాలని డిమాండ్ చేశారు. బీసీల అభివృద్ధికి ప్రత్యేక శాఖ ఏర్పాటు చేస్తామని చెప్పిన మాటలకు పాలకులు కట్టుబడి ఉండాలని, అత్యంత వెనకబడిన బలహీనవర్గాలు, ఎంబీసీలకు మంత్రిత్వ శాఖను ఏర్పాటు చేస్తామన్న హామీ నిలబెట్టుకోవాలని సూచించారు. రాష్ట్రంలో కేవలం ఇద్దరు మంత్రులు మాత్రమే బీసీలు ఉన్నారని, మరికొంతమందికి మంత్రి పదవులు ఇవ్వాలని డిమాండ్ చేశారు.
రాష్ట్రంలో 22 మంది పద్మశాలి నేతన్నలు ఆత్మహత్యలు చేసుకున్నారని, వారికి గత ప్రభుత్వం ఇచ్చిన ఆర్డర్లు ప్రస్తుత ప్రభుత్వం ఇవ్వకపోవడంతో ఆత్మహత్యలు చేసుకున్నారని ఆవేదన వ్యక్తం చేస్తూ వారి కుటుం బాలను ఆదుకోవాలని కోరారు. చేప పిల్లల పంపిణీ నిలిపివేసి ముదిరాజు, గంగపుత్రలకు ప్రభుత్వం అన్యాయం చేసి వారి పొట్ట కొట్టిందని మండిపడ్డారు. బలహీన వర్గాల కోసం ఏర్పాటు చేసిన గురుకుల విద్యాసంస్థల్లో పూర్తిగా ప్రమాణాలు దిగజార్చి వారి విద్యా అవకాశాలను దెబ్బకొట్టిందన్నారు.
బీసీలను బీఆర్‌ఎస్ కదిలిస్తుంది
బీసీల సమస్యల కోసం బీఆర్‌ఎస్ రాజీలేని పోరాటం చేస్తుందని, గతంలో సింహభాగం సీట్లు బీసీలకు ఇచ్చిన ఘనత తమ పార్టీకే చెందుతుందన్నారు. మూడు ఎన్నికలతో పాటు ఇటీవల జరిగిన పార్లమెంటు ఎన్నికల్లోకూడా బీజేపీ,కాంగ్రెస్ పార్టీల కంటే ఎక్కువ సీట్లు కేటాయించినట్లు తెలిపారు. నలుగురిని రాజ్యసభకు, 21 మంది బీసీ బిడ్డలకు కార్పొరేషన్ చైర్మన్లుగా అవకాశం కల్పించామని, బలహీన వర్గాల పట్ల మా నిబద్దతను మాటల్లో కాకుండా ఆచరణలో చూపించామన్నారు. ఉన్నత విద్యకోసం గురుకులాలలు ఏర్పాటు చేయడంతో పాటు విదేశీ విద్య పథకం తీసుకొచ్చామని వెల్లడించారు. రాష్ట్రంలో బీసీ వర్గాలకు పెద్ద దిక్కుగా బీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్ ఉంటారని స్పష్టం చేశారు.
తమ ప్రభుత్వం రాగానే సమగ్ర కుటుంబ సర్వే 24 గంటల్లో పూర్తి చేశామని, చేయడానికి పెద్ద కష్టమేమికాదని, ఈప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే వెంటనే సమగ్ర కులగణన చేపట్టాలని సవాల్ విసిరారు. త్వరలో బీసీ వర్గాలకు సంబంధించిన సమస్యల పరిష్కారానికి ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకొచ్చే విషయంలో పార్టీ విస్తృతమైన కార్యాచరణను ప్రకటిస్తుందన్నారు. పార్టీలో బీసీ నేతలను వర్కింగ్ గ్రూపులుగా విభజించి సమస్యలు వాటి పరిష్కారాలు, ప్రత్యక్ష పోరాటాలపై పనిచేస్తాయని తెలిపారు. విద్యార్థులకు కనీసం సరైన అన్నం పెట్టలేని పరిస్థితిలో ప్రభుత్వం ఉందని ఆగ్రహం వ్యక్తం చేశారు.
ప్రభుత్వానికి ప్రధాన ప్రతిపక్షంగా క్షేత్రస్థాయిలో పర్యటించి తగిన సూచనలు, సలహాలు ఇస్తామని, రాష్ట్రవ్యాప్తంగా పర్యటనలు చేపట్టి సమస్యలు ప్రభుత్వ దృష్టికి తీసుకువచ్చి పరిష్కారానికి ఒత్తిడి తీసుకొస్తామని పేర్కొన్నారు. ఉస్మానియా, గాంధీ ఆసుపత్రులు కరోనా సమయంలో వేలాదిమంది ప్రాణాలు కాపాడాయని, ప్రస్తుతం 48 మంది పిల్లలు 14 మంది బాలింతలు ఒక ఆసుపత్రుల్లో మరణించడం బాధ కలిగిస్తుందన్నారు.
ఆసమస్యను సరిచేయాల్సిన పాలకులు కుంటి సాకులు చెప్పి తప్పించుకుంటున్నారని ఆరోపించారు. రాష్ట్రంలో వైరల్ జ్వరాలు, డెంగ్యూ విజృంభిస్తున్న సమయంలో హెల్త్ ఎమర్జెన్సీ ప్రకటించాలని, ప్రజల ఆరోగ్యం పట్ల ప్రభుత్వం సరిగ్గా బాధ్యతలు నిర్వహించడం లేదన్నారు. జమిలి ఎన్నికల విషయంలో కేంద్ర ప్రభుత్వం ఏవిధంగా ముందుకు వెళ్లుతుందో స్పష్టత లేదని, జనాభా లెక్కలతో పాటు సీట్ల విభజన, రీ ఆర్గనైజేషన్ జరగాలని పేర్కొన్నారు. తమ పార్టీ జమిలి ఎన్నికలపై విధాన పరమైన నిర్ణయం తీసుకుంటుందన్నారు.