calender_icon.png 10 January, 2025 | 11:58 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ప్రాణ-,ఆస్తి నష్టం తగ్గించడమే లక్ష్యం

31-12-2024 02:44:11 AM

  • త్వరలో 33 జిల్లాలకు అగ్నిమాపక అధికారులు 
  • అగ్నిమాపక శాఖ డీజీపీ వై నాగిరెడ్డి
  • 2024 వార్షిక నివేదిక విడుదల

హైదరాబాద్ సిటీబ్యూరో, డిసెంబర్ 30 (విజయక్రాంతి): ఫైర్ ఫైటింగ్ రెస్క్యూ ఆపరేషన్స్ ద్వారా ప్రజల ప్రాణ, ఆస్తి నష్టాన్ని నివారించడమే  తమ ముందున్న ప్రధాన లక్ష్యమని అగ్నిమాపక విపత్తుల స్పందన, అత్యవసర, పౌరరక్షణ విభాగం డీజీ వై నాగిరెడ్డి తెలిపారు. సోమవారం మాదా  స్కై వ్యూ బిల్డింగ్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో అగ్నిమాపక శాఖ 2024 వార్షిక నివేదికను ఆయన విడుదల చేశారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రకృతి వైపరీత్యాలు సంభవించినప్పుడు ప్రజలకు సేవలు అందిం  అగ్నిమాపక  అధికారులు, సిబ్బంది  చేస్తున్న కృషిని అభినందించారు.  ఈ ఏడాది మొత్తం ఫైర్‌కాల్స్ 7,383 వచ్చాయని తెలిపారు. అగ్నిమాపక శాఖకు 2024లో రూ.34.79కోట్ల ఆదాయం సమకూరిందని చెప్పారు. గతేడాది అగ్ని ప్రమాదాల వలన 44 మంది ప్రాణాలు కోల్పోగా, 90 మందిని రక్షించామన్నారు. ఈ ఏడాది 23 మంది ప్రాణాలో కోల్పోగా, 63 మందిని రక్షించామని తెలిపారు.

అగ్నిమాపక సిబ్బంది సేవలు అభినందనీయం..

ఈ ఏడాదివరదలు వచ్చిన సమయంలో ప్రజలకు కావాల్సిన ఆహారం, వైద్యం, మంచినీరు అందిచడంతో పాటు వరదల్లో చిక్కుకున్న వారిని రక్షించడంలో అగ్నిమాపక సిబ్బంది చేపట్టిన సేవలు అభినందనీయం అన్నారు. రాష్ర్టంలో మొత్తం 147 అగ్నిమాపక కేంద్రాలు ఉన్నాయని, వాటిలో సింగిల్ యూనిట్ కేంద్రాలు 119, డబుల్ యూనిట్ 18, మల్టీయూనిట్ ఒకటి, ఔట్ పోస్టులు తొమ్మిది కేంద్రాలు ఉన్నాయని తెలిపారు.

దీంతో పాటు వాటర్ టెండర్లు 133, వాటర్‌లారీలు 5, మల్టీపర్పస్ టెండర్లు 56, అడ్వాన్స్ వాటర్ టెండర్లు 10, ఫోమ్ టెండర్లు 9, డీసీపీ టెండర్లు ఒకటి, హై ప్రెజర్ వాటర్ ట్యాంకర్ 17, వాటర్ కమ్ ఫోమ్ టెండర్ 9, క్విక్ రెస్పాన్స్ వాహనాలు 39, మిస్ట్ ఎక్విప్ మోటర్ సైకిల్స్ 138 అందుబాటులో ఉన్నాయన్నారు.

బహుళ అంతస్థుల భవనాల్లో మంటలను ఆర్పేందుకు రూ.5 కోట్ల ఖరీదు గల ప్రత్యేక టెండర్లు త్వరలో అందుబాటులోకి రానున్నాయని అందుకు ప్రభుత్వం ఆమోదం తెలిపిందన్నారు. అగ్నిమాపక శాఖ కోసం రంగారెడ్డిలోని గచ్చిబౌలిలోని ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్‌లో అగ్నిమాపక సేవల ప్రధాన కార్యాలయం, అగ్నిమాపక కేంద్రం, కమాండ్ కంట్రోల్ సెంటర్ సీఎం రేవంత్‌రెడ్డి ప్రారంభించారన్నారు.

తెలంగాణ ఫైర్, డిజాస్టర్ రెస్పాన్స్, ఎమర్జెన్సీ అండ్ సివిల్ డిఫెన్స్..

వట్టినాగులపల్లిలో 10.78 ఎకరాల స్థలంలో  తెలంగాణ ఫైర్ సర్వీసెస్ అండ్ సివిల్ డిఫెన్స్ ట్రైనింగ్ ఇనిస్టిట్యూట్  ఉంది.  అన్ని రకాల శిక్షణ మౌలిక సదుపాయాలు  ఇక్కడ ఉన్నాయి. ఈ విభాగానికి చెందిన డైరెక్ట్ రిక్రూట్ ఆఫీసర్స్ అండ్ పర్సనల్‌కు ఫౌండేషన్ ట్రైనింగ్ కోర్సులను, అన్ని ర్యాంకులకు ప్రమోషనల్ ట్రైనింగ్ కోర్సులను కూడా నిర్వహిస్తోంది. పరిశ్రమలు, మాల్స్, మల్టీప్లెక్స్‌లు, ఆసుపత్రులు మొదలైన వాటికి చెందిన ఉద్యోగులు, భద్రతా సిబ్బందికి బేసిక్ ఫైర్ ప్రివెన్షన్, ఫస్ట్ ఎయిడ్, ఫైర్ ఫైటింగ్‌పై స్వల్పకాలిక శిక్షణా కార్యక్రమాలను కూడా సంస్థ నిర్వహిస్తోందన్నారు.

అగ్నిమాపక సేవల చట్టం 1999 సవరణ..

ప్రస్తుత హైదరాబాద్ నగరం, తెలంగాణ అవసరాలకు అనుగుణంగా తెలంగాణ ఫైర్ సర్వీస్ యాక్ట్-1999ను సవరించేందుకు ఆ శాఖ ప్రతిపాదనలు పంపింది. బహుళజాతి సంస్థలు తమ కార్యాలయాలను ఏర్పాటు చేసుకోవడం, రియల్ ఎస్టేట్ విపరీతంగా పెరుగుతున్న తరుణంలో హైదరాబాద్ గ్లోబల్  సిటీగా అవతరించిన తరుణంలో తాజా పరిణామాలకు అనుగుణంగా ఫైర్ సర్వీస్ యాక్ట్ అవసరం, త్వరలోనే సానుకూల ఫలితాలు అందుతాయని ఫైర్ డీజీపీ వై నాగిరెడ్డి తెలిపారు.