చిల్డ్రన్స్ మాక్ అసెంబ్లీలో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి
హైదరాబాద్, నవంబర్ 14 (విజయక్రాంతి): అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసేందుకు ఎమ్మెల్యే అభ్యర్థుల వయోపరిమితిని 25 ఏళ్ల నుంచి 21 ఏళ్లకు తగ్గిస్తే బాగుంటుందని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అభిప్రాయపడ్డారు. తద్వారా ఎక్కువ మంది యువత రాజకీయాల్లోకి వచ్చే అవకాశం ఉంటుందన్నారు.
ఈ తీర్మానాన్ని అసెంబ్లీ ద్వారా రాష్ట్రపతికి పంపించాలని, పార్లమెంట్‌లో దీనిపై చర్చ జరగాల్సి ఉందన్నారు. హైదరాబాద్ ఎస్‌సీఈఆర్టీ ఆవరణలో గురువారం అండర్ 18, విద్యాశాఖ సంయుక్తంగా నిర్వహించిన ‘చిల్డ్రన్ మాక్ అసెంబ్లీ’ని సీఎం ఆసక్తిగా తిలకించారు. విద్యార్థులు శాసనసభ్యులుగా నడిపిన రెండు బిల్లులపై చర్చ, క్వశ్చన్ అవర్‌ను ఆద్యంతం గమనించారు.
అనంతరం సీఎం మాట్లాడుతూ.. ఓటు వేసేందుకు అర్హత వయస్సును 21 ఏళ్ల నుంచి 18 ఏళ్లకు తగ్గించిన ఘనత నాటి ప్రధాని రాజీవ్ గాంధీకే దక్కుతుందన్నారు. శాసనసభలో సభ్యులు లేవనెత్తిన ప్రశ్నలు, ఇతర సభ్యులు ఇచ్చిన సమాధానాలను వి ద్యార్థులు గమనించాలని సూచించారు.
విపక్షాలు ప్రశ్నించాలని, వారికి సమాధానాలు చెప్పడం ప్రభుత్వం బాధ్యత అని తెలిపారు. తొలి ప్రధాని జవహర్ లాల్ నెహ్రూ విద్యారంగంలో అనేక సంస్కరణలు తీసుకొచ్చారని కొనియాడారు. అదే ఒరవడిని మన్‌మోహన్ సింగ్ వరకు కొనసాగించారని కీర్తించారు.
మాక్ అసెంబ్లీలో డ్రగ్ అబ్యూసింగ్ బిల్, అండర్ హెడ్‌క్వార్టర్ బిల్స్‌ను పాస్ చేయడం తనను ఆకర్షించిందన్నారు. కార్యక్రమంలో డిప్యూటీ సీఎం భట్టివిక్రమార్క, రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్, విద్యాశాఖ ఉన్నతాధికారులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.