రోడ్లు భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి
నల్లగొండ, జనవరి 5 (విజయక్రాంతి): గర్భిణుల సౌకర్యార్థం నిర్మించ తలపెట్టిన ఏఎన్సీ(ఆంటినాటల్ కేర్) భవనాన్ని త్వరగా పూర్తి చేయాలని రోడ్లు, భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి అన్నారు. నల్లగొండ ప్రభుత్వ దవాఖాన ఆవరణలో భవన నిర్మాణానికి ఆదివారం ఆయన భూమి పూజ చేసి, మీడియాతో మాట్లాడారు. గర్భిణులకు పరీక్షలు, ప్రసవాల కోసం వచ్చే వారితోపాటు సహాయకుల సౌకర్యార్థం అన్ని వసతులతో భవనాన్ని నిర్మిస్తున్నట్లు తెలిపారు.
పనులను నాణ్యతా ప్రమాణాలతో సాధ్యమైనంత త్వరగా పూర్తి చేయాలని కాంట్రాక్టర్‌ను ఆదేశించారు. అనంతరం ఎంసీహెచ్‌లో వార్డులను మంత్రి పరిశీలించారు. పోస్ట్ నాటల్ వార్డు ఏర్పాటుకు చర్యలు తీసుకోవాలని వైద్య ఆరోగ్యశాఖ అధికారులకు సూచించారు. దవాఖానలో పలువురు వైద్యులు, స్టాఫ్ నర్సులు, సిబ్బంది ఇతర ప్రాంతాల్లో డిప్యూటేషన్‌పై పనిచేస్తున్నట్లు మంత్రి దృష్టికి రావడంతో దవాఖానలోనే పనిచేసేలా చర్యలు తీసుకోవాలని ఉన్నతాధికారులకు సూచించారు.
త్వరలో గైనిక్, జనరల్ సర్జన్, స్టాఫ్ నర్సులను నియమించునున్నట్లు తెలిపారు. రోగులకు మెరుగైన సేవలందించే వైద్యులను గుర్తించి ప్రతి నెలా రూ.15 వేలు ప్రోత్సాహం ఇవ్వనున్నట్లు గతంలోనే ప్రకటించామని కలెక్టర్ ఇలా త్రిపాఠి గుర్తు చేశారు. అనంతరం ఐటీఐ కళాశాల ఆవరణలో నిర్మాణంలో ఉన్న ఐటీసీ కేంద్రాన్ని మంత్రి పరిశీలించారు.
అంతకుముందు రోడ్డు భద్రతా మాసోత్సవాల సందర్భంగా చిట్యాల మండలం వట్టిమర్తి శివారులోని పంజాబీ దాబాలో డ్రైవర్లకు కంటి పరీక్షలు నిర్వహించేందుకు ఏర్పాటు చేసిన ప్రత్యేక కేంద్రాన్ని నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశంతో కలిసి మంత్రి ప్రారంభించారు.
కార్యక్రమంలో కలెక్టర్ ఇలా త్రిపాఠి, ఎస్పీ శరత్‌చంద్ర పవార్, డీఎంహెచ్‌వో పుట్ట శ్రీనివాస్, డిప్యూటీ డీఎంహెచ్‌వో వేణుగోపాల్, నల్లగొండ మున్సిపల్ చైర్మన్ బుర్రి శ్రీనివాస్‌రెడ్డి, కాంగ్రెస్ పార్టీ నల్లగొండ పట్టణాధ్యక్షుడు గుమ్ముల మోహన్‌రెడ్డి పాల్గొన్నారు.