21-04-2025 02:06:11 AM
“ఇది చదివిన పిమ్మట మరి
యేదియును చదువబుద్ధి యేలా పొడమున్
పదపడి గ్రంథములన్నియు
వెదకి వెదకి సారమెల్ల వివరింపంగన్”
అని తన ఛందోగ్రంథమైన ‘అప్పకవీయం’ ఘనతను, తన పరిశోధనా పటిమను తెలియజేస్తూ అప్పకవియే స్వయంగా రాసుకున్నారు. ఈ పద్యం ద్వారా ఈ ఛందోగ్రంథం ఎంత విశిష్టమైందో తెలుస్తున్నది. ఏది చదివితే మరో గ్రంథం చదవనవస రం లేదో, అదే ‘అప్పకవీయ’ గ్రంథం అనడంలో అనేక గ్రంథాలను చదవడం వల్ల కలిగే జ్ఞానం దీనివల్ల లభిస్తుందన్న భావన ద్యోతకమవుతుంది. అంటే, ఇందులో లక్షణాలకు ఇచ్చిన వివిధ లక్ష్యా లు అన్నీ అనేక ప్రసిద్ధ గ్రంథాల్లోని పద్యాలే కావ డం, దానివల్ల ఆయా గ్రంథాలను ఆసాంతం చదువాలన్న ఆసక్తి కలగడం వంటి అనేకాంశాలను ఈ పద్యం మనకు బోధిస్తుంది.
అంతేగాక, ‘వెదకి వెద కి’ అన్న శబ్దాల వల్ల అప్పకవి తాను చెప్పిన లక్షణాలకు అవసరమైన లక్ష్యాల కోసం ఎన్నెన్నో ప్రాచీన గ్రంథాలను అన్వేషించడమే గాక అనేక చాటుపద్యాలను కూడా ఉటంకించారు. దీనివల్ల మనకు చాటు పద్యాల్లోని ప్రత్యేకతలు సైతం అవగాహనలోకి వస్తాయి. ఇది కవి ప్రతిభకు తోడైన వ్యుత్పత్తి కూడా ఎంతటిదో తెలుస్తున్నది. చెప్పింది లక్షణ శాస్త్రం, అదీ నన్నయ ‘ఆంధ్రశబ్ద చింతామణి’కి వ్యాఖ్యాన గ్రంథం. కాని, దాన్ని పటిష్ఠమైన ఛందశ్శాస్త్రంగా తీర్చిది ద్దిన ఘనుడు అప్పకవి.
పూర్వీకులు మహాపండితులు
నాటి మహబూబ్‌నగర్ జిల్లా, నేటి నాగర్‌కర్నూలు జిల్లా ప్రాంతా న్ని ఒకనాడు ‘చరిగొండ సీమ’గా పిలిచేవారు. ఈ సీమకు చెందిన కాకునూరు అగ్రహారానికి అతిసమీపంలో వున్న లేమామిడి గ్రామమే అప్పకవి జన్మస్థలం. ‘అప్పకవీయం’లోని కృత్యాది ననురించి ‘క’ అనే అక్షరానికి నూరు అర్థాలు చెప్పడం ద్వారా ఈ అప్పకవి పూర్వుడు ఒకాయన అనేక ప్రశంసలను అందుకున్నా డు. ఈ కారణంగా ఈ ఊరు కాకునూరు అయినట్లు తెలుస్తున్నది. దీనినిబట్టే అప్పకవి పూర్వులందరూ మహాపండితులని అర్థమవుతున్నది.
