calender_icon.png 23 October, 2024 | 11:03 AM

ఎదురుచూపులకు తెరపడేనా!

18-09-2024 02:13:19 AM

  1. 20 ఏండ్లుగా సాగుతున్న ఎస్సెల్బీసీ సొరంగం పనులు 
  2. ఏడాదిగా పూర్తికాని బోరింగ్ యంత్రం మరమ్మతులు 
  3. తాజాగా రూ.2,200 కోట్లు కేటాయింపు 
  4. 20న పనులపై సమీక్షించనున్న డిప్యూటీ సీఎం భట్టి 

నల్లగొండ, సెప్టెంబర్ 17 (విజయక్రాంతి): ఉమ్మడి రాష్ట్రంలో 20 ఏండ్ల క్రితం జలయజ్ఞంలో భాగంగా ప్రారంభమైన ఎస్సెల్బీ సీ శ్రీశైలం (ఎడమగట్టు కాల్వ) సొరంగం పనులు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. ఉమ్మడి నల్లగొండ, మహబూబ్‌నగర్ జిల్లాల్లోని కరువు, ఫ్లోరైడ్ పీడిత వందలాది గ్రామాలకు తాగునీరు,  మూడున్నర లక్షల ఎకరాల ఆయకట్టుకు సాగునీరు అందించాలనే లక్ష్యంతో నాటి ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్‌రెడ్డి రూ.1,925 కోట్ల అంచనాతో పనులు ప్రారంభించారు. 2009 నాటికి పనులు పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు.

కానీ రెండు దశాబ్దాలు గడుస్తున్నా పనులు పూర్తికాలేదు. 43.930 కిలోమీటర్ల సొరంగ మార్గంలో ఇంకా 9.5 కి.మీ.లు పూర్తి కావాల్సి ఉంది. తాజాగా కాంగ్రెస్ ప్రభుత్వం పనులకు రూ.2,200 కోట్లు కేటాయించింది. నిధుల కేటాయింపునకు గ్రీన్ ఛానల్‌ను ఏర్పాటు చేసింది. రెండేళ్లలో పూర్తి చేసి ఉమ్మడి నల్లగొండ జిల్లాకు సాగు, తాగునీరు అందిస్తామని చెబుతోంది. 

ప్రాజెక్టు స్వరూపం

శ్రీశైలం ఎడమగుట్టు కాల్వపై 50 కిలోమీటర్ల సొరంగం తవ్వి కృష్ణానీటిని మళ్లించడం ఈ ప్రాజెక్టు ఉద్దేశం. సొరంగం పూర్తిగా నల్లమల అటవీ ప్రాంతం నుంచి వెళ్లాల్సి రావడంతో పేలుళ్ల కారణంగా వన్యప్రాణులకు ప్రమాదం జరుగుతుందని భావించి కేంద్ర అటవీశాఖ అనుమతులు నిరాకరించింది. దీంతో టన్నెల్ బోరింగ్ మిషన్ (టీబీఎం)తో సొరంగం పనులు చేపట్టి గ్రావిటీ ద్వారా జలాలను తరలించాలని నిర్ణయించారు. నాగర్ కర్నూల్ జిల్లా దోమలపెంట వద్ద సొరంగం ప్రారంభమై అచ్చంపేట మండలం మన్నెవారిపల్లి వద్ద ముగుస్తుంది. ఇక్కడి నుంచి మునుగోడు, దేవరకొండ నియోజకవర్గాలకు తాగు, సాగునీటిని తరలించాలన్నది లక్ష్యం.

తలనొప్పిగా టీబీఎం మరమ్మతులు

సొరంగం తవ్వకానికి వినియోగిస్తున్న టన్నెల్ బోరింగ్ మిషన్ (టీబీఎం)లో మరమ్మతులు వస్తే విడి భాగాల కోసం ఏళ్ల కొద్ది నిరీక్షించాల్సిన పరిస్థితి నెలకొంది. ప్రస్తుతం టీబీఎంలో కీలకమైన బేరింగ్‌లో సమస్య తలెత్తడంతో ఏడాదిన్నరగా పనులు నిలిచిపోయాయి. ఏడు మీటర్ల వ్యాసం, 57 మెట్రిక్ టన్నుల బరువు ఉండే ఈ బేరింగ్‌ను అమెరికా నుంచి దిగుమతి చేసుకోవా ల్సి ఉంది. 

