calender_icon.png 18 April, 2025 | 5:50 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

భారత రాజ్యాంగ పరిరక్షణే ధ్యేయం

09-04-2025 08:27:18 PM

పెద్దపల్లి ఎంపీ వంశీకృష్ణ, చెన్నూరు ఎమ్మెల్యే వివేక్..

మందమర్రి (విజయక్రాంతి): కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం రాజ్యాంగ స్ఫూర్తిని అవమాన పరుస్తూ మోడీ పాలనా సాగిస్తోందని రాజ్యాంగ పరిరక్షణ ధ్యేయంగా కాంగ్రెస్ పార్టీ దేశవ్యాప్తంగా జై బాపు, జై భీమ్, జై సంవిధాన్  నినాదాన్ని ప్రజల్లోకి తీసుకెళ్ళాలనే లక్ష్యంతో భారత రాజ్యాంగ పరిరక్షణ యాత్ర చేపట్టిందని పెద్దపల్లి ఎంపీ వంశీకృష్ణ, చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి లు ఆన్నారు. బుదవారం పట్టణంలోని అంగడి బజార్ లోని మహత్మగాంది విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. అనంతరం రాజ్యాంగ పరిరక్షణ యాత్ర ప్రారంభించారు. ఈ సందర్బంగా వారు మాట్లాడారు.

అంబేద్కర్ రచించిన భారత రాజ్యాంగాన్ని పరిరక్షించు కోవడం తో పాటు డాక్టర్ అంబేద్కర్ వారసత్వం, విలువలను కాపాడటానికి, దేశవ్యాప్తంగా పాదయాత్ర నిర్వహిస్తున్నామన్నారు. పార్లమెంట్ సాక్షిగా అంబేద్కర్ రచించిన రాజ్యాంగాన్ని అవమాన పరిచిన బిజేపి పార్లమెంట్‌ను నియంతృత్వ శైలిలో నిర్వహిస్తుందని వారు విమర్శించారు. పార్లమెంట్ లో రాహుల్ గాంధీకి మాట్లాడే హక్కును బీజేపీ ప్రభుత్వం అడ్డుకుంటోందని వారు మండిపడ్డారు.

బీజేపీ ప్రజా వ్యతిరేక విధానాలు, రాజ్యాంగానికి నష్టం కలిగించే కుట్రలను  ప్రజల్లోకి తీసుకెళ్లడానికే ఈ పాదయాత్ర చేపట్టామని వారు స్పష్టం చేశారు. రాజ్యాంగ పరిరక్షణ బాధ్యత పార్టీ శ్రేణులపై ఉందని, ఈ యాత్ర ద్వారా ప్రజల సమస్యలను నేరుగా తెలుసుకునేందుకే జై బాపు, జై భీమ్, జై సంవిధాన్ కార్యక్రమం చేపట్టినట్టు వారు స్పష్టం చేశారు. అంగడి బజార్ నుండి ప్రారంభమైన యాత్ర వివిధ కాలనీల గుండా రామన్ కాలనీ కాలనీ వరకు కొన సాగింది. ఈ కార్యక్రమంలో పట్టణ కాంగ్రెస్, దాని అనుబంధ సంఘాల నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.

చిర్రకుంటలో...

మండలంలోని చిర్రకుంట గ్రామంలో జై బాపు, జై భీమ్, జై సంవిదాన్ కార్యక్రమంలో భాగంగా రాజ్యాంగ పరిరక్షణ యాత్ర నిర్వహించారు. ఈ సందర్భంగా చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి పెద్దపల్లి ఎంపీ వంశీకృష్ణలు మాట్లాడారు. రాజ్యాంగ పరిరక్షణ అందరి బాధ్యత అని వారు స్పష్టం చేశారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం రాజ్యాంగాన్ని అపహస్యం చేస్తూ పాలన కొనసాగిస్తుందని విమర్శించారు. రాజ్యాంగం రద్దుకు కుట్రలు చేస్తున్నారని విమర్శించారు.

బిజెపి ప్రభుత్వం రాజ్యాంగ వ్యతిరేక విధానాలను ప్రజల్లోకి తీసుకువెళ్లేందుకే కాంగ్రెస్ పార్టీ దేశవ్యాప్తంగా రాజ్యాంగ పరిరక్షణ యాత్ర చేపట్టిందని వారు స్పష్టం చేశారు.  గ్రామ పొలిమేర్లలో ప్రారంభమైన యాత్ర గ్రామం మీదుగా ఆదిల్ పేట వరకు కొనసాగింది. ఈ కార్యక్రమంలో బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు గందె రాం చందర్, మండల కాంగ్రెస్ అధ్యక్షులు బానోత్ నీలయ్య, మాజీ గ్రామ సర్పంచ్ ఒడ్నాల కొమురయ్య, నాయకులు పెద్దాల రాజయ్య, కామెర బాలయ్య, సంపత్ రావు, దుర్గం సుధాకర్, రామటెంకి విజయ లు పాల్గొన్నారు.