calender_icon.png 11 January, 2025 | 11:18 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కరీంనగర్‌కు ఖ్యాతి తెచ్చిన కళ

15-09-2024 05:56:45 AM

  1. ఖండాంతరాలకు కరీంనగర్ ఖ్యాతి పంచిన సిల్వర్ ఫిలిగ్రీ 
  2. ప్రముఖులు ఇష్టపడుతున్న ఫిలిగ్రీ కళాఖండాలు 
  3. అమెరికా అధ్యక్షుడి నుంచి అంబానీ వరకు

కరీంనగర్, సెప్టెంబరు 14 (విజయక్రాంతి): సున్నితమైన లోహకళ అయిన వెండి నగిషీ (సిల్వర్ ఫిలిగ్రీ) పనిలో కరీంనగర్ కళాకారుల ఖ్యాతి ఖండాంతరాలకు విస్తరించింది. వెండి తీగతో అపురూప కళాఖండాలను సృష్టించే కళకు కరీంనగర్ జిల్లా పుట్టినిల్లుగా మారింది. కరీంనగర్ సిల్వర్ ఫిలిగ్రీ కళకు నాలుగు వందల ఏళ్ల చరిత్ర ఉంది. నిజాం నవాబుల హయాంలో మొద లై క్రమక్రమంగా ఖండాంతరాలకు పాకింది. ఈ కళ కరీంనగర్‌కు సొంతమై దక్షిణ భారతదేశంలో ప్రాముఖ్యత వహించింది. కరీం నగర్ సమీపంలోని ఎలగందుల గ్రామంలో వెండి నగిషీ కళాకారులు ఈ కళను చాటారు.

వీరు కరీంనగర్‌కు వచ్చి ఈ వృత్తిలోనే స్థిరపడి నేడు ప్రపంచవ్యాప్తంగా ప్రముఖులు అబ్బురపడే వెండి నగిషీ కళాఖం డాలను తయారు చేస్తున్నారు. భారతదేశానికి వచ్చిన ఏ విదేశీ అతిథికైనా కరీంనగర్ సిల్వర్ ఫిలిగ్రీ కళాకారులు తయారు చేసిన కళాఖండాన్ని జ్ఞాపికగా అందించడం ఆనవాయితీగా వస్తుంది. చంద్రబాబు ఉమ్మడి ఆంద్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో హైదరాబాద్‌కు వచ్చిన ఆనాటి అమెరికా అధ్యక్షుడు బిల్ క్లింటన్ నుంచి భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము వరకు ఈ కళారూపాలను చూసి ప్రశంసలు కురిపించారు.

ఈ కళాకారుల చేతిలో చార్మినార్, తాజ్‌మహల్, ఎర్రకోట, వీణ, మయూరం, దేవుళ్ల ఆకృతులు, ప్రముఖ స్థలాలను సిల్వర్ ఫిలిగ్రీ ద్వారా సుందరంగా రూపొందిస్తుంటారు. పెద్దపెద్ద కళారూపాల నుంచి తాళం చెవి, సిగరేట్ యాష్ మొదలు చెవుల కమ్మల వరకు అనేక రకాల తక్కువ ధరలకే దొరికే జ్ఞాపికలను తయారు చేస్తున్నారు. ఇటీవల జరిగిన జీ దేశాల సదస్సులో కరీంనగర్ ఫిలిగ్రీ కళాకారులు తయారు చేసిన అశోకచక్ర లోగో బటన్‌ను అతిథులకు ప్రధా ని మోదీ అందించారు.

అక్కడ ఫిలిగ్రీ ప్రదర్శన కూడా ఏర్పాటు చేయడం విశేషం. గత సీఎం కేసీఆర్ దేశ విదేశాల నుంచి వచ్చిన ప్రముఖులకు సిల్వర్ ఫిలిగ్రీతో తయారు చేసిన వీణ, చార్మినార్‌లను బహుమతిగా ఇచ్చారు. మిషన్ భగీరథ ప్రారంభోత్సవానికి అతిథిగా వచ్చిన ప్రధాని మోదీకి, కాళేశ్వరం ప్రాజెక్టు మొదలు పెట్టిన సందర్భంలో అతిథులుగా వచ్చిన అప్పటి మహారాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడ్నవిస్, ఏపీ 

