మేడ్చల్ (విజయక్రాంతి): ఐదేళ్లు మంత్రిగా, అంతకుముందు అధికార పార్టీ ఎంపీగా పనిచేసి మేడ్చల్ ఆస్పత్రి అభివృద్ధికి ఏం చేశావని ఎమ్మెల్యే చామకూర మల్లారెడ్డి(MLA Chamakura Mallareddy)ని ఉద్యమకారుడు, బిజెపి నేత పాతూరి సుధాకర్ రెడ్డి నిలదీశారు. గురువారం మేడ్చల్ ప్రభుత్వ ఆసుపత్రి(Medchal Govt Hospital)లో డయాలసిస్ సెంటర్ ప్రారంభానికి ఎంపీ ఈటెల రాజేందర్(MP Etela Rajender)తో కలిసి మల్లారెడ్డి వచ్చారు. అక్కడే ఉన్న సుధాకర్ రెడ్డి ఆస్పత్రి అభివృద్ధికి మల్లారెడ్డి ఎలాంటి కృషి చేయలేదన్నారు. మంత్రిగా ఉన్నందున అభివృద్ధి చేయడానికి అవకాశం ఉండేదని, కానీ పట్టించుకోలేదన్నారు. దినదినాభివృద్ధి చెందుతున్న మేడ్చల్ లో 100 పడకల ఆసుపత్రి ఉంటే రోగులకు ఎంతో సౌకర్యంగా ఉండేది అన్నారు. పోస్టుమార్టం కోసం గాంధీ ఆసుపత్రి వరకు వెళ్లవలసి వస్తుందన్నారు. ఈ సందర్భంగా బిజెపి నాయకులకు, బీఆర్ఎస్ నాయకులకు మధ్య వాగ్వాదం జరిగింది.