calender_icon.png 16 January, 2025 | 6:26 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

బనకచర్ల ప్రాజెక్టు అభ్యంతరకరమే!

16-01-2025 03:20:40 AM

  1. జల్‌శక్తి మంత్రి, ఏపీ సీఎం, యాజమాన్య బోర్డులకు లేఖలు 
  2. నీటి కేటాయింపుల విషయంలో మరింత బలంగా వాదించాలి 
  3. ఢిల్లీలో నీటిపారుదల శాఖ సమీక్షలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి

హైదరాబాద్, జనవరి 15 (విజయక్రాంతి): తెలంగాణకు అంతరాష్ర్ట నదీ జలాల వివాద చట్టం (ఐఎస్‌ఆర్‌డబ్ల్యూడీఏ)-1956 సెక్షన్ 3 ప్రకారం నీటి కేటాయింపులు చేపట్టాలనే విషయంపై కృష్ణా జల వివాదాల ట్రిబ్యునల్-2 (కేడబ్ల్యూడీటీ-2) ఎదు ట బలమైన వాదనలు వినిపించాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సూచించారు. ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టం (ఏపీఆర్‌ఏ)-2014లోని సెక్షన్ 89 ప్రకారం ప్రాజెక్టుల వారీగా నీటి కేటాయింపులు చేపట్టాల్సి ఉం టుందన్నారు.

ఏపీఆర్‌ఏ ప్రకారం ఏర్పాటైన అపెక్స్ కౌన్సిల్ సైతం సెక్షన్ 3 ఆధారంగా నీటి పంపకాలు రెండు రాష్ట్రాల మధ్య చేపట్టాలని సూచించిందని సీఎం తెలిపారు. కేడ బ్ల్యూడీటీ-2 తర్వాతి విధివిధానాలపై (ఫర్‌దర్ టర్మ్స్ ఆఫ్ రిఫరెన్స్) ఏపీ ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించినా అత్యున్నత న్యాయస్థానం ఎటువంటి స్టే ఇవ్వని విషయాన్ని సీఎం గుర్తుచేశారు. రాష్ర్ట నీటి పారుదల శాఖపై సీఎం.. ఢిల్లీలోని తన అధికారిక నివాసంలో బుధవారం సాయంత్రం సమీక్ష నిర్వహించారు.

సమీక్షలో రాష్ర్ట నీటి పారుదల శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్ రెడ్డి, మంత్రులు శ్రీధర్ బాబు, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, రాష్ర్ట ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి, సీఎం ప్రధాన కార్యదర్శి వి.శేషాద్రి, రాష్ర్ట ప్రభుత్వ సలహాదారు (నీటి పారుదల శాఖ) ఆదిత్యనాథ్ దాస్,  నీటి పారుదల శాఖ కార్యదర్శి రాహుల్ బొజ్జా తదితరులు పాల్గొన్నారు.

ఎటువంటి అనుమతులు లేకుండా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గోదావరి--బనకచర్ల అనుసంధాన ప్రాజెక్టు చేప్టటడంపై కేంద్ర జల్‌శక్తి మంత్రి సీఆర్ పాటిల్, ఏపీ సీఎం చంద్రబాబు నాయుడితో పాటు గోదావరి, కృష్ణా నది యాజ మాన్య బోర్డులకు (జీఆర్‌ఎంబీ, కేఆర్‌ఎంబీ) తెలంగాణ తరఫున అభ్యంతరాలు తెలుపుతూ లేఖలు రాయాలని సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు.

ఏపీ పునర్విభజన చట్టం ప్రకారం రెండు రాష్ట్రాల్లో ఏ రాష్ర్టమైనా ఏ నదిపైనైనా ప్రాజెక్టు నిర్మించాలంటే జీఆర్‌ఎంబీ, కేఆర్‌ఎంబీలతో పాటు పొరుగు రాష్ట్రానికి సమాచారం ఇవ్వాలనే విషయాన్ని లేఖల్లో ప్రస్తావించాలని సీఎం సూచించారు.

పోలవరం ప్రాజెక్టుతో భద్రాచలం ముంపు విషయంపై హైదరాబాద్ ఐఐటీతో అధ్యయనం చేయించే అంశాన్ని నిర్దేశిత సమయంలో పూర్తి చేయించాలని అధికారులను ఆదేశించారు. సమ్మక్క సారక్క బ్యారేజీ, పాలమూరు--రంగారెడ్డి ఎత్తిపోతలకు అనుమతులు సాధించే ప్రక్రియను వేగవంతం చేయాలని సీఎం సూచించారు.

కృష్ణా జలాల్లో అన్యాయం జరగొద్దు : మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి

కృష్ణా జలాల విషయంలో తెలంగాణకు అన్యాయం జరగొద్దని అందుకు తగ్గట్లుగా ట్రిబ్యునల్ ముందు రాష్ర్టం తరపున బలమైన వాదనలు వినిపిస్తామని సాగునీటి శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి చెప్పారు. కృష్ణా జలాల వివాదంపై గురువారం నుంచి బ్రజేష్ కుమార్ ట్రిబ్యునల్ విచారణ చేపట్టనున్న నేపథ్యంలో బుధవారం ఢిల్లీలో ఉన్న అధికారులతో సమీక్ష నిర్వహించారు.

తెలంగాణలో సాగు విస్తీర్ణం ఎక్కువని, మెజారిటీ వాటా రాష్ట్రానికి దక్కాలని అభిప్రాయపడ్డారు. గతంలో బీఆర్‌ఎస్ ప్రభుత్వం తెలంగాణకు 299 టీఎంసీలు, ఏపీకి 512 టీఎంసీల ప్రతిపాదనకు సూచనప్రాయంగా ఒప్పుకున్నారన్నారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో 811 టీఎంసీల నీటి కేటాయింపులు జరిగాయని, ఆ వాదనను తాము ఇప్పుడు ఏకీభవించడం లేదన్నారు.