- కుంభ్ ఘటనపై చర్చకు ప్రతిపక్షాల డిమాండ్
- ఆగ్రహం వ్యక్తం చేసిన స్పీకర్ ఓం బిర్లా
- రాష్ట్రపతి ప్రసంగంపై రాహుల్ మరోమారు బోరింగ్ వ్యాఖ్యలు
- సుదీర్ఘంగా ప్రసంగించిన ప్రతిపక్ష నేత
- రాహుల్ తీరును తప్పుబట్టిన బీజేపీ
న్యూఢిల్లీ, ఫిబ్రవరి 3: సోమవారం తిరిగి ప్రారంభమైన పార్లమెంట్ సమావేశాలు నిరసనలతో హోరెత్తాయి. సభ ప్రారంభం కాగా నే కుంభమేళా తొక్కిసలాట ఘటన గురించి చర్చించాలని ఇండియా కూటమి ఎంపీలు పట్టుబట్టారు. దీంతో లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా వారి మీద ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘ఇండియా’ ఎంపీలు ప్రభుత్వానికి వ్యతిరేఖంగా నినాదాలు చేశారు. సామాన్యులు పన్నులు చెల్లించడం ద్వారా సమకూరిన ఈ నిధుల్ని వృథా చేయొద్దని స్పీకర్ ప్రతిపక్షాలకు సూచించారు.
అయినా కూడా వారు వినకపోవడంతో ఆ అరుపులు, అల్లర్ల మధ్యే ప్రశ్నోత్తరాలు కొనసాగాయి. ఈ క్రమంలో స్పీకర్ ప్రతిపక్ష సభ్యుల మీద కొన్ని ఘాటు వ్యాఖ్యలు చేస్తూ వారికి చురకలు అంటించారు. అయినా కానీ నిరసనలు మాత్రం ఆగలేదు. ఇక పెద్దల సభలో కూడా ఇలాంటి దృశ్యాలే దర్శనం ఇచ్చాయి. రాజ్యసభ నుంచి ఇండియా కూటమి రాజ్యసభ ఎంపీ లు వాకౌట్ చేశారు. ఇక ఈ నిరసనలు, అల్లర్ల మధ్యే రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై చర్చ మొదల యింది. లోక్‌సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ సుదీర్ఘంగా మాట్లాడారు. ‘
నేడు మోదీ ప్రసంగం
రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానం మీద ప్రధాని నరేంద్ర మోదీ లోక్‌సభలో నేడు సాయంత్రం మాట్లాడనున్నారు.
ఏండ్లుగా వింటున్నా..
రాష్ట్రపతి ప్రసంగం గురించి ప్రధాన ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ సభలో మాట్లాడుతూ.. ‘రాష్ట్రపతి ప్రసంగం వినేందుకు చాలా అవస్థ పడ్డాను. ఏండ్లుగా ఇవే విషయాలను వింటున్నా. అదే పాత స్టోరీ. అవే పాత విషయాలు. రాష్ట్రపతి ప్రసంగం ఇలా ఉండకూడదు’. అని అన్నారు.
యువకుల చేతుల్లో ఉంది..
దేశ భవిష్యత్ అనేది యువకుల చేతుల్లో ఉందని రాహుల్ తెలిపారు. ‘నేను ఒక్క విషయం చెప్పదలచుకున్నా. ప్రధాని అయినా ఎవరయినా సరే ఈ విషయాన్ని అంగీకరించాలి. మనం ఎంతో ఎదిగాం. కానీ ప్రస్తుతం మన ఆర్థిక వ్యవస్థ వేగం మందగించింది. నిరుద్యోగితను మనం సరిగ్గా పరిష్కరించలేకపోయాం. ఎన్డీయే ప్రభుత్వమనే కాదు.. గతంలో పాలించిన యూపీఏ ప్రభుత్వం కూడా నిరుద్యోగ సమస్యను సరిగ్గా పరిష్కరించలేకపోయింది. ఈ దేశ భవిష్యత్తును యువత నిర్ణయిస్తారు. అంతా వారి చేతుల్లోనే ఉంది.
మోదీజీ అలా జరిగేది..