సీఎం వైఎస్ జగన్ సిల్వర్ ఫిలిగ్రీ జ్ఞాపికను కేసీఆర్ బహుమతిగా అందజేశారు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ముద్దు ల కూతురు ఇవాంకకూ ఈ ఫిలిగ్రీని గిఫ్టుగా అందజేయడమే కాకుండా ఆమె పర్యటన సందర్భంగా ప్రత్యేక స్టాల్‌ను ఏర్పాటు చేశా రు. అలాగే అపరకుబేరుడు ముఖేశ్ అంబానీ కుమారుడి వివాహానికి దేశ విదేశీ అతిథులకు కరీంనగర్ ఫిలిగ్రీ కళాఖండాలను బహుమతులుగా అందించారు. 

ఆద్యుడు కడార్ల మునయ్య

ఒకప్పటి జిల్లా కేంద్రం ఎలగందలలో ఈ కళ పురుడు పోసుకుంది. కడార్ల మునయ్య (పనయ్య) ఈ కళకు ఆద్యుడు. 1905లో కరీంనగర్‌కు చేరుకున్న ఇతని వారసులు ఈ కళను కాపాడుతూ వస్తున్నారు. అతి ప్రాచీనమైన చేతి పని, అతి సన్నని వెండి తీగల అల్లికలతో డిజైన్లను ఈ కళాకారులు తయారు చేస్తుంటారు. 

400 ఏండ్ల చరిత్ర

ఫిలిగ్రీని ‘తార్కాసి’ అని కూడా పిలుస్తారు. 400 ఏళ్ల చరిత్ర ఉంది. ఎలగందల కోటను ఏలిన మొగలులు, నిజాంల ఆయుధాల తయారీ యూనిట్ ఇక్కడ ఉండేది.   సుదూర ప్రాంతాల నుంచి నైపుణ్యం కలిగిన అనేకమంది హస్త కళాకారులను ఆయుధాల తయారీకి ఉపయోగించుకునేవారు. క్రమక్రమంగా ఈ కళను స్థానికులు నేర్చుకున్నారు.

కరీంనగర్ సిల్వర్ ఫిలిగ్రీ క్రాఫ్ట్ క్లస్టర్ ఇంటలెక్చువల్ ప్రాపర్టీ రైట్స్, జీఐను 1907లో పొందింది. హస్తకళలు, రాష్ట్ర కార్పొరేషన్ల పరిధిలో ఈ కళాకారులకు శిక్షణ ఇచ్చారు. సిల్వర్ ఫిలిగ్రీ ఆఫ్ కరీంనగర్ వెల్ఫేర్ సొసైటీ (సిఫ్కా) 2008లో సిల్వర్ ఫిలిగ్రీ కళాకారులచే ఏర్పడింది. చేతివృత్తిదారులకు మెరుగైన జీవనోపాధిని అందించడానికి ఉద్దేశించిన లాభాపేక్ష లేని సంస్థ ఇది. దాదాపు 520 మంది కళాకారులను నమో దు చేసుకుంది.  

మెరుగుపడిన జీవన ప్రమాణాలు

కరీంనగర్ వెండి నగిషీ కళాకారులు అంతరించిపోతున్న కళకు జీవం పోస్తున్నారు. ప్రస్తుతం సిఫ్కా కింద 200 మంది కళాకారులు పనిచేస్తున్నారు. వీరు ప్రతి నెల రూ.20 30 వేల వరకు ఆర్జిస్తున్నారు. ఒకప్పుడు పూర్తిగా ఈ వృత్తిపై జీవించినవా రంతా వృద్దులు కావడంతో వారి వారసులైన యువత ఫిలిగ్రీని నేర్చుకోవడానికి ఆసక్తి చూపకపోవడంతో కొంతమంది కళాకారులు కలిసి సిఫ్కాను ఏర్పాటు చేసుకున్నారు.

