10-02-2025 12:56:07 AM
సీపీఎం జిల్లా కార్యదర్శి పగడాల యాదయ్య
ఎల్బీనగర్, ఫిబ్రవరి 9: కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ కు వ్యతిరేకంగా ఈ నెల 10న నిర్వహిస్తున్న నిరసన కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని సీపీఎం నాయకులు పిలుపునిచ్చారు. భారత కమ్యూనిస్టు పార్టీ (మార్క్సిస్ట్) హయత్ నగర్ సర్కిల్ జనరల్ బాడీ సమావేశాన్ని సుదర్శన్ రెడ్డి అధ్యక్షతన జరిగింది.
ఈ సమావేశంలో సీపీఎం జిల్లా కార్యదర్శి పగడాల యాదయ్య మాట్లాడుతూ.. బీజేపీ ప్రభుత్వ పనితీరుతో దేశం అప్పుల పాలవుతుం దన్నారు. ప్రతి ఏడాది రూ.12 లక్షల కోట్లు వడ్డీలకే సరిపోతుందన్నారు. బడ్జెట్ లో తెలంగాణ రాష్ట్రానికి ఎలాంటి కేటాయింపులు లేవని విమర్శించారు. ఉపాధి హామీ పథకానికి రెండున్నర లక్షలు కేటాయించాలని డిమాండ్ చేస్తుంటే రూ. 25 వేల కోట్లకు తగ్గించిందని ఆగ్రహం వ్యక్తం చేశారు.
కార్మికుల సంక్షేమానికి, ప్రజల సంక్షేమానికి ఒక్క రూపాయి కూడా కేటాయించలేదని, రైతాంగానికి గిట్టుబాటు ధరలు లేవని, గిట్టుబాటు ధరల కొరకు కేటాయింపులు లేవన్నారు. తెలంగాణ రాష్ట్రానికి వ్యతిరేకమైన కేంద్ర ప్రభుత్వ బడ్జెట్ ఉందన్నారు. కేంద్ర ప్రభుత్వం బీజేపీ అధికారంలో ఉన్నచోట విచ్చలవిడిగా ఖర్చు పెట్టి, వ్యతిరేక పార్టీలు అధికారంలో ఉన్నచోట నిధులు కేటాయించకుండా రాష్ట్రాలను తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తుందన్నారు.
‘ప్రజా వ్యతి రేకమైన బడ్జెట్‘ కి వ్యతిరేకంగా 10వ తేదీన హైదరాబాద్ లోని ఇందిరా పార్క్ లో నిర్వహిస్తున్న నిరసన ప్రదర్శనలో ప్రజలు, ప్రజాతంత్ర వాదులు, రైతులు, వ్యవసాయ కార్మికులు పాల్గొని జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో సీపీఎం హయత్ నగర్ సర్కిల్ కార్యద ర్శి కీసరి నర్సిరెడ్డి, సర్కిల్ కమిటీ సభ్యులు బి.భాస్కర్, సీహెచ్ కృష్ణయ్య, సీహెచ్ మల్లేశం, సంధ్యా కనకయ్య, శాంతి కుమార్, రాజు, శ్రీనివాస్, మూర్తి, బూసి నర్సింహ తదితరులు పాల్గొన్నారు.