calender_icon.png 3 April, 2025 | 2:49 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

పల్నాటి పౌరుషాన్నంతా ‘అర్జున్ సన్నాఫ్ వైజయంతి’లో చూస్తారు

31-03-2025 10:08:54 PM

నందమూరి కళ్యాణ్‌రామ్ హీరోగా నటిస్తున్న యాక్షన్-ప్యాక్డ్ ఫ్యామిలీ డ్రామా ‘అర్జున్ సన్నాఫ్ వైజయంతి’. ప్రదీప్ చిలుకూరి దర్శకత్వంలో అశోక క్రియేషన్స్, ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్లపై అశోక్‌వర్ధన్ ముప్పా, సునీల్ బలుసు నిర్మిస్తున్నారు. సయీ మంజ్రేకర్ కథానాయికగా నటించిన ఈ చిత్రంలో విజయశాంతి ఐపీఎస్ అధికారిగా కీలక పాత్ర పోషించారు. సోహైల్‌ఖాన్, శ్రీకాంత్, యానిమల్ పృథ్వీరాజ్ ఈ చిత్రంలో కీలక పాత్రల్లో కనిపించనున్నారు. 

తాజాగా ఈ సినిమా నుంచి ఫస్ట్ సింగిల్‌గా ‘నాయాల్ది’ పాటను రిలీజ్ చేయడం ద్వారా మ్యూజిక్ ప్రమోషన్స్‌ను కిక్ స్టార్ట్ చేశారు మేకర్స్. ఈ సాంగ్ లాంచ్ ఈవెంట్ సోమవారం ఆంధ్రప్రదేశ్‌లోని నరసరావుపేటలో జరిగింది. 

ఈ కార్యక్రమంలో హీరో నందమూరి కళ్యాణ్‌రామ్ మాట్లాడుతూ.. “ఈ వేడుక చూస్తుంటే సాంగ్ లాంచ్ ఈవెంట్‌లా లేదు.. ‘అర్జున్ సన్నాఫ్ వైజయంతి’ సక్సెస్ మీట్‌లా అనిపిస్తోంది. ప్రతిసారి మీ మన్ననలు పొందడానికి ప్రయత్నిస్తుంటా. ఈ మూవీ ట్రైలర్ లాంచ్ ఈవెంట్‌లో చెప్పినట్టు.. ‘అతనొక్కడే’ సినిమాలాగా ఇది కూడా మరో 20 ఏళ్లు  గుర్తుండిపోయే సినిమా అవుతుంది. ఇందులో మా అమ్మ పాత్ర చేసిన విజయశాంతి ఆ క్యారెక్టర్‌ను ఒప్పుకోవడం వల్లే ఈ సినిమా చేయగలిగాం. విజయశాంతికి ధన్యవాదాలు. అమ్మలను గౌరవించడం మన బాధ్యత. వాళ్లకోసం ఎంత త్యాగం చేసినా తప్పులేదు. ఈ సినిమాను అమ్మలందరికీ అంకితం చేస్తున్నాం’ అన్నారు. 

డైరెక్టర్ ప్రదీప్ చిలుకూరి మాట్లాడుతూ.. ‘నందమూరి అభిమానులు కళ్యాణ్‌రామ్‌ను ఎలా చూడాలని కోరుకుంటారో ఈ సినిమాలో అలా ఉంటారు. పల్నాటి పౌరుషం మొత్తం ఈ క్యారెక్టర్‌లో ఉంటుంది’ అని చెప్పారు. 

నిర్మాత అశోక్‌వర్ధన్ మాట్లాడుతూ... ‘ఈ పాటను పల్నాడు వేదికగా విడుదల చేస్తున్నందుకు మాకు చాలా గర్వంగా ఉంది. ఈ వేడుక చూస్తుంటే మా మూవీ సక్సెస్ ఈవెంట్‌లా ఉంది. ఈ సినిమాకు ప్రాణం కళ్యాణ్‌రామ్. మాది కొత్త ప్రొడక్షన్ హౌస్, కొత్త డైరెక్టర్. మమ్మల్ని కళ్యాణ్‌రామ్ ఎంతగానో ప్రోత్సహించారు. డైరెక్టర్ ప్రదీప్‌కు చాలా మంచి భవిష్యత్తు ఉంటుంది’ అని తెలిపారు. ఈ కార్యక్రమంలో చదలవాడ ఆదిత్యబాబు తదితరులు పాల్గొన్నారు.