ఈ సొసైటీ ఏర్పాటు అనంతరం తిరిగి కళం జీవం పోసుకుంది. ప్రస్తుతం పూర్వవైభవం పొందేలా ముందు కు సాగుతుంది. స్థానికంగా ఆసక్తి ఉన్న యువతీ, యువకులకు, మహిళలకు సిల్వర్ ఫిలిగ్రీలో ప్రత్యేక శిక్షణ ఇచ్చి వారిని నిపుణులుగా తీర్చిదిద్దుతున్నారు. ఒకప్పుడు పాత పద్ధతుల్లో ఫిలిగ్రీ వస్తువులు తయారు చేసేవారు. ప్రస్తుతం కాలానికి అనుగుణంగా వినియోగదారుల ఆలోచనల మేరకు కొత్త మోడల్స్‌ను తయారు చేస్తున్నారు. 

నంది విగ్రహాలను ఆర్డర్ చేసిన ప్రభుత్వం

గతంలో కరీంనగర్ కళాకారులు అనేక ఆకృతులలో సిల్వర్ ఫిలిగ్రీ కళాఖండాలను రూపొందించినప్పటికి నంది ఆకృతిలో చేయలేదు. రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ప్రభుత్వం తరపున రామప్పలోని నంది విగ్రహం నమూనాతో కళాఖండం రూపొందించేందుకు కరీంనగర్ కళాకారులకు ఆర్డర్ ఇచ్చారు. ప్రస్తుతం రామప్ప ఆలయ నమూనాతోపాటు నంది విగ్రహ నమూనాలు వీరి చేతిలో రూపుదిద్దుకుంటున్నాయి. రాష్ట్రానికి వచ్చే అతిథులకు వీటిని సీఎం బహుమతులుగా అందిస్తున్నారు. ఇటీవల గణేశ్ ఉత్సవాల్లో పాల్గొన్న ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్‌కళ్యాణ్‌కు అందించారు. 200 నంది, రామప్ప ఆలయ నమూనాలకు ప్రభుత్వం ఆర్డర్ ఇచ్చింది. 

పూర్తిగా వెండితోనే..

పూర్తిగా వెండి తీగతో తయారు చేసే ఫిలిగ్రీ వస్తువులకు దేశ విదేశాల్లో సైతం మంచి గిరాకీ ఉంది. ఒకప్పుడు పూర్తిగా ఈ వృత్తిపై జీవించినవాళ్లంతా వృద్ధాప్యంలోకి రావడంతో మొత్తం వారి వారసు లు, యువత సిల్వర్ ఫిలిగ్రీ వస్తువుల తయారీని నేర్చుకుని ముందుకు సాగుతున్నారు. కొంతమంది కళాకారులు కలిసి ‘సిఫ్కా’ను ఏర్పాటు చేసుకున్నారు.

సిల్వర్ ఫిలిగ్రీ ఆఫ్ కరీంనగర్ హ్యాండీక్రాఫ్ట్ వెల్ఫేర్ సొసైటీగా నామకరణం చేసుకొని ఈ ఫిలిగ్రీ పూర్వ వైభవం తీసుకురావడానికి ముందుకు నడుస్తున్నారు. దారం నమూనాలో ఉండే వెండి తీగలతో గృహోపకరణాలను తయారు చేసే పద్ధతినే సిల్వర్ ఫిలిగ్రీ అంటారు. సామా న్యంగా జనం వాడుకలో ఉండే ప్లేట్లు, చెవిరింగులు, మెడను అలంకరించే ఆభరణాలు, గిన్నెలు, కీచైన్స్, చెంచాలు లాం టివి ఈ ఫిలిగ్రీ కళలో రూపొందిస్తారు. 

అనేక అవార్డులు

వెండి నగిషీ కళాకారుడైన కడార్ల మునయ్య వారసుడు కడార్ల నారాయణ ను 1967లో కేంద్రం జాతీయ అవార్డుతో సత్కరించింది. ఇది మొదటి అవార్డు. అద్భుతమైన నైపుణ్యాలను ప్రదర్శించి 8 జాతీయ అవార్డులను సొంతం చేసుకుం ది సిఫ్కా. గద్దె అశోక్‌కు 2019లో జాతీయ అవార్డు లభించింది. అలాగే 2022లో ఈ కళకు జాతీయస్థాయిలో గుర్తింపు లభించింది. కరీంనగర్ కళాకారుడు రూపొందించిన వెండితీగల పల్లకికి జాతీయ అవార్డు దక్కింది.

