- రామగుండం కమిషనరేట్‌లో ప్రతీ పీఎస్‌కు ఒక వారియర్
- మోసం జరిగిన వెంటనే రంగంలోకి..
- బాధితులకు సత్వర న్యాయం చేసేందుకు కృషి
మంచిర్యాల, నవంబర్ 17 (విజయక్రాంతి): మం చిర్యాల జిల్లాలో రోజు రోజుకు సైబర్ నేరాల బారి న పడుతున్న వారి సంఖ్య పెరుగుతోంది. దీనిని అరికట్టేందుకు రామగుండం పోలీస్ కమిషనరేట్ పరిధిలో మంచిర్యాల, పెద్దపల్లి జిల్లాల్లోని ప్రతి పోలీస్ స్టేషన్‌లో కంప్యూటర్ పరిజ్ఞా నం కలిగి ఉన్న ఒక వారియర్(హెడ్ కానిస్టేబుల్/కానిస్టేబుల్)కు బాధ్యతలు అప్పగిం చారు. ఆయా పీఎస్‌ల పరిధిలో ఎవరైనా సైబర్ మోసానికి గురయితే వెంటనే వారికి న్యాయం చేయడమే లక్ష్యంగా ఈ వారియర్స్ పని చేస్తున్నారు.
వారికి ప్రత్యేక సిమ్ కార్డులు
24 పోలీస్ స్టేషన్‌లలో సైబర్ మోసాలకు గురైన వారికి న్యాయం చేయాలనే మంచి ఉద్దేశంతో జిల్లాలోని ప్రతి పోలీస్ స్టేషన్‌కు ఒక సైబర్ వారియర్‌ను నియమించారు. జిల్లాలోని 24 పోలీస్ స్టేషన్‌లలో హెడ్ కానిస్టేబుల్, కానిస్టేబుల్‌లకు బాధ్యతలు అప్పగించారు. సైబర్ మోసానికి గురైన వారు వీరిని సంప్రదిస్తే వెంటనే నేషనల్ సైబర్ క్రైం రిపోర్టింగ్ పోర్టల్ (ఎన్‌సీ ఆర్‌పీ)లో బాధితుడి వివరాలు నమోదు చేస్తారు.
అలాగే బాధితులు ఎవరైనా 1930 కి ఫోన్ చేసినా అక్కడి నుంచి బాధితులు ఉన్న పోలీస్ స్టేషన్ పరిధిలోని సైబర్ వారియర్స్‌కు సమాచారం అందుతుంది. వారు ఆ ఫిర్యాదును ఆన్‌లైన్ చేసి బాధితులకు న్యాయం చేసేందుకు కృషి చేస్తారు.
వారియర్లకు ప్రత్యేక శిక్షణ
మంచిర్యాల జిల్లాలో 24 పోలీస్ స్టేషన్‌లలోని సైబర్ వారియర్లు ప్రత్యేక శిక్షణ పొంది ఉన్నారు. ఏ పోలీస్ స్టేషన్ పరిధిలోని కేసును వారే నమోదు చేసి బాధితులకు న్యాయం చేసేందుకు కృషి చేస్తున్నారు. సైబర్ మోసానికి గురైన బాధితులు వెంటనే 1930కి ఫోన్ చేస్తే నేరాన్ని నియంత్రించేందుకు వీలవుతుంది. ఆలస్యమైతే నష్టం జరిగే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. స్మార్ట్ ఫోన్‌లు వినియోగించేవారు జాగ్రత్తగా ఉండాలి.
- ఎగ్గడి భాస్కర్, డీసీపీ, మంచిర్యాల
తొందరపడి వివరాలు ఇవ్వొద్దు
సైబర్ నేరస్థులు ఏదైనా లాటరీ, ఇతరత్ర ఆశలు చూపి ప్రజలను మాటల్లో పెట్టి బ్యాంకు, ఇతర వివరాలు అడుగుతున్నారు. తొందరపడి వివరాలు చెప్పొద్దు. అత్యాశకు పోయి ఉన్నది పోగొట్టుకోవద్దు. ఏదైన సందర్భంలో మోసపోయినట్లు గుర్తిస్తే వెంటనే 1930కి లేదా మీ సమీప పీఎస్ సైబర్ వారియర్‌ను సంప్రదించాలి. 100కి కాల్ చేసినా ఫలితం ఉంటుంది.
ఎం శ్రీనివాసులు, సీపీ, రామగుండం