calender_icon.png 14 January, 2025 | 6:12 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

సైన్యం దేనికైనా సిద్ధం!

14-01-2025 01:18:10 AM

* వాస్తవాధీన రేఖ వద్ద పరిస్థితి స్థిరంగా ఉంది

* ఆర్మీ చీఫ్ జనరల్ ఉపేంద్ర ద్వివేది

న్యూఢిల్లీ, జనవరి 13: వాస్తవాధీన రేఖ(ఎల్‌ఏసీ) వద్ద పరిస్థితి స్థిరంగానే ఉందని ఆర్మీ చీఫ్ జనరల్ ఉపేంద్ర ద్వివేది చెప్పారు. సోమవారం న్యూఢిల్లీలో నిర్వహించిన వార్షిక ప్రెస్ మీట్‌లో ఆయన పలు విషయాలు వెల్లడించారు. తూర్పు లద్దాఖ్‌లో డెప్సాంగ్, దెమ్‌చోక్ ప్రాంతాల్లో పెట్రోలింగ్ మొదలైందని చెప్పారు.

భారత సైన్యం ఎటువంటి పరిస్థితులనైనా ఎదుర్కొనడానికి సిద్ధంగా ఉందన్నారు. సైన్యం మోహరింపులు పకడ్బందీగా ఉన్నాయన్నారు. సరిహద్దు ప్రాంతాల్లో మౌలిక వసతుల కల్పన వేగవంతం చేయడంతో పాటు సామర్థ్యాలను బలపరుస్తున్నట్లు తెలిపారు. పాకిస్థాన్ వైపు ఉన్న నియంత్రణ రేఖ వద్ద చొరబాట్లను అడ్డుకుంటున్నట్లు చెప్పారు.

పాక్ ఉగ్ర స్థావరాలు కొనసాగుతున్నాయన్నారు. ప్రస్తుతం జమ్మూకశ్మీర్‌లో పరిస్థితి పూర్తిగా నియంత్రణలో ఉందని వెల్లడించారు. నిరుడు ఈ ప్రాంతంలో సైన్యం అంతమొందించిన వారిలో 60 శాతం మంది టెర్రరిస్టులు పాకిస్థాన్ నుంచి వచ్చినవారేనని పేర్కొన్నారు. ఈశాన్య భారత్‌లోని మణిపుర్‌లో ప్రభుత్వం తీసుకున్న చర్యలు సత్ఫలితాలు అందిస్తున్నాయన్నారు. ఆ రాష్ట్రంలో పరిస్థితులు అదుపులోనే ఉన్నాయని వివరించారు.