09-04-2025 12:00:00 AM
స్టార్ హీరో ప్రభాస్, డైరెక్టర్ మారుతి కాంబోలో రూపొందిస్తున్న తాజా చిత్రం ‘రాజాసాబ్’. ఈ సినిమాను పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్‌పై టీజీ విశ్వప్రసాద్ నిర్మిస్తున్నారు. ప్రభాస్ ఇప్పటిదాకా చేయని రొమాంటిక్ హారర్ జానర్‌లో రూపొందుతోందీ చిత్రం. దీంతో ఈ సినిమాపై మొదట్నుంచే ప్రేక్షకుల్లో ఆసక్తి నెలకొంది. హీరోయిన్లు నిధి అగర్వాల్, మాళవిక మోహనన్, రిద్దీ కుమార్ కీలక పాత్రల్లో కనిపించనున్న ఈ సినిమా ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటోంది.
అయితే ముందుగా ప్రకటించిన షెడ్యూల్ ప్రకారం ఏప్రిల్ 10న ఈ సినిమా విడుదల కావాల్సి ఉంది. అనివార్య కారణాల వల్ల ఇది వాయిదా పడింది. 2025 నవంబర్‌లో ఈ చిత్రం విడుదల కానుందనే ప్రచారం జరుగుతుందే తప్ప మేకర్స్ ఇప్పటివరకు అధికారికంగా రిలీజ్ డేట్ ప్రకటించలేదు. ఇంకా నిరుడు వీడియో గ్లింప్స్ తప్ప ఎలాంటి అప్డేట్ రాలేదు. అప్పట్నుంచి డార్లింగ్ ఫ్యాన్స్ అప్డేట్స్ కోసం ఎదురుచూస్తున్నారు.
అయితే, డైరెక్టర్ మారుతి తాజాగా ఆధ్యాత్మిక క్షేత్రాల యాత్ర ఫొటోలను సోషల్ మీడియాలో షేర్ చేశారు. దీంతో ప్రభాస్ అభిమాని ఒకరు ‘రాజాసాబ్’ రిలీజ్ గురించి క్లారిటీ ఇవ్వాలని కోరారు. ‘మీరు ప్రాజెక్ట్ ఔట్‌పుట్‌తో పూర్తిగా సంతృప్తి చెందినప్పుడే సినిమా విడుద ల చేయండి. కానీ, నవంబర్‌లో వస్తుందా..? లేక వచ్చే ఏడాది విడుదల చేస్తారా? అనేది మీడి యా ద్వారా అప్డేట్ ఇవ్వండి.
అభిమానులు మిమ్మల్ని ఇబ్బందిపెట్టరు’ అని కామెంట్ సెక్షన్‌లో రాసుకొచ్చారు. దీనికి మారుతి స్పందించారు. ‘సీజీ ఔట్‌పుట్ త్వరలోనే వస్తుంది. అది వేరిఫై అయ్యాక మేకర్స్ అప్డేట్ ఇస్తారు. ఈ ప్రాజెక్ట్ కోసం ఎందరో కష్టపడి పనిచేస్తున్నారు. ఇది ఒక్కడి వల్ల సాధ్యమయ్యేది కాదు. నాణ్యమైన ఔట్‌పుట్ ఇవ్వాలంటే కాస్త సమయం పడుతుంది. అందు కే కాస్త ఓపిగ్గా ఉండండి.
మా టీమ్ అంతా మీ అంచనాలను అందుకోవడానికే కష్టపడి పనిచేస్తున్నాం’ అని సమాధానమిచ్చారు. పాన్‌ఇండియా స్థాయిలో తెలుగు, తమిళ, మలయాళ, కన్న డ, హిందీలో విడుదల కానున్న ఈ చిత్రానికి కార్తీక్ పళని ఛాయాగ్రాహకుడిగా, తమన్ సంగీత దర్శకుడిగా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు.