calender_icon.png 7 January, 2025 | 3:27 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కుంభమేళా వెనుక అబ్బురపరిచే సైన్స్

04-01-2025 01:30:44 AM

* గ్రహాల అమరికల్లో తేడా వల్ల భూ విద్యుదయస్కాంత క్షేత్రం ప్రభావితం

* జీవ వ్యవస్థల్లోనూ మార్పులు

న్యూఢిల్లీ, జనవరి 3: ప్రపంచంలోనే అతిపెద్దదైన ఆధ్యాత్మిక పండగ మహాకుంభ మేళా జనవరి 13 నుంచి ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్‌లో ప్రారంభం కాబోతోంది. ఈ సందర్భంగా ప్రపంచ వ్యాప్తంగా కోట్లాది మంది భక్తులు మహాకుంభమేళాలో పాల్గొ ని పుణ్యస్నానాలు ఆచరిస్తారు.

కుంభమేళా లో పాల్గొన్న చాలా మంది భక్తుల్లో పుణ్యస్నానాలు ఆచరించిన తర్వాత ప్రశాంతత చేకూరిందని, ఆరోగ్య పరంగా బాగా ఉన్నామనే భావనను వ్యక్తం చేస్తుంటారు. దీనికి ఆధ్యాత్మిక కారణాలతోపాటు శాస్త్రీయ కారణాలూ ఉన్నాయి. 

పురాణాల ప్రకారం..

కుంభమేళాకు క్షీరసాగర మథనం సమయంలో బీజాలు పడ్డాయి. ఓ వైపు దేవత లు, మరోవైపు రాక్షసులు ఉండి పాల సముద్రాన్ని చిలుకుతుండగా కల్పతరువు, ఆక్షయపాత్ర వంటి వాటితో పాటు అమృతం కూడా బయటకు వచ్చిందని పురాణాలు చెబుతున్నాయి.

అలా క్షీరసాగర మథనం సమయంలో బయటకు వచ్చిన అమృతంలోని నాలుగు చుక్కలు భూమిపై నాలుగు వేరు వేరు ప్రదేశాల్లో పడ్డాయట. అమృతం చుక్కలు పడిన ప్రాంతాల్లోనే నిర్ధిష్ట సమయాల్లో కుంభమేళాలు జరుగుతున్నాయి.

పురాణాల ప్రకారం భారతదేశంలోని హరిద్వార్, ఉజ్జయినీ, నాసిక్, ప్రయాగ్‌రాజ్ ప్రాంతాల్లో క్షీరసాగర మథనం సమయంలో అమృతం చుక్కలు పడినట్టు తెలుస్తుంది. గ్రహశాస్త్ర లెక్కల ప్రకారం హరిద్వార్, ఉజ్జయినీ, నాసిక్ ప్రాంతాల్లో నాలుగేళ్లకు కుంభమేళా జరుగుతుండగా, ప్రయాగ్‌రాజ్‌లో 12ఏళ్లకు ఒకసారి కుంభమేళాను నిర్వహిస్తున్నారు.

ఈ సందర్భంగా ఆయా ప్రాంతాల్లో పుణ్య నదీ స్నానాలు ఆచరించడం ద్వారా విముక్తి లభిస్తుందని ప్రజలు గట్టిగా నమ్ముతారు. అలాగే పుణ్యస్నానాల తర్వాత మనసుకు ప్రశాంతత చేకూరినట్టు కూడా పేర్కొంటారు. 

సైన్స్ ఏం చెబుతుందంటే..

సౌర వ్యవస్థలో గ్రహాలు నిర్ధిష్ట కక్ష్యల్లో ప్రతి క్షణం కదులుతూనే ఉంటాయి. ఇతర గ్రహాల కదలికల వల్ల నిర్ధిష్ట సమయాల్లో భూమి విద్యుదయస్కాంత క్షేత్రాలు ప్రభావితమవుతుంటాయి. అవి భూమి మీద నివసించే ప్రాణుల జీవ వ్యవస్థను ప్రభావితం చేస్తాయని పలు పరిశోధనలు చెబుతు న్నాయి.

కక్ష్య పరిమాణం కారణంగా బృహస్పతి(గురుగ్రహం) దాదాపు 12ఏళ్లకు ఒకసా రి సూర్యుడి చుట్టూ తన పరిభ్రమణాన్ని పూర్తి చేస్తుంది. సూర్యుడు, చంద్రుడి స్థానాలకు అనుగుణంగా బృహస్పతి ఒక నిర్ధిష్ట అమరికలోకి ప్రవేశించినప్పుడు మహాకుంభమేళా జరుగుతుంది.

ఈ అమరిక వల్ల భూమిపై కొన్ని ప్రత్యేక ప్రదేశాల్లో భూ విద్యుదయస్కాంత క్షేత్ర తీవ్రత అధికంగా ఉంటుంది. ముఖ్యంగా నదీ సంగమ ప్రదేశాల్లో భూ అయస్కాంత క్షేత్రాల బలం అధి కంగా ఉంటుందని అధ్యాయనాలు చెబుతున్నాయి.

భూ అయస్కాంత క్షేత్రాలు బలంగా ఉన్న ప్రాంతాలను సందర్శించడం ద్వారా మానసిక ప్రశాంత చేకూరి, ఆరోగ్యంగా ఉన్న భావన కలుగుతుందని పలుపరిశోధనల్లో వెల్లడైంది. కుంభమేళాల స్థలాల ఎంపిక ద్వారా భౌగోళికశాస్త్రం, భూ అయస్కాంత శక్తులపై మన దేశంలోని రుషులకు గట్టి పట్టుందనే విషయం అర్థమవుతుంది. 

వాతావరణశాఖ ప్రత్యేక పేజీ

ప్రయాగ్‌రాజ్ మహాకుంభమేళాకు సిద్ధం అవుతున్న తరుణంలో ఉత్తర భారతదేశంలో ఉష్ణోగ్రతలు దారుణంగా పడిపోయి మంచు దట్టంగా కురుస్తోంది. ప్రయాగ్‌రాజ్‌లో కూడా ఇదే పరిస్థితి. దీంతో కుంభమేళాలో పాల్గొనే భక్తుల సౌకర్యార్థం వాతావరణ శాఖ కీలక నిర్ణయం తీసుకుంది.

ప్రయాగ్‌రాజ్‌ను సందర్శించే భక్తులు అక్కడి వాతావరణం తెలుసుకునేందుకు వాతావరణ శాఖ వెబ్‌సైట్‌లో ప్రత్యేక పేజీని సిద్ధం చేసింది. ఈ విషయాన్ని ఐఎండీ డైరెక్టర్ మనీశ్ రణాల్కర్ ఓ ప్రకటనలో తెలిపారు. ప్రత్యేక పేజీ ద్వారా ప్రతి 15 నిమిషాలకు ఒకసారి వాతావరణంలో వచ్చే మార్పులను తెలుసుకోవచ్చని ఆయన పేర్కొన్నారు.

రోజుకు రెండుసార్లు వాతావరణ సూచనలను అందులో పొందుపర్చనున్నట్టు తెలిపారు. కాగా ఈసారి మహాకుంభమేళాలో సుమారు 40కోట్ల మంది భక్తులు పాల్గొంటారని ప్రభుత్వం అంచనా వేస్తుంది.