17-03-2025 05:00:43 PM
ప్రోగ్రెసివ్ సైకాలజిస్ట్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా అధ్యక్షురాలు డా. హిప్నో పద్మా కమలాకర్..
ముషీరాబాద్ (విజయక్రాంతి): చదివినవి రాయగలమన్న నమ్మకమే పరీక్షా భయానికి విరుగుడని ప్రోగ్రెసివ్ సైకాలజిస్ట్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా అధ్యక్షురాలు డా. హిప్నో పద్మా కమలాకర్ అన్నారు. బాగ్ లింగంపల్లి మైనారిటీ గురుకుల పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు వాణిశ్రీ ఆధ్వర్యంలో సోమవారం పదవ తరగతి విద్యార్థులకు డా.హిప్నో పద్మా కమలాకర్ పరీక్షలపై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ... పరీక్షల సమయం వచ్చిందంటే–కొంత మందికి టెన్షన్, మరికొందరికీ భయం, ఇంకొందరికీ బోర్ అని తెలిపారు. కానీ ఈ భయాలన్నిటికీ ఒకే ఒక్క మందు ఉన్నదని, నేను చదివినవి రాయగలను, అనే నమ్మకమేనన్నారు.
పరీక్షలంటే భయం కాదు, పరీక్షలంటే ఓ ఛాలెంజ్ అన్నారు. సరైన ప్రిపరేషన్‌తో, స్మార్ట్ స్టడీ టెక్నిక్స్‌తో ముందుకు వెళితే, ఏ పరీక్షయైన కష్టంగా అనిపించదన్నారు. పరీక్షల ముందు మనసు నిశ్చలంగా ఉంచి చదివిన దాన్ని నమ్మాలన్నారు. టెన్షన్‌తో చదివితే టెంపో నశించిపోతుందన్నారు. నిద్ర, ఆరోగ్యకరమైన ఆహారం లేకపోతే మెదడు నిద్రలోనే ఉంటుందన్నారు. పదవతరగతి పరీక్షలు రాయబోతున్న విద్యార్థులందరూ ఒత్తిడికి గుడ్‌బై చెప్పి, ఆత్మవిశ్వాసంతో ముందుకెళ్లాలని అన్నారు. ఈ కార్యక్రమంలో నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్ చైర్మన్ డా.కె.విజయ కుమార్, లయన్ పి.స్వరూప రాణి, జయశ్రీ పాల్గొన్నారు.