01-03-2025 11:45:02 PM
మంత్రి జూపల్లి అండదండలతోనే దాడులు..
బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్..
హైదరాబాద్ (విజయక్రాంతి): కొల్లాపూర్ నియోజకవర్గంలోని నార్యనాయక్ తండాలో బీఆర్‌ఎస్ నాయకులు, కార్యకర్తలపై కాంగ్రెస్ నేతల దాడి అత్యంత హేయమైన చర్య అని, దాడులను ఖండిస్తున్నట్లు శనివారం బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పేర్కొన్నారు. మంత్రి జూపల్లి కృష్ణారావు అండదండలతోనే దాడులకు తెగపడ్డారన్నారు. శుక్రవారం సాతాపూర్‌లో జరిగిన దాడి మరవముందే మరోసారి బీఆర్‌ఎస్ శ్రేణులపై ఇలా దాడి చేసిన ఘటన చూస్తే, కాంగ్రెస్ అరాచకాలకు అడ్డు అదుపు లేకుండా పోతోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇప్పటికైనా పోలీసుశాఖ బాధ్యతగా వ్యవహరించి దాడికి పాల్పడిన నిందితులపై అదుపులోకి తీసుకోవాలని డిమాండ్ చేశారు.
కార్మికుల ఆచూకీపై తప్పుడు ప్రకటనలా?
ఎస్‌ఎల్బీసీ టన్నెల్ ప్రమాదంపై కాంగ్రెస్ మంత్రులు, ఎమ్మెల్యేలు తప్పుడు ప్రకటనలు చేస్తున్నారని ఎక్స్ వేదికగా కేటీఆర్ స్పందించారు. 8 మంది కార్మికుల ఆచూకీ గురించి ఇష్టానుసారంగా ప్రకటనలు చేస్తున్నారని మండిపడ్డారు. ఒక ఎమ్మెల్యే మృతదేహాలు లభ్యమయ్యాయని.. మరో ఎమ్మెల్యే ప్రధాని ఎందుకు సంతాపం తెలపడం లేదని.. ఓ మంత్రి ఎవరూ బతికిలేరని చెబుతున్నారని, ఏమిటీ ఈ సర్కస్ అని ప్రశ్నించారు.