ఔట్‌లెట్ పనుల పరిస్థితి ఇలా ఉంటే ఇన్‌లెట్ వైపు (శ్రీశైలం రిజర్వాయర్ సమీ పం నుంచి తవ్వే సొరంగం) పనులు సైతం ఇదే తరహాలో ఉన్నాయి. 2011 నుంచి ఊటనీరు వచ్చి చేరుతుండటంతో పనులు చేస్తున్నప్పుడు మట్టిరాళ్లు కూలుతున్నాయి. ఈ సమస్యను అధిగమించేందుకు సిమెంట్, పాలియేషన్‌తో గ్రౌండింగ్ చేసి పనులు ప్రారంభించినట్లు తెలిసింది. 

ప్రధాన అడ్డంకులివే..

ప్రాజెక్టు పనుల్లో ప్రధానంగా నాలుగు అడ్డంకులు నెలకొన్నాయి. ముంపునకు గురయ్యే అటవీ భూమికి కేంద్రం అనుమతులు, నిర్వాసితులవుతున్న చెంచు, గిరిజన తండాల ప్రజలకు పునరావాసం కల్పించడం, టన్నెల్ బోరింగ్ మిషన్ మరమ్మతులు ప్రధాన అడ్డంకులుగా మారాయి. శ్రీశైలం సొరంగ మార్గంలో భాగంగా రెండు టన్నెళ్ల నడుమ డిండి నదిపై తెల్దేవర్‌పల్లి వద్ద నిర్మిస్తున్న నక్కలగండి (డిండి బ్యాలెన్సింగ్ రిజర్వాయర్)లో అమ్రాబాద్ పులుల అభయారణ్యానికి చెందిన 281.03 హెక్టార్లు  ముంపునకు గురికానుంది. ఈ భూమిని ప్రాజెక్టు కోసం బదలాయిస్తే కేంద్ర అటవీశాఖ నుంచి అనుమతి రావాల్సి ఉంది. ఈ అంశంపై రాష్ట్ర ప్రభుత్వం సంప్రదింపులు జరిపినా ఇంకా అనుమతులు రాలేదని తెలి సింది. 

నక్కలగండి రిజర్వాయర్ నిర్మాణంతో నల్లగొండ జిల్లాలోని చందం పేట మండలంలోని నక్కలగండి తండా, నాగర్‌కర్నూల్ జిల్లాలోని కేశ్యతండ, మర్లపాడు తండాలు ముంపునకు గురవుతున్నాయి. నిర్వాసితులతో చర్చించి ఆర్‌అండ్‌ఆర్ ప్యాకేజీపై తుది నిర్ణయం తీసుకోవాల్సి ఉంది.

రెండేళ్లలో పూర్తి చేస్తం

ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం ఎస్సెల్బీ సీ సొరంగాన్ని పూర్తి చేసేందుకు చిత్తశుద్ధితో కృషి చేస్తు న్నది. సీఎం ప్రత్యేక చొరవ తీసుకొని పనులు పూర్తి చేసేందుకు రూ.2,200 కోట్లు కేటాయిం చారు. ఈ విషయంలో మంత్రి కోమటిరెడ్డి కృషి చాలా ఉంది. ఇప్పటికే అమెరి కా వెళ్లి బోరింగ్ మిషన్ యంత్రం బేరిం గ్ తెప్పించే ప్రక్రియ పూర్తి చేశారు. రెండేళ్లలో ఎస్సెల్బీసీ సొరంగాన్ని పూర్తి చేసేం దుకు సర్కారు ప్రణాళికాయుతంగా వ్యవహరిస్తోంది. 2026 నాటికి పనుల ను పూర్తి చేసి మాట నిలబెట్టుకుంటాం. 

 నేనావత్ బాలూనాయక్, 

దేవరకొండ ఎమ్మెల్యే

20 ఏండ్లుగా సాగునీళ్ల కోసం చూస్తున్నం

ఎస్సెల్బీసీ ప్రాజె క్టు పూర్తవుతుందని 20 ఏండ్లుగా ఎదురుచూస్తున్నం. పను లు సాగుతూ ఉన్నా యి తప్ప పూర్తి కావ డం లేదు. ఈ సొరంగ మార్గం పూర్తయి తే మా ప్రాంతవాసులకు తాగు, సాగునీటికి కొరత ఉండదు. దేవరకొండ నియోకవర్గానికి ఎంతోమేలు జరుగుతుంది. 

 కేతావత్ తావు, రేకులగడ్డ తండ,

చందంపేట మండలం