calender_icon.png 14 January, 2025 | 5:41 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఇంతకాలం అందుకే ఒప్పుకోలేదు

14-01-2025 01:05:18 AM

తెలుగు నాట ఎంట్రీ ఇవ్వడంతోనే అందం, అభినయంతో అందరి మనసుల్ని దోచేసింది నిధి అగర్వాల్. తెలుగు, తమిళంలో చకచకా కొన్ని సినిమాలు చేసిన ఈ అందాల నిధి.. పవన్‌కళ్యాణ్ ‘హరిహర వీరమల్లు’కు సైన్ చేసిన తర్వాత ఏ సినిమానూ ఒప్పుకోలేదు. చాలా ఏళ్ల తర్వాత ప్రభాస్ ‘రాజాసాబ్’లో నిధి భాగమైనట్టు ఆ చిత్రబృందం ఇటీవలే ప్రకటించింది.

2019లోనే ‘హరిహర వీరమల్లు’కు ఓకే చెప్పిన నిధి.. సినిమాలేవీ ఓకే చేయకపోవడంపై పలుమార్లు వార్తలొచ్చాయి. అయితే తాను ఇన్నేళ్లపాటు ఒకే ప్రాజెక్టుపై ఎందుకు ఉండాల్సి వచ్చిందో తాజాగా ఓ ఇంటర్వ్యూలో బయటపెట్టింది నిధి అగర్వాల్. “నేను లాక్‌డౌన్ ముందే ‘హరిహర వీరమల్లు’కు సైన్ చేశాను.

పవన్ కళ్యాణ్ సర్ పాలిటిక్స్‌తో బిజీగా ఉన్నారు, కాబట్టి ఆయన షూటింగ్‌కు డేట్స్ ఇచ్చినప్పుడు నేను కూడా ఇస్తానని, ఆ సినిమా అయ్యేంతవరకు మరో మూవీ ఒప్పుకోనని ఒప్పందంపై సైన్ చేశాను. ఆ సినిమా దాదాపు నాలుగేళ్లు పట్టింది. ఈ గ్యాప్‌లో చాలా సినిమాలు వచ్చినా, ఆ కాంట్రాక్టు వల్ల ఏవీ ఒప్పుకోలేదు.

ప్రభాస్‌తో అవకాశాన్ని వదులుకోకూడదని ‘వీరమల్లు’ మేకర్స్‌కు రిక్వెస్ట్ చేశాను. షూటింగ్స్‌కు క్లాష్ రానివ్వనని చెప్పి ‘రాజాసాబ్’కు ఓకే చెప్పాను. తర్వాత అనుకోకుండా రెండు షూటింగ్స్ ఒకేసారి వచ్చాయి. దీంతో కొన్ని రోజులు రెండు షిప్టుల్లో పనిచేశాను. విజయవాడ, హైదరాబాద్‌లో ఒకే రోజు షూటింగ్‌లో పాల్గొన్న రోజులూ ఉన్నాయి.

నేను ఒప్పుకున్న కాంట్రాక్టు కాబట్టి ‘వీరమల్లు’ విషయంలో ఎవర్నీ ఏమీ అనలేను. ఈ సినిమా కారణంగా కొన్ని అవకాశాలు చేజారినప్పుడు బాధనిపించింది. ఇంతకాలం ఈ పెద్ద సినిమాల కోసం ఎదురుచూసిన నాకు ఫలితం కచ్చితంగా దక్కుతుంది” అని చెప్పుకొచ్చింది నిధి.