calender_icon.png 22 October, 2024 | 11:01 PM

వాదన మంచిదే!

05-10-2024 12:00:00 AM

భార్యాభర్తల మధ్య అభిప్రాయభేదాలు వాటి ఫలితంగా చిన్న చిన్న వివాదాలు, సంఘర్షణలు వస్తూ పోతూ ఉంటాయి. తమదే సరి అని ఎవరికి వారు వాదించుకుంటారు. ఈ వాదనతో కొన్ని ఉపయోగాలూ ఉన్నాయంటున్నారు నిపుణులు. అప్పుడే ఒకరి గురించి మరొకరికి పూర్తిగా తెలుస్తుంది. అయితే వాదన ఆరోగ్యకరంగానే సాగాలి తప్ప, నిందించుకోవడం, ఒకరి తప్పులను మరొకరు ఎత్తిచూపడం చేయకూడదు.

అవతలివారి మనసులో ఏముందో వారి వాదన ద్వారా తెలుసుకోవాలంటే పూర్తిగా వినాలి. అప్పుడే వారి భావోద్వేగాలను అర్థం చేసుకోవచ్చు. అలాకాక వారి మాటలకు కోపాన్ని ప్రదర్శిస్తే వాదన పెరుగుతుందే తప్ప తగ్గదు. ఒకరు గట్టిగా వాదిస్తున్నప్పుడు, మరొకరు నిశ్శబ్దంగా ఉండగలగాలి. అప్పుడే ఆ గొడవ త్వరగా చల్లారిపోతుంది. ఆ తర్వాత అవతలివారికి అవగాహన కలిగించగలిగితే చాలు.

అక్కడితో ఆ విషయానికి తెరపడుతుంది. వాదన ముగిశాక కూడా ఎదుటి వారిని మాటలతో బాధ పెట్టకూడదు. అలా చేస్తే గొడవ మళ్లీ మొదలవుతుంది. అలా కాకుండా ప్రశాంతంగా ఇరువురూ కూర్చొని మాట్లాడుకుంటే చాలు.. ఎదుటివారి అభిప్రాయానికి విలువనివ్వాలని నిర్ణయించుకుంటే మరోసారి అటువంటి సందర్భాలు రావు. మీ తప్పు ఉందని అనిపిస్తే క్షమించమని అడిగితే చాలు. అవతలి వారికి మీపై మరింత ప్రేమ పెరుగుతుంది. మెల్లగా అంతా సర్దుకుంటుంది.