అమెరికా నూతన అధ్యక్షుడు ట్రంప్ ప్రమాణస్వీకారం గురించి కూడా రాహుల్ గాంధీ స్పందించారు. ‘మన ఆర్థిక వ్యవస్థ కనుక సరిగ్గా ఉండి ఉంటే ట్రంప్ స్వయానా వచ్చి ప్రధాని మోదీని ఆహ్వానించి ఉండేవారు. మనం ఇలా విదేశాంగ మంత్రిని పంపించి ప్రధానిని ఆహ్వానించమని కోరే పరిస్థితి ఉండేది కాదు’ అని ఆరోపించారు.
ఓబీసీ గణన ఎక్కడ?
కేంద్రంలోని ఎన్డీయే ప్రభుత్వం ఇప్పటి వరకు కూడా ఓబీసీ గణనను చేపట్టలేదు. ప్రధాని మోదీ ఓబీసీ అని చెబుతున్నా కానీ ఇప్పటి వరకు గణన చేపట్టలేదు. ‘మేము అధికారంలో ఉన్న తెలంగాణలో కులగణన చేపట్టాం. అక్కడ 90 శాతం మంది దళితులు, ఆదివాసీలు, దళితులు, బీసీలే ఉన్నారు. ఇదే తీరుగా దేశవ్యాప్తంగా ఉండనున్నారు. ఓబీసీల జనాభా దేశజనాభాలో 50 శాతానికి తగ్గకుండా ఉండనుంది’ అని వివరించారు.
రాహుల్‌పై విరుచుకుపడ్డ రిజిజు..
పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి కిరణ్ రిజిజు రాహుల్ గాంధీపై విమర్శలు గుప్పించారు. అమెరికాకు కొత్త ఎన్నికైన ట్రంప్ ప్రమాణస్వీకారానికి మోదీకి ఆహ్వానం అందలేదు అని రాహుల్ అన్న వ్యాఖ్యలపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘ప్రతిపక్ష నాయకుడు ఇటువంటి వ్యాఖ్యలు చేయడం సరికాదు. ఇది రెండు దేశాల మధ్య సంబంధాలకు సంబంధించినది. కానీ అతడు మాత్రం ప్రధాని ఆహ్వానం గురించి తప్పుడు ప్రకటనలు చేస్తున్నాడు’ అని ఫైర్ అయ్యారు.
రాహుల్ వ్యాఖ్యలు ఖండించిన జైశంకర్
రాహుల్ గాంధీ లోక్‌సభలో తన అమెరికా పర్యటన గురించి చేసిన వ్యాఖ్యలను విదేశాంగ శాఖ మంత్రి జైశంకర్ ఖండించారు. ‘నా అమెరికా పర్యటనపై రాహుల్ అవాస్తవాలు చెప్పారు. మాజీ అధ్యక్షుడు బైడెన్ అడ్మినిస్ట్రేషన్‌లోని సెక్రటరీ, ఎన్‌ఎస్‌ఏను కలిసేందుకే వెళ్లా. ప్రధానికి ట్రంప్ ఆహ్వానం అందించడంపై ఎటువంటి చర్చలు జరపలేదు’ అని ఎక్స్‌లో వివరణ ఇచ్చారు.
మేక్ ఇన్ ఇండియా మంచి ఐడియానే కానీ..
మేక్ ఇన్ ఇండియా పథకం గురించి కూడా రాహుల్ గాంధీ వ్యాఖ్యానించారు. ‘మేక్ ఇన్ ఇండియా అనేది మంచి కార్యక్రమమే. కానీ దాని అమలులో ప్రధాని మోదీ విఫలం అయ్యారు. 2014లో దేశ జీడీపీలో తయారీ రంగం వాటా 15.3 శా తంగా ఉంటే ప్రస్తుతం అది 12.6 శాతానికి పడిపోయింది. గత 60 ఏండ్లలో ఎ న్నడూ తయారీ రంగం ఇంత కనిష్ట స్థా యికి దిగజారలేదు. ఈ విషయంలో నేను ప్రధానిని నిందించడం లేదు. ఆయన ప్రయత్నించారు కావొచ్చు కానీ విఫలమయ్యారు.
