calender_icon.png 20 November, 2024 | 6:55 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

యువతకు ఉపాధి కల్పించడమే ధ్యేయం

10-09-2024 02:29:56 AM

  1. నైపుణ్య శిక్షణ పథకంపై తప్పుడు ప్రచారం తగదు 
  2. నిబంధనలకు లోబడే ఏజెన్సీలకు పనులు 
  3. తప్పుడు వార్తలను ఖండించిన మంత్రి సీతక్క

హైదరాబాద్, సెప్టెంబర్ 9 (విజయక్రాంతి): గ్రామీణ యువతకు నైపుణ్యం కల్పించడమే రాష్ట్రప్రభుత్వ ధ్యేయమని సోమవారం రాష్ట్రపంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధిశాఖ మంత్రి సీతక్క పేర్కొన్నారు. నైపుణ్య శిక్షణ పథకంపై ఓ యూట్యూబ్ చానెల్ పనిగట్టుకుని తప్పుడు ప్రచారం చేస్తున్నాయని, ఆ ప్రచారాన్ని ఖండిస్తున్నామని ప్రకటించారు. యువతకు ఉపాధి కల్పనకు కేంద్రం దీన్ దయాళ్ ఉపాధ్యాయ గ్రామీణ కౌసల్య స్కీం అమలు చేస్తున్నదని, ఈ పథకాన్ని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సంయుక్తంగా నిర్వహిస్తాయని స్పష్టం చేశారు. దీనిలో కేంద్ర ప్రభుత్వ వాటా 60 శాతం, రాష్ట్ర ప్రభుత్వ వాటా 40 శాతం ఉంటుందని తేల్చిచెప్పారు.

ఈ స్కీంలో అవకతవకలు జరిగాయని ఓ యూట్యూబ్ చానల్ కుట్రపూరితంగా కథనాన్ని ప్రసారం చేసిందని, అది పూర్తిగా అవాస్తవమని సీతక్క ఖండించారు. నైపుణ్య శిక్షణకు కేంద్ర ప్రభుత్వం సాహితి సిస్టమ్స్ ప్రైవేట్ లిమిటెడ్ అనే ఏజెన్సీని కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ గుర్తించగా గత ప్రభుత్వమే ఎంపిక చేసిందని గుర్తుచేశారు. ఏజెన్సీ పరిధిలో ఇప్పటివరకు 6,600 మందికి నైపుణ్య శిక్షణ ఇచ్చేందుకు రూ.55.19 కోట్ల ఒప్పం దం జరిగిందన్నారు. గత బీఆర్‌ఎస్ ప్రభు త్వం సదరు కంపెనీకి రూ.18.43 కోట్లు కేటాయించిందని, చివరిసారిగా గతేడాది ఆగస్టు 31న  రూ.4.85 కోట్లు చెల్లించిందన్నారు. ఆ ఏజెన్సీ నిజంగా బ్లాక్ లిస్టేడ్ కంపెనీ అయితే బీఆర్‌ఎస్ ప్రభుత్వం ఎందుకు రూ.18.43 కోట్లు ఎందుకు చెల్లించిదో చెప్పాలని డిమాండ్ చేశారు.

తమ ప్రభుత్వం యువతకు ఉపాధి కల్పించాలని పరితపిస్తుంటే.. కొందరు ప్రజలను గందరగోళానికి గురిచేస్తూ ప్రభుత్వంపై బురద జల్లుతున్నారని మండిపడ్డారు. గత ప్రభుత్వానికి అందరి నుంచి కమీషన్లు తీసుకునే అలవాటు ఉంద ని, తమ లాగే ప్రస్తుత ప్రభుత్వం కూడా ఉంటుందని భ్రమ పడుతున్నారని ఎద్దేవా చేశారు. గత ప్రభుత్వం నిబంధనలు పాటించకపోవడంతోనే కేంద్రం ఈ ఏడాది స్కీంను రాష్ట్రంలో నిలిపేసిందని గుర్తుచేశారు. రాష్ట్ర గ్రామీణాభివృద్ధి శాఖ మాత్రం దీనిపై ప్రత్యేకంగా కమిటీ వేసి స్కీంను అమలు చేస్తున్నా మని,  ఈ విషయాన్ని గుర్తెరిగి వ్యవహరిస్తే బాగుంటుందని హితవు పలికారు. తమ ప్రభుత్వం పారదర్శకంగా ప్రతి పైసా ఖర్చు చేస్తుందని స్పష్టం చేశారు.