తెలంగాణ ఉద్యమం.. ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఆకాంక్ష.. దాన్ని సాకారం చేసుకోవడం కోసం జాయింట్ యాక్షన్ కమిటీ(జేఏసీ)లు.. ప్రజా సంఘాలు, ఉద్యోగ సంఘాలు, విద్యార్థుల పాత్ర అనిర్వచనీయం. 1969 మొదలైన తొలి దశ ఉద్యమం 2014లో ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర నిర్ణయం వెలువడిన దశ వరకు ఈ సంఘాలు ఎంతో క్రియాశీలంగా వ్యవహరించాయి. రాజకీయ పార్టీలను సైతం ఈ జేఏసీలు, ప్రజా సంఘాలు ప్రభావితం చేశాయి. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటులో ప్రధాన భూమిక పోషించాయి.
కేసీఆర్, ప్రొఫెసర్ కోదండరాం సర్ పిలుపుతో మలిదశ ఉద్యమాన్ని కామారెడ్డి జిల్లా వ్యాప్తంగా ఉధృతం చేసిన ఘనత న్యాయవాదులకు దక్కింది. న్యాయవాదులు తమ విధులను పక్కన పెట్టి రాత్రనక, పగలనక గ్రామగ్రామాల్లో తిరిగి ప్రజలను చైతన్యపరిచారు. అయితే పోరాడి తెచ్చుకున్న తెలంగాణలో ఉద్యమకారులకు, న్యాయవాదులకు ఒరిగిందేం లేదని తమ పదేళ్ల అనుభవాలను విజయక్రాంతితో పంచుకున్నారు.
తెలంగాణ రాష్ట్రం సాధించుకుంటే నీళ్లు, నిధులు, నియామకాలు వస్తాయని తెలంగాణ ప్రజలు ఆకాంక్షించారు. ఉమ్మడి రాష్ట్రంలోనే కామారెడ్డి న్యాయవాదులు చేసిన పోరాటం చరిత్రలో నిలిచిపోయింది. ఏకగ్రీవంగా తీర్మానం చేసుకొని తెలంగాణ రాష్ట్రం కావాలని అందరిని ఒకే తాటిపైకి తీసుకొచ్చారు. తమ విధులను పక్కన పెట్టి సబ్ కోర్టు సాధన కోసం ఉద్యమాన్ని ప్రారంభించిన కామారెడ్డి న్యాయవాదులు తెలంగాణ రాష్ట్ర సాధనలో ముఖ్య భూమిక పోషించారు. కేసీఆర్, కోదండరాం సార్ పిలుపులకు సహకరించారు.
జేఏసీ ఏర్పాటు చేసి నిరవధికంగా నిరసన దీక్షలు చేపట్టారు. రోడ్డు దిగ్బంధాలు, రైల్‌రోకో, బస్సు రోకో, విద్యుత్ సబ్ స్టేషన్లు, ప్రభుత్వ కార్యాలయాల ముట్టడి వంటి ఎన్నో కార్యక్రమాలను తెలంగాణ రాష్ట్ర సాధన కోసం చేపట్టారు. కామారెడ్డి నియోజక వర్గంలో ప్రతి గ్రామాన్ని చుట్టుముట్టి రాత్రనక, పగలనక తెలంగాణ రాష్ట్రం వస్తే నీళ్లు, నిధులు, నియామకాలు లభిస్తాయని ఎన్నో ఆశలతో ప్రజలను చైతన్యవంతం చేశారు. తెలంగాణ వచ్చి పదేళ్లు గడుస్తున్నా ప్రజల ఆకాంక్షలు నేరవేరలేదని బాధపడుతున్నారు. కేవలం టీఆర్‌ఎస్ ప్రభుత్వానికి మేలు జరిగిందే తప్ప తెలంగాణ ప్రజలకు మాత్రం ఒరిగిందేం లేదని వాపోతున్నారు.
మొసర్ల శ్రీనివాస్‌రెడ్డి, కామారెడ్డి
ఉద్యమ పిలుపుతో!
తెలంగాణ రాష్ట్రం వస్తే మన నిధులు, మన నీళ్లు, మన ఉద్యోగాలు మనకు లభిస్తాయనే ఆకాంక్షతో తెలంగాణ మలిదశ ఉద్యమంలో పాల్గొన్నాం. కేసీఆర్ కామారెడ్డికి రాకముందే కామారెడ్డి న్యాయవాదులం సబ్ కోర్టు సాధన కోసం ఉద్యమించాం. అదే స్ఫూర్తితో కేసీఆర్ వచ్చిన తరువాత కోదండరాం సర్ జేఏసీ కన్వీనర్‌గా ఉద్యమ పిలుపుకు స్పందించాం. నిరంతరం రిలే నిరాహర దీక్షలు నిర్వహించాం. నల్ల బ్యాడ్జీలు ధరించి విధులు బహిష్కరించాం. దశల వారిగా ఉద్యమాన్ని ఉధృతం చేశాం. గ్రామ గ్రామాన తిరిగి ప్రజలను చైతన్యవంతం చేశాం. రిలే నిరాహరదీక్షలతో పాటు వంటా వార్పు, రాస్తా రోకోలు, మానవహారం వంటి కార్యాక్రమాలతో పాటు రాజకీయంగా స్థానిక సంస్థల ఎన్నికల్లో ఏకగ్రీవంగా టీఆర్‌ఎస్‌కు చెందిన ప్రజాప్రతినిధులను గెలిపించిన చరిత్ర కామారెడ్డి ప్రాంత న్యాయవాదులది, ప్రజలది.
