సినీతారలకు ట్రోలింగ్ అనేది సర్వసాధారణం. కొన్ని సందర్భాల్లో వాళ్లు ఏం చేసినా.. ఎందుకు చేశారనేది తెలుసుకోకుండా ట్రోల్ చేస్తుంటారు. ఇలాంటి సందర్భంలో వారు దారుణమైన అవమానాలు ఎదుర్కొంటూ ఉంటారు. బాలీవుడ్ బ్యూటీ ఊర్వశీ రౌతేలా కూడా ఎలాంటి తప్పు చేయకుండానే తను చేసిన ఒక పనితో ట్రోలింగ్‌కు గురయ్యారు. గత ఏడాది జూలైలో ఆమెకు సంబంధించిన బాత్రూం వీడియో ఒకటి బయటకు వచ్చింది.
అది నెట్టింట పోస్ట్ చేసింది కూడా ఊర్వశినే కావడం గమనార్హం. దీనిని చూసిన నెటిజన్స్ ఆమెపై మండిపడ్డారు. విపరీతంగా ట్రోల్ చేశారు. దీంతో ఆమె డిలీట్ చేసింది. అయితే అదేమీ ఆమె ప్రైవేట్ వీడియో కాదు. ఒక సినిమాలోని సన్నివేశం. తాజాగా ఒక ఇంటర్వ్యూలో ఆ వీడియోపై ఊర్వశి స్పందించారు. తాను కావాలని ఆ వీడియోను నెట్టింట పోస్ట్ చేయలేదని, నిర్మాతల బాధను చూడలేక పోస్ట్ చేయాల్సి వచ్చిందని తెలిపింది.
“అది నా ప్రైవేట్ వీడియో కాదు.. ‘ఘుస్పైథియా’ సినిమాలోని ఓ సన్నివేశం. అది మాత్రమే లీక్ చేయడానికి ఒక పెద్ద కారణం ఉంది. ఆ సినిమా మేకర్స్ ఒకరోజు నా దగ్గరకు వచ్చి ఆస్తులన్నీ అమ్మి సినిమా తీశామని, కొన్ని కారణాలతో రిలీజ్ చేయలేకపోయామని ఆవేదన వ్యక్తం చేశారు. బాత్రూం వీడియో లీక్ చేస్తే సినిమాకు బజ్ వస్తుందని.. అలాగే అమ్మాయిలకు అవగాహన కల్పించినట్టు ఉంటుందని చెప్పడంతో లీక్ చేశారు. ఇదంతా మేకర్స్ అనుమతి తోనే చేయాల్సి వచ్చింది. మేకర్స్ అప్పుల బాధ నుంచి బయటపడతారని.. అలాగే బాత్రూం సీన్ చూసి అమ్మాయిలు జాగ్రత్తగా ఉంటారని లీక్ చేశాను” అని ఊర్వశి చెప్పుకొచ్చారు.