14-03-2025 12:00:00 AM
నాని వాల్ పోస్టర్ సినిమా ప్రెజెంట్ చేస్తున్న మూవీ ‘కోర్ట్:- స్టేట్ వర్సెస్ ఎ నోబడీ’. ప్రియదర్శి ప్రధాన పాత్రలో నటిస్తున్న ఈ చిత్రానికి రామ్ జగదీష్ దర్శకత్వం వహించారు. ప్రశాంతి తిపిర్నేని నిర్మించారు. దీప్తి గంటా సహ నిర్మాతగా వ్యవహరించారు. ఈ చిత్రం మార్చి 14న విడుదల కానుంది. ఈ నేపథ్యంలో నిర్మాతలు ప్రశాంతి తిపిర్నేని, దీప్తి గంటా విలేకరుల సమావేశంలో సినిమా విశేషాలు పంచుకున్నారు.
‘కోర్టు’ కథ విన్నాక ఏమనిపించింది?
-దీప్తి: నాని, ప్రశాంతి గారు స్క్రిప్ట్ విని ఓకే చేశారు. నేను ఆన్సెట్ ప్రొడ్యూసర్ గా జాయిన్ అయ్యాను. నేను రోజు సెట్స్ లో వుండేదాన్ని. నాని, ప్రశాంతి నాకు చాలా ఫ్రీడమ్ ఇచ్చారు.
వాల్ పోస్టర్ సినిమాలో కథ ఓకే అవడం ఎలా ఉంది?
-ప్రశాంతి: నాని, నేను ఇద్దరం కథ వింటాం. అయితే మా నమ్మకం అంతా నాని జడ్జిమెంట్ మీదే ఉంటుంది. ఆయన పెద్దగా లెక్కలేమీ వేయరు. ఒక కథ థియేటర్లో చూడాలనిపించేలా ఉంటే ఓకే చేస్తారు.
ప్రీమియర్స్‌కి ఎలాంటి రెస్పాన్స్ వస్తోంది ?
-ప్రశాంతి: ప్రీమియర్స్‌కి రెస్పాన్స్ చాలా బావుంది. మేము అనుకున్నదాని కంటే అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. ఇలాంటి జోనర్ సినిమాని ఆడియన్స్ ఆదరించి బిగ్ సక్సెస్ చేయడం చాలా ఆనందంగా అనిపిస్తోంది. -ప్రిమియర్స్ కి కొందరు లాయర్స్ కూడా వచ్చారు. వారికి చాలా నచ్చింది. ఒక కోర్ట్ రూమ్ డ్రామాని ఇంత నేచురల్‌గా ప్రజెంట్ చేయడం ఇంతముందు చూడలేదని చెప్పారు. ఇది మాకు మంచి కాంప్లిమెంట్.
మీకు ఇందులో నచ్చిన పాయింట్స్ ఏమిటి ?
-దీప్తి: చాలా పాయింట్స్ ఉన్నాయి. రోహిణి గారి క్యారెక్టర్‌తో వచ్చే ఓ సీన్ చాలా నచ్చింది. అలాగే మంగపతి క్యారెక్టర్‌లో శివాజీ గారు అద్భుతంగా చేశారు. ప్రతి ఇంట్లో అలాంటి ఓ క్యారెక్టర్ ఉంటుంది.
డైరెక్టర్ జగదీశ్ గురించి?
-ప్రశాంతి: డైరెక్టర్ జగదీశ్ ఈ సినిమాని చాలా రీసెర్చ్ చేసి రాశాడు. అందుకే సినిమా చాలా నేచురల్ గా వచ్చింది. పోక్సో చట్టం గురించి ఆయన చాలా డీటెయిల్ ప్రజెంట్ చేశాడు.
‘కోరు’్ట నచ్చకుంటే ‘హిట్ 3’ చూడొద్దని చెప్పడం ఎలా అనిపించింది ?
-దీప్తి: మాకు షాకే. నేను, ప్రశాంతి.. డైరెక్టర్ శైలేష్ వంక చూశాం(నవ్వుతూ). తనకి నమ్మకం వుంది కాబట్టే ఆ మాటని కాన్ఫిడెంట్ గా చెప్పారు.
ఈ సినిమా కోసం ఎక్కడ ఎక్కువ స్పెండ్ చేశారు ?
-దీప్తి: సెట్స్ పరంగా ఎక్కువ స్పెండ్ చేయలేదు కానీ ఈ కథకు మంచి యాక్టర్స్ కావాలి. ఆ విషయంలో రాజీ పడలేదు. ప్రియదర్శి తో పాటు రోహిణీ గారు, సాయి కుమార్ గారు, శివాజీ గారు, హర్ష వర్ధన్ గారు .. ఇలా మంచి యాక్టర్స్ వున్నారు. రోషన్ శ్రీదేవి కూడా వారి పాత్రలకు పర్ఫెక్ట్ గా ఫిట్ అయ్యారు.
మీ కథల ఎంపిక ఎలా ఉంటుంది ?
-ప్రశాంతి: జానర్ ఏదైనా కథలో నిజాయితీ ఉండాలి. కథలో హానెస్టీ, డైరెక్టర్ లో క్లారిటీ వుంటే ముందుకు వెళ్తాం. నాని గారు ఇదే చూస్తారు.
మీ దర్శకత్వంలో సినిమా ఎప్పుడు ?
-దీప్తి: నేను ‘మీట్ క్యూట్’ చేసిన తర్వాత యు ఎస్ వెళ్ళిపోయాను. ఈ సినిమా కోసం మళ్ళీ వచ్చాను. కొన్ని ఐడియాలు ఉన్నాయి. వాటిని స్క్రిప్ట్ గా డెవలప్ చేయాలి.