ఉత్పత్తి ఆధారిత దేశంగా మనం విఫలమై ఆ స్థానాన్ని చైనాకు అప్పగించేశాం. 1990 నుంచి చూసుకుంటే ప్రతి ప్రభుత్వం వినియోగం విషయంలో సరైన విధంగా ముందుకు వెళ్లింది. కానీ కొద్ది సంవత్సరాలుగా మనం విఫలం అవుతూ ఉన్నాం. మనం ఉత్పత్తిలో వెనుకబడడం వల్ల చైనా ఆ స్థానాన్ని ఆక్రమించింది. ఇక మీదటైనా మనం ఉత్పత్తి మీద దృష్టి సారించాలి. చైనా బలగాలు మన దేశంలోకి చొచ్చుకొచ్చాయనే విషయాన్ని ప్రధాని అంగీకరించలేదు.
కానీ మన బలగాలు ఇప్పటికి కూడా చైనా బలగాలతో చర్చలు జరుపుతూనే ఉన్నాయి. ఇది సరైన విధానం కాదు. కానీ ఇదే నిజం. ప్రజలు ఏఐ (కృతిమ మేధ) గురించి మాట్లాడుకుంటున్నారు. కానీ డేటా అనేది లేకుండా ఏఐ అనేది ఏమీ చేయలేదు. మనం డేటా గురించి చూసినట్లయితే ప్రతి చిన్న డేటా కూడా ప్రొడక్షన్ వ్యవస్థ నుంచే వస్తుంది.
అదే డేటాతో ఈ ఫోన్ తయారవుతుంది. ఎలక్ట్రిక్ కార్లు తయారు కావాలన్నా అదే డేటా కావాలి. కానీ అన్ని రకాల పరికరాలు తయారు చేసేందుకు కావాల్సిన డేటా నేడు చైనా సొంతం’ అని రాహుల్ పేర్కొన్నారు.
సోనియాపై సభా హక్కుల ఉల్లంఘన నోటీసు..
కాంగ్రెస్ నేత సోనియా గాంధీకి షాక్ తగిలింది. ఆమెపై బీజేపీ ఎంపీలు సభా హక్కుల ఉల్లంఘన నోటీసును ప్రవేశపెట్టారు. రాష్ట్రపతి ఉపన్యాసంపై మాట్లాడుతూ.. సోని యా అభ్యంతరకర పదాలు వాడారని, ఆమె వ్యాఖ్యలు ప్రథమ పౌరు రాలు గౌరవానికి భంగం కలిగేలా ఉన్నాయని ఆరోపించారు. పార్లమెం ట్ సమావేశాల ప్రారంభం సందర్భంగా రాష్ట్రపతి ప్రసంగం చివరకు వచ్చేసరికి ఆమె బాగా అలసిపోయి, మాట్లాడలేకపోయారని సోనియా గాంధీ విమర్శించింది. దీనిపై రాష్ట్రపతి కార్యాలయం కూడా అభ్యం తరం వ్యక్తం చేసింది.
మనం చైనాకు పన్నులు కడుతున్నాం..
‘ఏ దేశమైనా రెండు అంశాలను నిర్వహిస్తుంది. ఒకటి ఉత్పత్తి, రెండోది వినియోగం. వినియోగ రంగాన్నే సేవా రంగం అని మనం అంటున్నాం. ఉత్పత్తి సరిగ్గా లేకుంటే సేవారంగానికి చాలా కష్టం అవుతుంది. మన దేశంలో ఎన్నో ఉత్తమ కంపెనీలున్నాయి. మన దేశంలో ఫోన్లు తయారు అవుతున్నాయనేది నిజం కాదు..
నిజానికి మన దేశంలో ఫోన్లు అసెంబుల్ మాత్రమే అవుతున్నాయి. వాటికి కావాల్సిన విడిభా గాలు చైనాలో తయారవుతున్నాయి. మనం చైనాకు పన్నులు కడుతున్నాం. లోక్‌సభ ఎన్నికల్లో గెలిచిన తర్వాత ప్రధాని రాజ్యాంగం ముందు తలవంచడం కాంగ్రెస్ పార్టీ విజయం’. అని పేర్కొన్నారు.