అంటే, అప్పకవిది పండిత వారసత్వమన్న మాట. అప్పకవి తం డ్రి అయిన వెంగనార్యునికి ‘మాఱుటబ్రహ్మ’ అన్న ప్రశస్తి ఉండేది. మహాపండితుడు వెంగనార్యుడు, శేషమ్మ దంపతులకు జన్మించిన అప్పకవి గొప్ప పండితుడై, అనేక శాస్త్రగ్రంథాల అధ్యయన తత్పరుడై పలు రచనలు చేసినట్లు తెలుస్తున్నది. ఆయన ముత్తాత కాకు నూరి తిమ్మకవి (1500 ప్రాంతం) ‘కాలార్ణవం’ అనే జ్యోతిషశాస్త్ర గ్రంథకర్త. ఇటువంటి వారసత్వమే కలిగిన అప్పకవి కూడా ‘సాధ్వీజన ధర్మం’ (ద్విపద), ‘కవి కల్పకము’ (లక్షణ గ్రంథం), సంస్కృతంలో ‘ఆపస్తంబ సూత్ర షట్కర్మ నిబంధనమ్’, ‘అనంత వ్రతకల్పము’, శ్రీశైల మల్లికార్జునుని పేరుతో ఒక ‘శ్లేషగర్భిత శతకాన్ని’ రచించాడు.
ప్రజ ల అభీష్టానికి అనుగుణంగా ‘అంబికా వాదము’ అనే యక్షగానం కూడా ఆయన రచించినట్లు తెలుస్తున్నది. ఆయనకున్న విశేష ప్రతిభకు తోడైన వారి పూర్వుల ప్రతిభా వారసత్వం కూడా ఇన్ని రచనలు వెలువడడానికి దోహద పడ్డాయి. కాని, ఆయన ‘అప్పకవీయము’ మాత్రమే నేడు లభ్యమవుతున్నది. మిగిలిన అన్ని రచనలూ అలభ్యాలే. ‘అప్పకవీ యం’లోని అవతారికవల్ల తెలిసే విషయాలనుబట్టి ఆయన వ్యక్తిగత విషయాలు, రచనా విశేషాలు వెల్లడవుతున్నాయి.
మదనగోపాలునికే అంకితం
అప్పకవి తాత అయిన సోమన (రెండవ), ‘వట్టెం’ గ్రామ వాస్తవ్యులైన పోతన కూతురిని వివా హం చేసుకున్నాడు. ఈ గ్రామం మహబూబ్‌నగర్ జిల్లాలోని సుప్రసిద్ధ వెంకటేశ్వర క్షేత్రాలలో ఒకటి. ఈయన గొప్ప దాతృత్వం కలిగిన వ్యక్తిగా, ప్రజోపయోగ కార్యక్రమాలు చేసిన వానిగా కూడా తెలు స్తున్నది. అప్పకవి కలలో కామేపల్లిలోని చక్రపాణి (విష్ణువు) కనిపించినట్లు, ఆ మదన గోపాలునికే తన ‘అప్పకవీయాన్ని’ అంకితం ఇస్తున్నట్టు గా చెప్పుకున్నాడు.
ఈ కామేపల్లినిబట్టి అప్పకవి జన్మస్థలం విషయంలో కొందరు చరిత్రకారులు కొంత పొరపాటు పడినట్లు తెలుస్తున్నది. ఈ గ్రామం గురజాలకు సం బంధించిన కామేపల్లిగా భావించి, అప్పకవి జన్మస్థలం విషయంలో తమ అభిప్రాయాలను వారు వెలువరించారు. కాని సుప్రసిద్ధ పరిశోధ కులు, చరిత్రకారులు, కవులు, పండితులు అయిన కీ.శే. కపిలవాయి లింగమూర్తి తమ పాలమూరు జిల్లా కు సంబంధించిన పరిశోధనలో, ఈ కామేపల్లి నాగర్‌కర్నూలు తాలూ కా దేవరకొండకు 20 మైళ్ల దూరంలో ఉందని, అక్కడొక వేణుగోపాలస్వామి గుడి ఉన్నట్లు’ ప్రమాణాలతో నిరూపించారు.
