మునగాల: విద్యారంగ సమస్యల పరిష్కారం కోసం ప్రభుత్వవిద్యాసంస్థల బలోపేతం కోసం అటు శాసనమండలిలో, బయట శక్తి వంచన లేకుండా కృషి చేస్తున్నానని ఉపాధ్యాయ ఎమ్మెల్సీ అలుగుబెల్లి నర్సిరెడ్డి అన్నారు. 2025 మార్చి నెలలో నల్లగొండ ఖమ్మం వరంగల్ శాసనమండలి ఉపాధ్యాయ నియోజకవర్గానికి ఎన్నికలు నిర్వహిస్తున్న నేపథ్యంలో వారు మంగళవారం మండల కేంద్రంలోని స్థానిక ఆదర్శ పాఠశాల, జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఉపాధ్యాయులతో నిర్వహించిన సమావేశంలో వారు మాట్లాడుతూ.. గత ఆరు సంవత్సరాలుగా ఉపాధ్యాయ శాసనమండలి సభ్యుడిగా ప్రభుత్వ విద్యారంగాన్ని బలోపేతం చేసేందుకు తన వంతు పాత్రని పోషించానని, దీనిలో భాగంగా రాష్ట్రవ్యాప్తంగా ప్రభుత్వ పాఠశాలల, గురుకుల మోడల్ స్కూల్ ఉపాధ్యాయ బదిలీలు విషయంలో న్యాయపోరాటాన్ని సైతం నిర్వహించి ప్రభుత్వాన్ని ఒప్పించి బదిలీల సమస్యను పరిష్కరించడం జరిగిందని వారు తెలిపారు.
తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంలో మొదటి పిఆర్ సి ని కాంట్రాక్ట్ ఔట్సోర్సింగ్ ఉద్యోగులు కూడా వర్తింపజేయడంలో, 180 రోజుల పరిస్థితి సెలవులు సాధించడంలో, కస్తూర్బా గాంధీ పాఠశాల యుఆర్ఎస్ లలో పనిచేసిన ఉపాధ్యాయ ఉద్యోగులకు వేసవి సెలవులతో సహా 12 నెలల జీతం వచ్చేలా తాను శాసనమండలి వేదికగా పోరాటం చేశానని వారు తెలిపారు. అదేవిధంగా ఉపాధ్యాయ ఉద్యోగ ఐక్యవేదికల ఆధ్వర్యంలో రాష్ట్రవ్యాప్తంగా చేపట్టిన పోరాటాలకు సైతం తాను మద్దతుగా నిలిచానన్నారు. రానున్న కాలంలో ఉపాధ్యాయుల పదోన్నతులపై, కారుణ్య నియామకాలు, హెల్త్ కార్డులు, ప్రభుత్వ పాఠశాలలన్నిటికీ ప్రత్యేక నిధుల కేటాయింపు, పెండింగ్ లో ఉన్న 4 డిఏ లు విడుదల చేయించడంలో రాష్ట్ర ప్రభుత్వంతో పోరాడుతానని, అదేవిధంగా గురుకులాలు, కస్తూర్బా గాంధీ పాఠశాలల ఉద్యోగుల ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారం కోసం కృషి చేస్తానని అన్నారు.
రాబోయే ఉపాధ్యాయ శాసనమండలి ఎన్నికల్లో టీఎస్యుటిఎఫ్, అధ్యాపక ఉద్యోగ ప్రజాసంఘాల మద్దతుతో తాను మరల ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల బరిలో నిలుస్తున్నానని కావున ఉపాధ్యాయ అధ్యాపక లోకం మరొకసారి తనకు ఉపాధ్యాయ ఎమ్మెల్సీగా తమ మొదటి ప్రాధాన్యత ఓటు వేసి అత్యధిక మెజార్టీతో గెలిపించాలని వారు విజ్ఞప్తి చేశారు. ఈ సమావేశంలో టీపీఎస్వి రాష్ట్ర వైస్ ప్రెసిడెంట్ కేఏ మంగ, మాజీ యుటిఎఫ్ జిల్లా అధ్యక్షులు ధనమూర్తి, స్థానిక ఎంఈఓ పిడతల వెంకటేశ్వర్లు, ఆదర్శ పాఠశాల ప్రిన్సిపల్ బూర సైదయ్య గౌడ్, ఆదర్శ పాఠశాల, జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ఉపాధ్యాయిని ఉపాధ్యాయులు పాల్గొన్నారు.