calender_icon.png 20 September, 2024 | 11:21 AM

ఉద్యోగ కల్పనే ‘ఎంఎస్‌ఎంఈ పాలసీ’ లక్ష్యం

19-09-2024 02:41:23 AM

ఎంఎస్‌ఎంఈలపై క్యాపిటల్ భారం పడకుండా చర్యలు

హైదరాబాద్‌ను ఏఐ హబ్‌గా మార్చబోతున్నాం

ఎగుమతులను ప్రోత్సహించేందుకు విదేశీ కన్సల్టెంట్లతో ఒప్పందం 

ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ రాబు

హైదరాబాద్, సెప్టెంబర్ 18(విజయక్రాంతి): రాష్ట్రంలో ఉద్యోగ కల్పనే ప్రధాన లక్ష్యంగా ఎంఎస్‌ఎంఈ పాలసీని తీసుకొచ్చినట్లు ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ రాబు తెలిపారు. బుధవారం ఎంఎస్‌ఎంఈ పాలసీపై సీసీఐ విభాగం నిర్వహించిన సమావేశంలో శ్రీధర్ బాబు పాల్గొన్నారు. ఈ సందర్భంగా పాలసీ ఉద్దేశాన్ని వివరించారు. ప్రభుత్వం సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమలను ప్రోత్సహించడానికి కట్టుబడి ఉందని తెలిపారు.

ఎంఎస్‌ఎం ఈలు బ్యాంకు లోన్లకు కూడా ఇబ్బంది పడకుండా ఉండేందుకు ఈ పాలసీని తీసుకొచ్చి నట్లు వెల్లడించారు. అదేవిధంగా కేంద్రం ఎంఎస్‌ఎంఈలకు రూ.5కోట్ల గ్యారంటీలను ఇచ్చే స్కీమ్‌ను తీసుకొస్తుందని పేర్కొన్నారు. ఇది అమల్లోకి వస్తే ఎంఎస్‌ఎంఈలకు క్యాపిటల్ సమస్యలు తీరుతాయని వివరించారు. ఎంఎస్‌ఎంఈలకు భూమి సమస్యగా మారిందని, అందుకే తాము ల్యాండ్ లీజు పద్ధతిని తీసుకొచ్చామని తెలిపారు.

దేశంలోని అన్ని రాష్ట్రాలు ఏఐ టెక్నాలజీని స్వీకరిస్తున్నాయని, టెక్నాలజీని లీడ్ చేసేందుకే హైదరాబాద్‌లో ఏఐ సీటీని ఏర్పాటు చేస్తున్నట్లు వెల్లడించారు. కొత్త టాలెంట్‌ను ప్రోత్సహించడానికి, టెక్నాలజీని సులభంగా యాక్సెస్ చేయడానికి హైదరాబాద్‌ను ఏఐ హబ్‌గా మార్చబోతున్నామని చెప్పారు. అలాగే ఏఐ హబ్‌లను ప్రారంభించాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు వివరించారు. 

స్కిల్ వర్సిటీని పరిశ్రమలే నడిపిస్తాయ్

పరిశ్రమల అవసరాలను తీర్చడానికి స్కిల్ యూనివర్సిటీని పూర్తిస్థాయిలో వినియోగించుకోనున్నట్లు మంత్రి చెప్పారు. యూనివర్సిటీలో మూడు పద్ధతుల్లో అన్‌స్కిల్డ్, సెమీ-స్కిల్డ్, స్కిల్డ్ పద్ధతుల్లో బోధన ఉంటుందన్నారు. స్కిల్ యూనివర్సిటీని పరిశ్రమలే నడిపిస్తాయని, అయితే దానికి ప్రభుత్వ సహకారం కూడా ఉంటుందని చెప్పారు. టెక్నాలజీని ప్రోత్సహించేందుకు యంత్రం నిధికి ప్రభుత్వం రూ.100కోట్లను కేటాయిస్తుందన్నారు. ఎంఎస్‌ఎంఈలకు ఎగుమతుల అంశం చాలా వ్యయ ప్రయాసాలతో కూడుకున్నదని ఆయన గుర్తు చేశారు.

అందుకే ఎంఎస్‌ఎంఈలకు ఎగుమతుల విషయంలో మద్దతు అందించేందుకు విదేశీ కన్సల్టెంట్లను నియమించుకోనున్నట్లు తెలిపారు. ఇది రాష్ర్ట ఆర్థిక వ్యవస్థపై సానుకూల ప్రభావాన్ని చూపుతుందన్నారు. కొత్త ఉద్యోగ అవకాశాలను సృష్టిస్తోందన్నారు. ఈ ప్రాంతంలో కార్గో హ్యాండ్లింగ్, లాజిస్టిక్స్ రంగాల్లో వాణిజ్యాన్ని సులభతరం చేయడానికి, తెలంగాణ ప్రభుత్వం రెండు డ్రై పోర్ట్‌ల ను ఏర్పాటు చేసే ప్రణాళికను ప్రారంభించిందన్నారు. పారిశ్రామిక రాయితీలను దశల వారీగా క్లియర్ చేసే ప్రణాళికలను రూపొందిస్తున్నామన్నారు.

ఇదిలా ఉండగా.. పరిశ్రమలు, వాణిజ్యం, డైరెక్టర్ డాక్టర్ జి.మల్సూర్ మాట్లాడుతూ తెలంగాణ ప్రభుత్వం,  ఎన్‌ఎస్‌ఐసీ (నేషనల్ స్మాల్ ఇండస్ట్రీస్ కార్పొరేషన్) అవగాహన ఒప్పందం (ఎంఓయు)పై సంతకాలు చేశాయన్నారు. తెలంగాణలో వ్యవస్థాపకత, ఆర్థికాభివృద్ధిని ప్రోత్సహించడమే ఈ ఎం ఓయూ లక్ష్యమని చెప్పారు. కార్యక్రమంలో సీఐఐ తెలంగాణ చైర్మన్ సాయి డి.ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.