- వ్యతిరేక తీర్మానం అంటే తల్లిపాలు తాగి రొమ్ము గుద్దినట్లే
- కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి బండి సంజయ్
హైదరాబాద్, జూలై 24 (విజయక్రాంతి): కేంద్ర బడ్జెట్‌లో తెలంగాణపై వివక్ష చూపారని నిరసిస్తూ కాంగ్రెస్, బీఆర్‌ఎస్, ఎంఐఎం పార్టీలు అసెంబ్లీలో తీర్మానం చేయడం దుర్మార్గమని కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి బండి సంజయ్ విమర్శించారు. తెలంగాణ అభివృద్ధిలో కీలక భాగస్వామిగా ఉన్న కేంద్రాన్ని నిందిస్తూ తీర్మానం చేయడమంటే తల్లిపాలు తాగి రొమ్ముగుద్దినట్లేనని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. అసెంబ్లీలో చేసిన తీర్మానం పొలిటికల్ బ్లాక్ పేపర్ తప్ప మరొకటి కాదన్నారు. గత పదేళ్లలో తెలంగాణ అభివృద్ధికి కేంద్రం దాదాపు రూ.10 లక్షల కోట్ల నిధులు వెచ్చించిందనే స్పృహ లేకుండా నిందించడం సరికాదని హితవు పలికారు.
తెలంగాణలో ప్రతి పథకంలో కేంద్ర వాటా
దేశంలో తెలంగాణ భాగమని, కేంద్రం ప్రతీ పథకానికి ఖర్చు చేసే నిధుల్లో తెలంగాణ వాటా ఉంటుందనే సోయి మర్చిపోయి సీఎం, మంత్రులతోపాటు బీఆర్‌ఎస్, ఎంఐఎం నేతలు మాట్లాడటం వారి అవకాశవాదానికి పరాకాష్టగా అభివర్ణించారు. రాష్ర్టంలోని ఏ గ్రామ పంచాయతీకైనా వెళదాం... కేంద్ర వాటా లేకుండా ఏ పంచాయతీలోనైనా పాలన కొనసాగుతుందని, అభివృద్ధి జరుగుతుందని నిరూపించే దమ్ముందా? అని సీఎం రేవంత్ రెడ్డి, ప్రతిపక్ష నేత కేసీఆర్‌కు సవాల్ విసిరారు.
కరీంనగర్‌కు అన్యాయం అంటూ తప్పుడు ప్రచారం...
తెలంగాణతో పాటు కరీంనగర్‌కు కేంద్ర బడ్జెట్‌లో అన్యాయం జరిగిందంటూ కాంగ్రెస్, బీజేపీతో పాటు ఓ సెక్షన్ మీడియా తప్పుడు ప్రచారం చేస్తున్నారని సంజయ్ విమర్శించారు. రాబోయే ఐదేళ్లలో ఏ విధంగా అభివృద్ధి చేయాలనే ప్రణాళిక తమకు ఉందని అన్నారు.
కాంగ్రెస్, బీఆర్‌ఎస్ అసలు రూపం భయటపడుతుందనే భయంతో...
బీఆర్‌ఎస్ 10 ఏళ్ల పాలనలో జరిగిన మోసాలన్నీ ఒక్కొక్కటికీ బయటపడుతున్న నేపథ్యంలో అసెంబ్లీలో చర్చ జరిగితే కాంగ్రెస్, బీఆర్‌ఎస్ పార్టీల అసలు రూపు బయటకు వస్తుందనే భయంతో ఈ రెండు పార్టీలు కలిసి ఆడుతున్న డ్రామాలో భాంగానే కేంద్రాన్ని బదనాం చేస్తున్నారని మండిపడ్డారు. బీఆర్‌ఎస్ మోసాలపై శ్వేత పత్రాలు విడుదల చేసిన కాంగ్రెస్ అదే పార్టీతో కలిసి కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వాన్ని నిందించేందుకు చేసిన పొలిటికల్ బ్లాక్ పేపర్‌లాంటిదే ఈ తీర్మానం అన్నారు. కాంగ్రెస్‌లో గులాబీ వాసనలు వస్తున్నాయని ఎద్దేవా చేశారు.