2007, 2010, 2013 లో రాష్ట్ర ప్రభుత్వ హ్యాండిక్రాఫ్ట్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ అవార్డు లభించింది. అలాగే 2008లో సిఫ్కాకు యూనెస్కో అవార్డు లభించింది. అర్రోజు అశోక్‌కు కళానిధి అవార్డు, 2010, 2011, 20215, 2018లో జాతీయ అవార్డులు లభించాయి. 2011లో పీఎంఈజీపీ అవార్డులు లభించాయి.

ముఖ్యమంత్రి రేవంత్, మంత్రి శ్రీధర్‌బాబు ప్రోత్సాహం

సిల్వర్ ఫిలిగ్రీ కళాకారుల జీవనోపాధి మెరుగుపరి చేందుకు ప్రభుత్వం తరపున ఈ కళను ప్రోత్సహించేందుకు రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు మమ్మల్ని ప్రోత్సహిస్తున్నారు. ప్రభుత్వం తరపున మాకు రామప్ప నమూనా, నంది విగ్రహాల నమూనా కళాఖండాలు తయారు చేయాలని ఆదేశించారు.

ఇదే విధంగా ప్రభుత్వం ప్రోత్సహిస్తే ఈ కళను నమ్ముకున్న వృత్తిదారులను మరింత ముందుకు తీసుకెళ్లడంతోపాటు ఉపాధి అవకాశాలు మెరుగుపడతాయి. ప్రస్తుతం 200 మంది కళాకారులు సిల్వర్ ఫిలిగ్రీ వస్తువుల తయారీలో నిమగ్నమయ్యారు. మాకు వస్తున్న ఆర్డర్లను బట్టి నెలకు రూ.25,౦౦౦ వరకు ఉపాధి కల్పిస్తున్నాం. ఈ కళాఖండం పేటెంట్లను కరీంనగర్ కళాకా రులం అయిన మేము పొంది ఉన్నందున విశ్వవ్యాప్తంగా వీటి అమ్మకాల ను ప్రోత్సహిస్తే చాలామంది ఇక్కడి స్వర్ణకార కుటుంబాలకు ఉపాధి అవకాశాలు మెరు గుపడతాయి. 

 గద్దె అశోక్, 

సిఫ్కా ప్రధాన కార్యదర్శి

ప్రభుత్వ ఆదరణ చాలా బాగుంది

కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు సంబంధించిన చాలారకాల ఆర్డర్ల ను ప్రత్యేకంగా తయారుచేసి పంపిస్తున్నాం. ఒకప్పుడు ఈ కళ ఆదరణకు నోచుకోలేదు. మేము సొసైటీని ఏర్పా టు చేసుకుని ముందుకు సాగడంతో జీవనోపాధి మెరుగుపడింది. మా కుటుంబాల్లో చాలామంది ఈ కళనే నమ్ముకుని జీవిస్తున్నారు. 

చిట్టిమల్ల వేణుగోపాల్, 

సిల్వర్ ఫిలిగ్రీ కళాకారుడు

ప్రభుత్వం ముందుకు రావాలి

ప్రపంచ ప్రసిద్ధిగాంచిన సిల్వర్ ఫిలిగ్రీలాంటి కళను అభివృద్ధి పర్చడానికి, ప్రచారం చేయ డానికి ప్రభుత్వం ముందుకు వస్తే మా జీవన ప్రమాణాలు మరింత మెరుగుపడతాయి. పేటెంట్ హక్కు కలిగి ఉన్న కరీంనగర్ కళాకారులు 30 సంవత్సరాల క్రితం చాలా అవస్థలు పడ్డారు. ఒక దశలో వృత్తి మానేయడానికి సిద్ధమైన క్రమంలో ప్రభుత్వం ప్రోత్సాహం అందించడంతో క్రమక్రమంగా ఈ కళకు జీవం పోసినట్లయింది. అయితే మరింత ప్రోత్సాహం అందించి పరిశ్రమ తరహాలో దీన్ని అభివృద్ధి చేస్తే ఉపయోగకరంగా ఉంటుంది. 

 సిరికొండ కేశవాచారి, 

సిల్వర్ ఫిలిగ్రీ కళాకారుడు