calender_icon.png 27 October, 2024 | 3:59 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

గురుకులాల్లో ‘సమయ’ వేదన!

08-08-2024 01:49:15 AM

  1. విద్యార్థులకు ‘టైం టేబుల్’ కష్టాలు
  2. పిల్లల మానసిక స్థితిపై ప్రభావం
  3. సౌకర్యాల లేమితో సమస్యల ఉత్పన్నం
  4. ‘బీసీ, జనరల్’లో మార్చమంటే అన్నింట్లో మార్పు
  5. మహిళా టీచర్లకూ తప్పని తిప్పలు

హైదరాబాద్, ఆగస్టు 7 (విజయక్రాంతి): పిల్లల్లో ఆసక్తి పెరగాలన్నా, చదువుపై శ్రద్ధ చూపాలన్నా.. వారికి ప్రశాంతమైన వాతావరణం, వసతులు కల్పించాలి. అప్పుడే వారిలోని నైపుణ్యం బయటపడుతుంది. పిల్లల మానసిక స్థితి సరిగా లేకపోతే సరైన ఫలితాలు రావడం కష్టమే. ఇప్పుడు అలాంటి పరిస్థితే రాష్ట్రంలోని గురుకుల పాఠశాలాల్లో కన్పిస్తోంది.

అన్ని వర్గాల విద్యార్థులకు నాణ్యమైన విద్య అందించాలనే ఉద్ధేశంతో ప్రభుత్వం బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ, జనరల్ క్యాటగిరీల్లో గురుకులాలను ప్రారంభించింది. అయితే, ఆ లక్ష్యం దిశగా గురుకులాల నిర్వహణ జరగడం లేదని అభిప్రాయం వ్యక్తమవుతున్నది. ప్రధానంగా సమయపాలన ప్రభావితం చేస్తోంది. విద్యార్థుల ఆరోగ్యం, శ్రద్ధాసక్తుల దృష్ట్యా వారికి టైంటేబుల్ ప్రకారం అన్ని వసతులు కల్పించాల్సిన అవసరం ఉంది. కానీ, గురుకులాల్లోని అస్తవ్యస్తమైన టైంటేబుల్‌తో విద్యార్థులు ఇబ్బందులకు గురవుతున్నారు. 

‘గంట’ తెచ్చిన తంటా

గతంలో గురుకులాలు ఉదయం 9 గంటలకు ప్రారంభం అయ్యేవి. ఉదయం 5 గంటలకు లేచిన విద్యార్థులు 6 గంటల వరకు కాలకృత్యాలు తీర్చుకునేవారు. 8 గంటల వరకు పాఠశాలకు రెడీ అయ్యేవారు. అల్పాహారం పూర్తి చేసుకుని 9 గంటల వరకు పాఠశాలకు సిద్ధంగా ఉంటారు. ప్రస్తుతం 8 గంటలకే పాఠశాల మొదలవుతుండటంతో 7 గంటల వరకే అన్ని పనులు చేసుకోవాల్సి వస్తుంది. అనంతరం అల్పాహారం పూర్తి చేసుకుని పాఠశాలకు వస్తున్నారు.

కేవలం రెండు గంటల్లోనే పనులన్నీ పూర్తి చేసుకోవడం విద్యార్థులకు సాధ్యంకాక తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. రాత్రి 7.30 గంటలకు స్టడీ అవర్ పూర్తి చేసుకుని, 9 గంటల వరకు భోజనం చేసి నిద్రపోయేవారు. గంట సమయం ముందుకు జరుపడంతో సాయంత్రం 7 గంటల లోపే భోజనం చేసి అనంతరం స్టడీ అవర్ ఉంటుంది. దీంతో రాత్రి పడుకునే ముందు విద్యార్థులు మళ్లీ ఆకలి వేస్తున్నదని విద్యార్థులు ఆవేదన వ్యక్తంచేస్తున్నారు. ఖాళీ కడుపుతో నిద్రపోతున్నారు. దీంతో విద్యార్థులు మానసికంగా ఇబ్బంది పడటంతోపాటు వారి చదువుపై కూడా ఇది ప్రభావం చూపి మంచి ఫలితాలు వచ్చేందుకు అవకాశం లేకుండా పోతుంది.  

