calender_icon.png 8 January, 2025 | 1:35 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఆసీస్‌దే ఆధిపత్యం

07-12-2024 12:49:47 AM

  1. తొలి ఇన్నింగ్స్‌లో భారత్ 180 ఆలౌట్
  2. పరువు కాపాడిన నితీశ్‌రెడ్డి n స్టార్క్‌కు 6 వికెట్లు 
  3. పింక్ బాల్ టెస్టు

అడిలైడ్: ఆస్ట్రేలియాతో మొదలైన పింక్ బాల్ టెస్టులో టీమిండియా మొదటిరోజే తడబడింది. పెర్త్ టెస్టులో విజయంతో జోష్ మీదున్న భారత్‌కు అడిలైడ్ టెస్టులో ఆసీస్ ముకుతాడు వేసింది. మిచెల్ స్టార్క్ నిప్పులు చెరిగే బంతులతో ఆరు వికెట్లు పడగొట్టి టీమిండియా పతనాన్ని శాసించాడు. ఫలితంగా రోహిత్ సేన తొలి ఇన్నింగ్స్‌లో 44.1 ఓవర్లలో 180 పరుగులకు కుప్పకూలింది.

హైదరాబాదీ ఆల్‌రౌండర్ నితీశ్ కుమార్ రెడ్డి (42) మరోసారి సాధికారికంగా ఆడి భారత్ పరువును నిలిపాడు. స్టార్క్ ఆరు వికెట్లతో చెలరేగితే.. కమిన్స్, బోలండ్ చెరో 2 వికెట్లు తీశారు. భారత ఇన్నింగ్స్‌లో అన్ని వికెట్లు సీమర్లకే పడడం విశేషం. అనంతరం తొలి ఇన్నింగ్స్ ఆరంభించిన ఆసీస్ రోజు ముగిసే సమయానికి 33 ఓవర్లలో వికెట్ నష్టపోయి 86 పరుగులు చేసింది.

మెక్‌స్వీని (38*), లబుషేన్ (20*) క్రీజులో ఉన్నారు. బుమ్రాకు ఒక వికెట్ లభించింది. భారత్ మూడు మార్పులతో.. ఆసీస్ ఒక్క మార్పుతో బరిలోకి దిగింది.  దివంగత ఆటగాళ్లు ఫిలిప్ హ్యూజ్, ఇయాన్ రెడ్‌పాత్ గుర్తుగా బ్లాక్ ఆర్మ్ బాండ్స్ ధరించారు.

మిడిలార్డర్ వైఫల్యం

టాస్ గెలిచి బ్యాటింగ్ ఏంచుకున్న భారత్‌కు ఆదిలోనే షాక్ తగిలింది. తొలి టెస్టు సెంచరీ హీరో జైస్వాల్ గోల్డెన్ డకౌటయ్యాడు. కేఎల్ రాహుల్‌కు జత కలిసిన గిల్ మరో వికెట్ పడకుండా జాగ్రత్తగా ఆడారు. లంచ్ విరామానికి ముందు స్టార్క్ బౌలింగ్‌లో రాహుల్ (37), కోహ్లీ (7) ఔటయ్యారు. మిడిలార్డర్‌లో వచ్చిన కెప్టెన్ రోహిత్ (3) తీవ్రంగా నిరాశపరిచాడు.

దీంతో 109 పరుగులకే 6 వికెట్లు కోల్పోయింది. ఈ దశలో నితీశ్ రెడ్డి (42), అశ్విన్ (22) వికెట్ల పతనాన్ని అడ్డుకొని ఇన్నింగ్స్ నడిపించారు. అశ్విన్ ఔట్ అనంతరం ఆసీస్ బౌలర్ల ధాటికి టెయిలెండర్లు ఎక్కువసేపు నిలవకలేకపోయారు. ఆఖరి వికెట్‌గా నితీశ్ పెవిలియన్ చేర డంతో భారత్ ఇన్నింగ్స్ ముగిసింది. ఆ తర్వాత బ్యాటింగ్ ఆరంభించిన ఆస్ట్రేలియా నిలకడగా ఆడి ఒక్క వికెట్ మాత్రమే నష్టపోయి రోజును ముగించింది.