అంతేగాక, మహమ్మదీయుల దాడికి గురై ఆ ఆలయం విధ్వంసానికి లోనైనప్పుడు, అక్కడి స్థానికులు కల్వకుర్తి తాలూకా చుక్కాపురానికి తరలించిన విషయాన్ని కూడా వారు తమ పరిశోధనలో తేలినట్లు పేర్కొన్నారు. సాహిత్య చరిత్రకారులు, ‘సమగ్ర తెలుగు సాహిత్య చరిత్ర’ గ్రంథకర్త ఆచార్య ఎస్.వి.రామారావు సైతం ఈ విషయాన్ని వెల్లడించారు. దీనివల్ల నాటివరకు సందిగ్ధంలో ఉండిన కామేపల్లి విషయం నిర్ధారణైంది. ఆచార్య రామారావు ఈ గ్రామం అప్పకవి మేనమామలకు చెందిన ఊరు అయి ఉంటుందని కూడా పేర్కొన్నారు.
ఎనిమిది ఆశ్వాసాల ఉద్గ్రంథం
అప్పకవికి ఒక ప్రత్యేక లక్షణ గ్రంథం రాయడానికి అవసరమైన పాండిత్యం ఈ గ్రంథం (అప్పకవీ యం) ప్రారంభించే నాటికే ఉందన్న విషయాన్ని ‘సమగ్రాంధ్ర సాహిత్య’ కర్త, ప్రముఖ పరిశోధకులు ఆరుద్ర పేర్కొంటూ, “అతడు 42 లక్షణ గ్రంథాల ను కూలంకషంగా పరిశీలించాడు. 73 తెలుగు కావ్యాలను ఆమూలాగ్రం శోధించాడు. 315 పద్యాలలోని విలక్షణ ప్రయోగాలను గుర్తించి జ్ఞాపకం పెట్టుకున్నాడు. ఇవి కాక 23 కవుల చాటు పద్యాలలోని విశేషాలను గమనించాడు.
అప్పటికే ‘కవి కల్ప కమ’నే లక్షణ గ్రంథాన్ని వ్రాశాడు” అంటూ అప్పకవి వైదుష్యానికి ఎంతటి భూమిక ఉన్నదో స్పష్టం గా పేర్కొన్నారు. కాబట్టి, నన్నయ ‘ఆంధ్రశబ్ద చింతామణి’ని తెలుగువారికి చక్కని వ్యాఖ్యతో అందిం చాలని అప్పకవి సంకల్పించాడు. అప్పటికే బాలసరస్వతి రచించిన టీకను ఆధారం చేసుకుని ఆయన ఈ రచన చేసినట్లు సాహిత్య చరిత్రకారులు పేర్కొన్నారు. ‘ఆంధ్రశబ్ద చింతామణి’లో ‘సంజ్ఞ, సంధి, తత్సమ, దేశ్య, క్రియా’ పరిచ్ఛేదాలు ఉన్నాయి.
ఈ అయిదు పరిచ్ఛేదాలనే అప్పకవి విస్తరించి ‘భాషా పరిచ్ఛేదం’, ‘వర్ణ పరిచ్ఛేదం’, ‘దేశ్య పరిచ్ఛేదం’, ‘క్రియా పరిచ్ఛేదం’ అనే పేర్లు పెట్టుకుని, ఎనిమిది ఆశ్వాసాల గ్రంథంగా రచించాడు. 82 ఆర్యల (ఛం దో విశేషం)లో ఉన్నదాన్ని ఈ ఎనిమిది ఆశ్వాసాల్లోనే తెలుగులో రచించాడు. అనువదించిన ఈ ఎనిమిదింటిలో ‘వళిపద్య, సంధి, తత్సమా’లను కూడా కలిపి చేసిన వాటిలో మనకు కేవలం ‘తత్సమ, దేశ్య క్రియా పరిచ్ఛేదలు’ అందుబాటులో లేవు. ప్రముఖ విమర్శకులు డా. శ్రీరంగాచార్య అన్నట్లు ‘నష్టభాగ కృతిలో యివి గలవేమో’ అని భావించాలి.