20 మందికి ఒక బాత్‌రూమ్ 

ఉదయం విద్యార్థులు రెడీ అయ్యేందుకు టైం సరిపోకపోవడానికి ప్రధానం కారణం సరిపడినన్ని బాత్‌రూములు లేకపోవడం. అయితే ప్రతి పాఠశాల దాదాపు 650 మంది వరకు విద్యార్థులుంటారు. వీరికి 20 మందికి ఒక బాత్‌రూము చొప్పన ప్రస్తుతం అందుబాటులో ఉన్నాయి. గంటలోనే 20 మంది విద్యార్థులు ఒక బాత్‌రూముతో స్నానాలు పూర్తి చేసుకోవడం సాధ్యం కాదు. బాత్‌రూములు, సమయం సరిపోక ఉదయం కాలకృత్యాలు చేసుకోలేక తరగతి జరిగే సమయంలో విద్యార్థులు ఇబ్బంది పడుతున్నారు.  

‘బీసీ, జనరల్’లో మార్చమన్నందుకే..

గతంలో ఉన్న టైంటేబుల్‌ను బీసీ, జనరల్ క్యాటగిరి గురుకులాల్లో సరిగా పాటించకపోవడంతో మిగిలిన ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ గురుకులాల్లోని సిబ్బంది ఈ విషయాన్ని అధికారుల దృష్టికి తీసుకెళ్లారు. అయితే, అధికారులు బీసీ, జనరల్ గురుకులాల్లో టైంటేబుల్ సరి చేయకపోగా ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ గురుకులాల్లోనూ కొత్త టైంటేబుల్ ప్రవేశపెట్టారు. దీంతో ప్రస్తుతం అన్ని గురుకులాల్లోని విద్యార్థులు ఇబ్బందికి గురవుతున్నారు.  

మహిళా టీచర్లకూ తిప్పలు...

దాదాపు రాష్ట్రవ్యాప్తంగా ఉన్న అన్ని క్యా టగిరీల్లోని గురుకులాల్లో 80 శాతం మహి ళా టీచర్లే బోధిస్తున్నారు. ప్రస్తుత టైంటేబుల్ ప్రకారం రాత్రి 7 గంటల నుంచి 9 గంటల వరకు నిర్వహించే స్టడీ అవర్‌లో మూడోవంతు టీచర్లు విద్యార్థులకు అందుబాటులో ఉండాలి. దీంతో రాత్రి 9 గంటల తర్వాత మ హిళా టీచర్లు ఇంటికి వెళ్లడం ఇబ్బందికరం గా ఉందని ఆవేదన వ్యక్తంచేస్తున్నారు. ఇప్పుడున్న గురుకులాల భవనాల్లో చాలావరకు అద్దెవి కావడంతోపాటు అవి సిటీకి దూరం గా ఉన్నాయి. దీంతో టీచర్లు, సిబ్బందికి రవాణా కష్టాలు కూడా తలెత్తుతున్నాయి.  

మంచి ఫలితాలు ఎలా వస్తాయి? 

ప్రభుత్వం నిర్ణయించిన పనివేళల్లో హేతుబద్ధత, శాస్త్రీయత లేవు. ఇది ఆమోదయోగ్యం లేదు. దీనివల్ల విద్యార్థుల మానసిక స్థితిపై తీవ్ర ప్రభావం పడుతుంది. విద్యార్థులు రెండు గంటల్లో అన్ని పనులు చేసుకోవడం ఆచరణ సాధ్యం కాదు. సాయంత్రం 6 గంటలకు రాత్రి భోజనం పెడితే మరుసటి రోజు ఉదయం 7.30 గంటల వరకు విద్యార్థులు ఎలా ఉంటారు. ఈ రకంగా ఇబ్బంది పడుతున్న విద్యార్థుల నుంచి మంచి ఫలితాలు ఎలా వస్తాయి. రాత్రి 9 గంటల వరకు పాఠశాలలోనే ఉండే మహిళా టీచర్లు అప్పుడు ఇంటికి ఎలా వెళ్తారు. ఈ టైం టేబుల్‌తో విద్యార్థులకు ఒరిగేదేమీ లేదు. ఇప్పటికైనా అధికారులు టైం టేబుల్‌పై టీచర్లు, సిబ్బంది, గురుకుల ఉపాధ్యాయ సంఘాలతో చర్చించి సరైన నిర్ణయం తీసుకోవాలి. 

 వేమిరెడ్డి దిలీప్‌కుమార్‌రెడ్డి, పీఆర్‌జీటీఏ రాష్ట్ర అధ్యక్షుడు

రాష్ట్రవ్యాప్తంగా గురుకులాలు, విద్యార్థులు (క్యాటగిరీల వారీగా)

గురుకులం సంస్థలు విద్యార్థులు

బీసీ 327 1,87,280

ఎస్సీ 268 1,77,630

ఎస్టీ 188 1,05,610

మైనార్టీ 205 1,30,560

జనరల్ 35 24,680

మొత్తం 1022 6,25,760