సమన్యాసమే సంన్యాసం. శరీరాన్ని, ఇంద్రియాలను శాశ్వతం గా భావించక, జరుగుతున్న సమస్త కార్యకలాపాలను సమన్వయ రీతిలో ఆత్మో న్ముఖం చేయటమే సన్యాసి చేయవలసింది. ఎండమావుల వెంట పరుగెడుతూ, కడకు ఆశాభంగం చెందే కంటే, ఎండమావులలో నీరుండదన్న నిజాన్ని ముందే గ్రహించగల ఇంద్రియ నిగ్రహాన్ని సాధించుకోవాలి. చరించి, చరించి ఏదో ఒకనాడు నశించే దేహాన్ని గురించిన భావనను దాటి, అనుభవంతో, అనుభూతితో ఆత్మ ను ఎరిగి, దానితో తాదాత్మ్యం చెందాలి.
ప్రకృతి శక్తిమంతం, సృజనాత్మకం,
త్యాగమయం. అది మాతృ సమానం. సమస్త ప్రాణికోటికీ ఆహార, విహారాది అవసరాలు నిరపేక్షంగా వరదానం చేయగల తల్లి! ప్రకృతిని గౌరవిస్తూ, ప్రేమిస్తూ, జీవు లు బిడ్డల వలె జీవించగలిగితే, సర్వ ప్రపంచమూ ప్రశాంతి నిలయమవుతుంది. ప్రాణులలో ఉన్నత జన్మ పొందిన మానవుడి కర్తవ్యమిదే!
దీనికై ఆత్మవిద్యను ఆధారం చేసుకోవాలి. ప్రపంచమంతా పరమాత్మ ప్రకాశ మేనని అనుభవ పూర్వకంగా తెలుసుకోవాలి. పరిమిత చైతన్యంతో కూడివున్న జీవుడూ, అపరిమిత, అనంత, అవ్యయ, అచ్యుతానంద చైతన్యంగా పరమాత్మ కలసి ఈ ప్రపంచంలో ఉంటున్నారన్న స్పృహ, సన్యాస, అంటే సమన్యాస విధానంతో బలపడి, మనసు, బుద్ధి, చిత్తం, అహంకారం వంటి స్థితులను దాటి జీవుడు పూర్ణుడవుతాడు. ఇదే నిజమైన అధ్యాత్మ మార్గం. సాధనా రీతి కూడా ఇదే! ఈ ఆత్మపథం సత్యపథమే! అదే విజయానికి ఆధారం! అసలు విజయమూ అదే!
అప్పటికే మనోవృత్తులన్నీ ఇంద్రియాల సాలెగూటి నుంచీ విడివడినందున, ఆత్మ ప్రకాశనం అనుభవంలోకి వస్తుంది.
మనసు మలగినందున ప్రాపంచికమైన కోర్కెలు నెమ్మదించి, మోహం నశించి మోహక్షయమవుతుంది. ఇది జన్మ రాహిత్యానికి దారి తీస్తుంది. ప్రవచనం ఒక వైఖరి మాత్రమే! దానిద్వారా ఆత్మ సాక్షాత్కారం దుర్లభం. మౌనం నుంచీ, సంస్థిత స్థితి నుంచీ, తీవ్ర అన్వేషణ నుంచీ ఆత్మ అనుభవమవుతుంది. ఈ స్థితిలో శుద్ధమనసు రూపుదిద్దుకుని, పవిత్ర ప్రకృతులు ఏర్పడి, సమన్యాసంలో ఈ ప్రపంచంలోనే సంచరిస్తున్న సన్యాసులు, ఉపనిషత్ రహస్యాలను ఎరిగి, అటువంటి వేదాంత విజ్ఞా నంలో పరిపూర్ణత సాధించిన విజ్ఞానవేత్తలు, జ్ఞానం ప్రకాశిస్తున్న వేళలో, దేహాత్మ భావనను దాటి ఆత్మ స్వరూపులై నిలకడ చెందుతారు.
నిజానికి ఆ క్షణాలే వారికి అంతకాలం! ‘ఆపై ఈ భూమండలంపై వారి జీవనయాత్ర జీవన్ముక్తి స్థితిలోనే కొనసాగుతుంది. నామ, రూప, భావాదులను దాటి, పరాత్పరమైన ఆత్మలో నిష్ఠుడవుతాడు. ఈ స్థితి స్థిరమైంది కనుక పాప, తాప, శాప, శోకాదులను దాటి, పరబ్రహ్మంలో చిత్తాన్ని నిలిపి నిలిపి, చివరకు తానూ పరబ్రహ్మమవుతాడు. ఇదొక అద్వితీయ, రమణీయ భూమిక.
నిరంతరం సత్కర్మలను ఆచరిస్తూ, వేదోపనిషత్ విద్యలను గౌరవిస్తూ, సర్వదేవతా భావనలను ఆరాధిస్తూ, సంభావిస్తూ, విశ్వాసమే శ్వాసగా జీవిస్తూ, నిష్ఠను ఆచరణ భూమికను చేస్తూ,
అహంకార, మమకార రాహిత్యానికి చిహ్నమైన ‘శిరోముండనా’న్ని వహిస్తూ, తలపులను సమసింప చేసుకుని అంటే సన్యాసివలె జీవిస్తూ, నిఖిల ప్రపంచానికీ ఆదర్శమూర్తిగా అలరారే వ్యక్తులకు ‘ఆత్మజ్ఞానం’ లేదా ‘బ్రహ్మజ్ఞానం’ లభించి తీరుతుంది.
‘ముండకము’ అంటే సన్యాసమని అర్థం! అనుకుంటున్నంత తేలిక కానిదీ, అయినా అందుకోవలసిందీ బ్రహ్మజ్ఞానం! ప్రపంచ భావన మలగి, పరమా త్మ భావన వెలిగేది ఇక్కడే!! ఇదే ముండకోపనిషత్ సారం.
వి.యస్.ఆర్.మూర్తి