13-03-2025 12:18:35 AM
108 బంగారు పుష్పాలతో అష్టదళ పాద పద్మార్చన
యాదాద్రి భువనగిరి, మార్చి 12 (విజయ క్రాంతి) ః యాదాద్రి తిరుమల స్వర్ణగిరి శ్రీ వేంకటేశ్వర స్వామి వారి దివ్య క్షేత్రంలో బుధవారం రోజు ఉదయం సుప్రభాత సేవతో మొదలుకొని రాత్రి ఏకాంత సేవ వరకు పలు కార్యక్రమాలను చేపట్టినట్లు ఆలయ వ్యవస్థాపక ధర్మకర్త మానేపల్లి రామారావు తెలిపారు.
బుధవారం సందర్భంగా స్వామివారి పాదారవిందములకు ఒక వంద ఎనిమిది బంగారు అష్టదళ పద్మ పుష్పాలతో స్వామి వారికి అష్టోత్తర శతనామాలతో అష్టదళ పాదపద్మార్చన సేవ చేయడం జరిగింది. భక్తులు శ్రీ వేంకటేశ్వర స్వామి వారిని దర్శించుకుని ఆనంద పరవశులైనారు.
ఉదయం 10:30 లకు జగదేక చక్రవర్తి అయిన శ్రీ పద్మావతి గోదాదేవి సమేత శ్రీ వేంకటేశ్వర స్వామివారికి పట్టు పీతాంబరాలు ధరింపజేసి నవరత్న ఖచిత స్వర్ణాభరణాలతో , పరిమళ భరిత పుష్ప మాలలతో అలంకరించి శ్రీ స్వామివారి నిత్య కళ్యాణ మహోత్సవాన్ని ఆలయ ప్రధాన అర్చకులు దిట్టకవి శ్రవణాచార్యులు దివ్యకరములచే అంగరంగ వైభవంగా నిర్వహిం చారు.
భక్తులు శ్రీవారి కల్యాణ మహోత్సవాన్ని చూసి ఆహా ఏమి ఈ భాగ్యము శ్రీనివాసుడి నిత్య కళ్యాణ మహోత్సవం చూసిన కనులు పండుగ చూడని కనులు దండగ అంటూ కొనియాడారు. స్వర్ణగిరి శ్రీ వేంకటేశ్వర స్వామి వారిని మాడవీధులలో శోభాయ మానంగా ఊరేగిస్తూ తిరువీధి ఉత్సవ సేవను ఘనంగా నిర్వహించారు.
దేదీప్యమానంగా వెలుగుతున్న సహస్రదీప కాంతుల మధ్య స్వామివారు ఊయలలో ఆసీనులై భక్తులకు దర్శనమివగా భక్తులు నయన మనోహరంగా శ్రీవారిని దర్శించి ఆనంద పరవశులైనారు. పలువురు ప్రముఖులు దర్శించుకున్నట్లు ఆలయ వ్యవస్థాపక ధర్మకర్త మానేపల్లి రామారావు చైర్మన్లు మానేపల్లి మురళీకృష్ణ గోపికృష్ణ తెలిపారు.