29-03-2025 02:35:57 AM
ఇబ్బందుల్లో పలుగ్రామాల రైతులు
పట్టించుకోని విద్యుత్ అధికారులు
నల్లగొండ, మార్చి 23 (విజయక్రాంతి) : ఆరుగాలం కష్టించి పంట చేతికి వచ్చే సమయానికి రైతులు విద్యుత్ సమస్యతో కుదేలవుతున్నారు. నల్లగొండ జిల్లా తిప్పర్తి మండలం మామిడాల సబ్ స్టేష్ప లోడ్ అధికం కావడంతో లోఓల్టేజీ సమస్య తలెత్తి బోరుబావులకు నాణ్యమైన విద్యుత్ సరఫరా కావడం లేదు.
తిప్పర్తి మండలంలో ఈ యాసంగి 28,366 ఎకరాల్లో రైతులు వరి సాగు చేశారు. ఫిబ్రవరి చివర వరకు సమృద్ధిగా బోర్లు పోసి పంటలకు పుష్కలంగా నీరందింది. గత 20 రోజులుగా బోరుబావుల్లో నీటిమట్టం తగ్గింది. దీనికి తోడు విద్యుత్ లోఓల్టేజీ తోడైందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మామిడాల విద్యుత్ సబ్ స్టేషన్ నుంచి ఎల్లమ్మగూడెం, గోదోరిగూడెం, మామిడాల, యాపలగూడెం గ్రామాలకు విద్యుత్ సరఫరా అవుతుంది.
ఆయా గ్రామాల్లో గతేడాది కంటే బోరుబావులు అధికం కావడం, విద్యుత్ కనెక్షన్ల సంఖ్యా పెరగడంతో లోఓల్టేజీ సమస్య తలెత్తున్నట్లు తెలిసింది. వ్యవసాయ విద్యుత్ కనెక్టన్లు పెరిగిన కొద్ది సమస్య మరింత జఠిలమవుతుందని రైతులు చెబుతున్నారు. లోఓల్టేజ్ సమస్య కారణంగా కొన్నిరోజులుగా గంటల కొద్దీ విద్యుత్ సరఫరా నిలిపివేస్తున్నట్లు రైతులు ఆరోపిస్తున్నారు. ఈ కారణం వంద ఎకరాల్లో పొలాలు ఎండిపోయాయని, బోరుమోటార్లు కాలిపోతున్నాయని చెబుతున్నారు.
అధికారుల నిర్లక్ష్యం..
విద్యుత్ సమస్యలతో తాము ఇబ్బందిపడుతుంటే అధికారులు పట్టించుకోవడం లేదని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తిప్పర్తి విద్యుత్ ఏఈ రమ్య మూడు నెలల క్రితం బదిలీ అయ్యారు. నాటి నుంచి కనగల్ ఏఈ కుమార్ అదనపు బాధ్యతలు చూస్తున్నారు. మామిడాల సబ్ స్టేషన్ నుంచి ఐదు గ్రామాల బోరుబావులకు, 12 గ్రామాలకు విద్యుత్ సరఫరా అవుతుంది. గాలిదుమారం, ఇతరాత్ర కారణాలతో విద్యుత్ వైర్లు తెగినా, విద్యుత్ లైన్లు ట్రిప్పయినా వెంటనే పునరుద్ధరించేందుకు ఏఈ లేకపోవడంతో ఇబ్బందులు తలెత్తుతున్నాయి.