calender_icon.png 24 December, 2024 | 9:14 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

సైబర్ నేరాలను అరికట్టడమే లక్ష్యం

07-11-2024 12:10:45 AM

సైబర్ సెక్యూరిటీ వార్షిక సమ్మిట్‌లో ఐటీ శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు

హైదరాబాద్ సిటీబ్యూరో, నవంబర్ 6 (విజయక్రాంతి): సైబర్ నేరాలను అరికట్టేందుకు ప్రభుత్వం పటిష్ట చర్యలు తీసుకుంటోందని రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు అన్నారు. బుధవారం సోమాజిగూడలోని ది పార్క్ హోటల్‌లో హైదరాబాద్ సిటీ సెక్యూరిటీ కౌన్సిల్(హెచ్‌సీఎస్‌సీ) ఆధ్వర్యంలో సైబర్ సెక్యూరిటీ వార్షిక సమ్మిట్ (హ్యాక్ 2.0)ను  నిర్వహించారు.

ముఖ్య అతిథిగా మంత్రి శ్రీధర్‌బాబు హాజరై జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. అనంతరం సైబర్ నేరాలపై ప్రజలకు అవగాహన కల్పించడం కోసం చిత్రీకరించిన వీడియోలను విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సైబర్ నేరాల నిర్మూలనకు నిపుణుల సూచనలు, సలహాలు కీలకమవుతాయని అన్నారు.

రాష్ట్రంలో టీజీ సైబర్ సెక్యూరిటీ బ్యూరో ద్వారా మంచి ఫలితాలను సాధిస్తున్నట్లు తెలిపారు. అపరిచితుల నుంచి వచ్చే ఫోన్ కాల్స్, మెయిల్స్, మెసేజ్‌లకు స్పందించవద్దని సూచించారు. అనంతరం హెచ్‌సీఎస్‌సీ చైర్మన్, హైదరాబాద్ సీపీ సీవీ ఆనంద్ మాట్లాడుతూ.. ఈ ఏడాది సైబర్ నేరాలు 24 శాతం పెరిగాయని, రాష్ట్రంలో 36 రకాల సైబర్ నేరాలు  ఎక్కువగా జరుగుతున్నాయని చెప్పారు.

ఇటీవలే 28 మంది సైబర్ నేరగాళ్లను రాజస్థాన్‌లో అరెస్ట్ చేశామని గుర్తు చేశారు. వారంతా దేశవ్యాప్తంగా 243 కేసుల్లో నిందితులుగా ఉన్నారని, వాటిల్లో 28 కేసులు తెలంగాణలో ఉన్నాయన్నారు. సుదూర  ప్రాంతాల్లో ఉండి కేటుగాళ్లు సైబర్ నేరాలకు పాల్పడుతున్నారని, ఇతర రాష్ట్రాలకు వెళ్లి వారిని అరెస్ట్ చేయడం సవాలుగా మారిందని తెలిపారు.

అరెస్ట్ చేయడానికి వెళ్లిన సమయంలో స్థానికులు దాడులకు పాల్పడుతున్నట్లు తెలిపారు. ఈ ఏడాది రూ. 36 కోట్ల వరకు సైబర్ బాధితులకు తిరిగి ఇప్పించామని తెలిపారు. కాగా, ఈ కార్యక్రమానికి ప్రత్యేక అతిథిగా సినీ నటుడు అడవి శేషు హాజరయ్యారు. కార్యక్రమంలో సైబర్ సెక్యూరిటీ బ్యూరో డైరెక్టర్ శిఖా గోయల్, మహారాష్ట్ర అడిషనల్ డీజీపీ బ్రిజేష్ సింగ్, హెచ్‌సీస్‌సీజనరల్ సెక్రటరీ శేఖర్‌రెడ్డి, డీసీపీలు తదితరులు పాల్గొన్నారు.