జగన్నాథం, జేఏసీ కన్వీనర్
సబ్బండ వర్గాలను ఏకం చేశాం..
మేం మలిదశ తెలంగాణ ఉద్యమ పోరాటానికి పునాదిగా నిలిచాం. ఎన్నో కార్యాక్రమాలను నిర్వహిస్తూ కేసీఆర్‌కు, కోదండరాం సార్‌లకు సూచనలు ఇస్తూ, వారి సలహాలను పాటిస్తూ.. ప్రతి గ్రామానికి తిరిగి ప్రజలను చైతన్యవంతం చేసిన ఫలితం లేకుండా పోయింది. తెలంగాణ రాష్ట్రం సాధించుకొని పదేళ్లు గడిచినా ఉద్యమం కోసం పని చేసిన ఒక్క ఉద్యమకారుడు కూడా బాగు పడలేదు. పనులు విడిచిపెట్టి ఉద్యమంలో పాల్గొన్నాం. మాపై ఎన్నో కేసులు పెట్టారు. అయినా లెక్క చేయకుండా ఉద్యమంలో పాల్గొన్నాం. తెలంగాణ వస్తే ప్రజల ఆకాంక్షలు నేరవేరుతాయని ఆశపడ్డాం. కానీ ఎక్కడ వేసిన గొంగడి అక్కడే ఉన్నది. ప్రభుత్వం వారి స్వార్థ రాజకీయాల కోసం తెలంగాణ ఉద్యమకారులను పక్కన పెట్టి ఇతర పార్టీల నుంచి ఉద్యమ వ్యతిరేకులను చేర్చుకొని వారికి పదవులను కట్టబెట్టి తెలంగాణ ప్రజల ఆకాంక్షలను నేరవేర్చలేదు. సబ్బండ వర్గాలను ఉద్యమంలో పాల్గొనేలా చేసిన చరిత్ర న్యాయవాదులది. --
సిద్దిరాములు, జేఏసీ కో కన్వీనర్, న్యాయవాది
ధర్నా చౌక్ విషయం..
తెలంగాణ రాష్ట్రం సాధించుకునేందుకు మలిదశ ఉద్యమంలో చురుకైన పాత్ర పోషించాం. కేసులను లెక్క చేయకుండా ఉద్యమంలో పాల్గొన్నాం. తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక ప్రభుత్వం ధర్నా చౌక్‌ను ఎత్తివేయడం సిగ్గు చెటైనా విషయం. కేసిఆర్ తన వారసత్వానికి ఇచ్చిన ప్రాధాన్యత తెలంగాణ ప్రజల ఆకాంక్షలకు ఇవ్వలేదు. కనీసం ఉద్యమకారులను కూడా పట్టించుకోలేదు. ఉద్యమంలో ప్రాణాలు అర్పించిన వారి కుటుంబాలకు మొక్కుబడి సహయం చేసి చేతులు దులుపుకున్నారు. కామారెడ్డి ప్రాంతంలో 20 మంది తెలంగాణ ఉద్యమకారులు ప్రాణాలు కోల్పోతే కేవలం ఎనిమిది మంది కుటుంబాలకు మాత్రమే ఔట్ సోర్సింగ్ ఉద్యోగాలు కట్టబెటారు.
వీఎల్ నర్సింహరెడ్డి, జేఏసీ కో కన్వీనర్, సీనియర్ న్యాయవాది
ఉద్యమ ఆకాంక్షలు నేరవేరలేదు
తెలంగాణ ప్రజల ఆకాంక్షలు నెరవేరలేదు. తెలంగాణ రాష్ట్రం సాధిం చుకున్న తరువాత సబ్బండ వర్గాల ప్రజలు సంతోషించారు. ఎన్నో ఉద్య మాలు చేసి, ఎంద రో ప్రాణాలను పణంగా పెట్టి సాధించుకున్న తెలంగాణలో పది సంవత్సరాల పాలన కేవలం వారి స్వలాభ రాజకీయ లబ్దికే సరిపోయింది. కేసిఆర్ కుటుంబం లాభపడ్డదే తప్ప తెలంగాణ ప్రజలు మాత్రం ఇప్పటికి కష్టాలు ఎదుర్కొంటున్నారు. ఏ ఒక్క ఆకాంక్ష కూడా నెరవేరలేదు. నీళ్లు, నిధులు, నియామకాలు అంటూ చెప్పి తెలంగాణ ప్రజలను కేసీఆర్ ప్రభుత్వం మరోసారి మోసం చేసింది. ప్రజల ఆకాంక్షలు ఈ ప్రభుత్వమైన నేరవేరుస్తుందా? లేక కాలయాపనతోనే గడుపుతుందా? అనే సందేహం కలుగుతోంది.
వెంకట్‌రాంరెడ్డి,
జేఏసీ కో కన్వీనర్, న్యాయవాది