01-04-2025 02:47:57 AM
హైదరాబాద్ సిటీబ్యూరో, మార్చి 31(విజయక్రాంతి) : ఎంఎంటీఎస్ రైలులో ఈ నెల 22న అనంతపురానికి చెందిన యువతిఐ అత్యాచారయత్నం చేసిన నిందితుడిని వెంటనే అరెస్ట్ చేయాలని కేంద్ర మంత్రి బండి సంజయ్ డిమాండ్ చేశారు. సోమవారం సికింద్రాబాద్ యశోద ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న బాధితురాలిని ఆయన పరామర్శించారు.
అనంతరం ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో మహిళలకు రక్షణలేదనేందుకు ఈ ఘటన నిదర్శనమని విమర్శించారు. రైలు నుంచి దూకిన ఘటనలో తీవ్రగాయాలైన బాధితురాలిని రైల్వే పోలీసులు, స్థానికులు గుర్తించి గాంధీ ఆస్పత్రిలో చేర్పించాక బీజేపీ మహిళా మోర్చ అధ్యక్షురాలు శిల్పారెడ్డి వెళ్లి ఆమెను పరామర్శించి బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్‌రెడ్డి ఆదేశాల మేరకు మెరుగైన చికిత్స కోసం యశోద ఆస్పత్రికి తరలించారన్నారు.
ఆ తర్వాత బాధితురాలు, ఆమె కుటుంబ సభ్యులతో తాను మాట్లాడానన్నారు. బాధితురాలి విషయంలో రాష్ట్ర ప్రభుత్వం స్పందించలేదని, గాంధీలో చేర్పించి చేతులు దులు పుకున్నారని ఆరోపించారు. బాధితురాలికి మెరుగైన వైద్యం అందించిన ఘనత బీజేపీదేనన్నారు. చికిత్స అనంతరం రెండు రోజుల క్రితమే ఆమె కోలుకుందన్నారు.
కుటుంబ పోషణ కోసం ఉద్యోగం చేసుకునేందుకు హైదరాబాద్‌కు వచ్చిన యువతిపై గుర్తు తెలియని వ్యక్తులు అఘాయిత్యానికి పాల్పడడం దుర్మార్గమన్నారు. బాధితురాలి స్టేట్‌మెంట్ రికార్డు చేయడం, సీసీ ఫుటేజీలను పరిశీలిస్తున్నామని, నిందితులను గుర్తించే ప్రయత్నం చేస్తున్నామని పోలీసులు చెబుతున్నారన్నారు.
కానీ నిందితులను పట్టుకున్నామని సీఎం అసెంబ్లీలో ప్రకటించారని పేర్కొన్నారు. సీఎం చెప్పేదానికి, పోలీసులు చెప్పేదానికి చాలా తేడా ఉందని విమర్శించారు. ఈ ఘటనను కేంద్ర ప్రభుత్వంపై నెట్టే ప్రయత్నం చేస్తున్నారని ఆరో పించారు.
లా అండ్ ఆర్డర్ రాష్ట్ర ప్రభు త్వం కంట్రోల్‌లో ఉంటుందని కానీ ఇది కేంద్ర ప్రభుత్వానికి సంబంధం లేదని స్పష్టం చేశారు. ఏదైనా మంచి జరిగితే వాళ్ల ఖాతా లో వేసుకుంటున్నారని, చెడు జరిగితే కేం ద్రంపై నెడుతారని విమర్శించారు. నిందితుడిని పట్టుకోకపోవడం మూర్ఖత్వమన్నారు.