నన్నయ వ్యాకరణ వ్యాఖ్యాన గ్రంథంగా ‘అప్పకవీయం’
‘అప్పకవీయ’ గ్రంథాన్ని క్రీ.శ. 1600లో రచించినట్లు ఆయనే స్వయంగా పేర్కొన్నాడు. ఇది నన్న య ‘ఆంధ్రశబ్ద చింతామణి’ వ్యాకరణ గ్రంథమే అయినా, అప్పకవి అనువాదానికి ‘ఛందోగ్రంథమ’ని పేరు రావడానికి కూడా డా. శ్రీరంగాచార్య మూలగ్రంథంలోని ఒక ‘ఆర్య’ తెనుగు వివరణతో 300 పద్యాలు కావడం, ‘ఆద్యోవళిః’ అనే సూత్ర వివరణ 398 పద్యాల్లో ఉన్న కారణంగా ఇదొక ఛం దశ్శాస్త్రంగా గుర్తింపు పొంది ఉండవచ్చునని కూడా ఆయన అభిప్రాయపడ్డారు.
ఇంతటి పరిశ్రమ చేసి న అప్పకవి తనకన్నా పూర్వం ఉన్న దాదాపు 43 లక్షణ గ్రంథాలను పరిశీలించినట్లు ‘అప్పకవీయాన్ని’బట్టి మనం గుర్తించవచ్చునని అంటూ, ఆరుద్ర ఆ లక్షణ గ్రంథాలను పేర్కొన్నారు. మూడు, నాలు గు ఆశ్వాసాలలో (వళి, ప్రాస, పద్య) ఛందో సంబంధిత అంశాలే అధికంగా ఉన్నాయి. యతి, ప్రాసల వివేచనను ప్రామాణికంగా, అనేక కావ్యాల్లోని ప్రయోగాల ప్రమాణంతో అప్పకవి రచించాడు. కనుక, దీనిని ఛందోగ్రంథంగానే సాహితీవేత్తలు భావించారు. పద్య గద్యాత్మకమైన ‘అప్పకవీయం’లోని వచన భాగాల్లో కొన్నిచోట్ల వ్యావహారిక భాషకూడా చోటు చేసుకోవడం విశేషం.
ఒక లక్షణ గ్రంథకర్తకు తనకన్నా పూర్వం ఉన్న కావ్యాలతో, లక్షణ గ్రంథాలతో అధిక పరిచయం ఉండాలన్నది అప్పకవి భావన. దాన్నే ఈ విధంగా
“ఒక దానికంటే వే
రొకటి విశేషంబు చెప్పుచుండు కతమునన్
సకల గ్రంథములను చదు
వక తెలియునె లక్షణ ప్రపంచం బెల్లన్”
అని స్పష్టంగా పేర్కొన్నారు. దీన్నిబట్టి, లక్షణ గ్రంథకర్తకు అధ్యయన తత్తం ఉండాలని, తద్వారా అతనికి విస్తృత విషయ జ్ఞానం వస్తుందని నమ్మిన వాడు అప్పకవి. ఆ మార్గంలోనే సాగిన అప్పకవి అధ్యయన శీలత ఎంతటిదో తెలియజెప్పే గ్రంథం ఈ ‘అప్పకవీయం’.
ఎంత పాండిత్యమో
అంత వినయసంపద
నేటికీ పఠన పాఠనాల్లో ఉన్న గ్రంథాన్ని రచించిన అప్పకవి వంటి గొప్ప ప్రతిభావంతుడు కూడా అత్యంత వినయంగా
“కాళిదాస మయూరాది కవులకైన
గలవు తప్పులనంగ నన్యులకు లేవె
దిద్దనగు పట్ల దిద్దుడు, దిద్దరాని
యెడల నా నేరములు క్షమియించుటొప్పు”
అని చెప్పుకున్న వినయశీలి. అప్రతిమాన ప్రతిభా సముద్భాసియైన అప్పకవి సాహితీప్రియుల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయే గొప్ప లాక్షణికుడు అనడంలో ఏ అతిశయోక్తీ లేదు.
-గన్నమరాజు గిరిజా మనోహరబాబు , 9949013448