calender_icon.png 24 October, 2024 | 10:02 AM

వారసత్వ కట్టడాల పరిరక్షణే ధ్యేయం

22-07-2024 02:55:55 AM

యునెస్కో ప్రపంచ వారసత్వ కమిటీ సమావేశాలకు హాజరైన మంత్రి జూపల్లి

న్యూఢిల్లీ వేదికగా జూలై 21 నుంచి  31 వరకు సమావేశాలు

హైదరాబాద్, జూలై 21 (విజయక్రాంతి): వారసత్వ కట్టడాల పరిరక్షణే ధ్యేయంగా పని చేసే యునెస్కో ప్రపంచ వారసత్వ కమిటీ 46వ సమావేశాలకు పర్యాటక, సాంస్కృ తిక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు హాజరయ్యారు. న్యూఢిల్లీలోని భారత్ మండపంలో నిర్వహించిన ఈ కార్యక్రమాన్ని ప్రధాని నరేంద్రమోదీ ప్రారంభించారు. ఈ నెల 31 వరకు కొనసాగే ఈ సమావేశాలకు మన దేశం మొదటిసారి ఆతిథ్యం ఇచ్చింది.

యునెస్కో డైరెక్టర్ జనరల్ ఓద్రే అజులై, కేంద్ర పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి గజేంద్రసింగ్ షెకవత్‌తో పాటు  150కి పైగా దేశాల నుంచి 2 వేల మందికి పైగా జాతీయ, అంతర్జాతీయ స్థాయి ప్రతినిధులు హాజరయ్యారు. తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన ప్రసిద్ధ వారసత్వ కట్టడాలు, చారిత్రక ప్రాంతాలు, పర్యాటక ప్రదేశాలకు చెందిన కళాఖండాలు, వాటి సమాచారాన్ని తెలిపేలా స్టాల్ ను ఏర్పాటు చేశారు. ఆసియా దేశాలకు చెందిన పలు స్టాల్స్‌ను మంత్రి జూపల్లి సందర్శించారు.

నాగర్జున సాగర్‌లోని బుద్ధవనాన్ని అంతర్జాతీయ స్థాయిలో అభివృద్ధి చేయడంతో పాటు మన రాష్ట్రానికి చెందిన ముఖ్యమైన సాంస్కృతిక, వారసత్వ ప్రాంతాల పరిరక్షణ, అభివృద్ధికి చర్యలు తీసుకోవడానికి  ఇలాంటి సమావేశాలు ఎంతో దోహదపడుతాయని మంత్రి పేర్కొన్నారు. సమావేశానికి ఢిల్లీలో తెలంగాణ ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధి జితేందర్ రెడ్డి, పర్యాటక శాఖ డైరెక్టర్ ఇలా త్రిపాఠి, పురావస్తు శాఖ డెరెక్టర్ భారతీ హోలికేరి హాజరయ్యారు.